ఆలయాల్లో చోరీ

17 Sep, 2016 23:39 IST|Sakshi
బొమ్మిరెడ్డిపల్లె పామయ్యతాత గుడిలో హుండీ పగులగొట్టిన దశ్యం
– రూ. 2 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు అపహరణ
– వరుస చోరీలతో పూజారుల ఆందోళన
 
వెల్దుర్తి రూరల్‌: ఆలయాలే టార్గెట్‌గా దొంగలు స్వైర విహారం చేస్తున్నారు. ఊరికి దూరంగా ఉన్న గుళ్లను ఎంచుకుని చోరీలకు పాల్పడుతున్నారు. శుక్రవారం అర్ధరాత్రి వెల్దుర్తి మండలంలో రెండు ఆలయాల్లో విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు హుండీ డబ్బులను అపహరించారు. బొమ్మిరెడ్డిపల్లెలోని హైవే పక్కన ఉన్న పామయ్యస్వామి ఆలయ తాళం పగులగొట్టి హుండీతో పాటు గర్భగుడిలోని పది వెండి పడుగలు ఎత్తుకెళ్లారు. ఖాళీ హుండీని మల్లెపల్లెరోడ్డులో పడేసి వెళ్లారు.
 
          అందులో దాదాపు 35వేల నగదు అపహరణకు గురైనట్లు గ్రామ నాయకుడు లక్ష్మీరెడ్డితోపాటు గ్రామస్తులు, పూజారి తెలిపారు. అదే రోజు రాత్రి బ్రహ్మగుండం సమీపంలో రామళ్లకోట రహదారిలోని నిత్యాంజనేయ స్వామి క్షేత్రంలోని రెండు చిన్న ఆలయాల్లో చోరీ జరిగింది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని అమ్మవారి రెండు తులాల నాలుగు బంగారు పుస్తెలు, 20 తులాల వెండి కిరీటం, రాగి చెంబులతో పాటు హుండీని, మైక్‌సెట్‌ను దొంగలు అపహరించారు. అనంతరం పక్కనే ఉన్న రాములవారి ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు సీతాదేవి అమ్మవారి విగ్రహం మెడలోని రెండు బంగారు పుస్తెలు (తులం) అపహరించారు. పక్కనే ఉన్న కాశిరెడ్డినాయన ఆశ్రమంలోని తలుపులను పగులగొట్టి హుండీని, వంట సామగ్రిని సైతం ఎత్తుకెళ్లారు. ఈ రెండు ఆలయాల హుండీ మొత్తం, బంగారు, వెండి, వస్తువుల విలువ కలిపి దాదాపు లక్షన్నర సొత్తు చోరీ జరిగినట్లు పూజారి మాధవి తెలిపారు. ఆలయం పక్కనే ఉన్న ఇంట్లో నివాసం ఉంటున్నానని, తన ఇంటి తలుపును కూడా ఎవరో అర్ధరాత్రి శబ్దం చేయడంతో భయపడి తెలుపు తీయలేదన్నారు. ఆటో శబ్దం వచ్చిందన్నారు. తెల్లారేసరికి ఆలయాలు తెరిచి ఉంచడంతో చోరీ జరిగిందని గ్రామస్తులకు చెప్పానన్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. కొద్ది నెలలుగా మండలంలోని సర్పరాజపురం సుంకులమ్మ ఆలయం, రామల్లకోట పెద్దమ్మ గుడి, వెల్దుర్తి ఎల్లమ్మ గుడి, మదార్‌పురం గోదుమారి ఎల్లమ్మ ఆలయాల్లో చోరీలు జరిగాయి. వరుస చోరీలతో పూజారులు, భక్తులు ఆందోళన చెందుతున్నారు.    
 
మరిన్ని వార్తలు