పట్టపగలు చోరీ

26 Mar, 2017 23:14 IST|Sakshi
పట్టపగలు చోరీ

59 సవర్ల బంగారు నగలు, రూ. 1.45 లక్షలు నగదు అపహరణ

నాయుడుపేటటౌన్‌ : పట్టణంలో పట్టపగలే దొంగలు ఓ ఇంటిని లూటీ చేశారు. సుమారు రూ. 20 లక్షలకు పైగా విలువ చేసే సొత్తును అపహరించారు. ఈ సంఘటన శనివారం జరిగింది. నాయుడుపేటలోని పెసల గురప్పశెట్టి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపల్‌గా కల్లూరు గురవయ్య, ఆయన సతీమణి సౌరమ్మ పట్టణంలోని టంగుటూరు ప్రకాశం పంతులు పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. వీరు పిచ్చిరెడ్డితోపులోని విద్యుత్‌ సబ్‌డివిజన్‌ కార్యాలయం సమీపంలో నివాసముంటున్నారు. శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో సౌరమ్మ పాఠశాలకు వెళ్లగా, గురవయ్య పరీక్ష పేపర్‌ వాల్యుయేషన్‌కు నెల్లూరుకు వెళ్లారు.

మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో సౌరమ్మ పాఠశాల నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంటికి మరో వైపు ఉన్న తలుపు పగులగొట్టి ఉంది. ఇంట్లో ప్రవేశించిన దుండగులు ఓ చోట దాచి ఉన్న బీరువా తాళాలతో రెండు బెడ్‌రూంల్లో బీరువాలు, హాలులో ఉన్న ర్యాక్‌లను తెరిచి అందులోని 59 సవర్ల బంగారు నగలు, రూ.1.45 లక్షల నగదు, అర కేజీకి పైగా వెండి వస్తువులను అపహరించినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ జరిగిన తీరు చూస్తే స్థానికులపైనే అనుమానం ఎక్కువగా ఉంది.

భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులు కావడంతో కొద్ది రోజులుగా రెక్కీ వేసి అదను చూసి చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న ఎస్సై మారుతీకృష్ణతో పాటు ఐడీ పార్టీ సిబ్బంది సంఘటనా స్థలాన్ని నిశితంగా పరిశీలించారు. దొంగలు తలుపులు పగులగొట్టేందుకు వాడిన రెండు ఇనుప గునపాలను ఇంటి లోపల పడేసి ఉండడాన్ని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు నుంచి వచ్చిన క్లూస్‌టీం వేలిముద్రలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు