సినీఫక్కీలో చోరీ

17 Jan, 2017 01:54 IST|Sakshi
సినీఫక్కీలో చోరీ
ఉంగుటూరు : ఉంగుటూరులోని ఓ ఇంటిని దోచుకున్న దొంగలు సినీఫక్కీలో పరారయ్యారు. ఈ ఉదంతం ఆదివారం అర్ధరాత్రి జరిగింది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. ఉంగుటూరులో జాతీయ రహదారి పక్కన మోగంటి రామమోహనరావుకు ఆటోమొబైల్‌ షాపు ఉంది. అక్కడే ఆయన ఇల్లు కూడా. ఆయన కుటుంబ సమేతంగా కారులో ఆదివారం ఉదయం బందరులోని బంధువుల ఇంటికి వెళ్లారు. తిరిగి అర్ధరాత్రి వచ్చారు. రామమోహనరావు, ఆయన తండ్రి వేణుగోపాలరావు కారు దిగారు. రామమోహనరావు భార్య లలిత ఇంటి తాళాలు అతనికి ఇచ్చి కారులో నిద్రపోయిన కూతురు శ్రుతిని లేపుతుండగా ఓ ఆగంతకుడు ఆమె మెడలోని మంగళసూత్రాలను లాగేందుకు యత్నించాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో రామమోహనరావు, వేణుగోపాల్‌ అతనివెంట పడ్డారు. అయినా ఫలితం లేకపోయింది. ఆ తర్వాత అనుమానం వచ్చి ఇంటిలోకి వెళ్లి పరిశీలించగా, సామగ్రి చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువాలోని 8 కాసుల బంగారం, అర కేజీ వెండి, రూ.25వేలు కనిపించలేదు. మొత్తం విలువ రూ.2.50లక్షలుపైనే ఉంటుంది.  ఇంటి వెనుక తలుపులను బద్దలుకొట్టి దుండగులు లోపలికి ప్రవేశించినట్టు గుర్తించారు. ఆ ప్రాతంలో ఇనుపరాడ్‌ పడేసి ఉంది. చోరీకి వచ్చిన దుండగులు ఓ వ్యక్తిని బయట కాపలా ఉంచి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆ వ్యక్తి లోపలున్న వ్యక్తులకు సిగ్నల్‌ ఇవ్వడానికే మంగళసూత్రం లాగేందుకు యత్నించాడని, బయట కేకలు విని లోపల ఉన్న దుండగులు పారిపోయి ఉంటారని రామమోహనరావు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.  అనంతరం రామమోహనరావు 108కి సమాచారం ఇవ్వగా అక్కడి నుంచి చేబ్రోలు స్టేషన్‌కు సమాచారం వచ్చింది. దీంతో ఏలూరు నుంచి వచ్చిన క్లూస్‌ టీమ్‌ సీఐ నరసింహమూర్తి  వేలిముద్రలు సేకరించారు. చేబ్రోలు ఎస్సై చావా సురేష్‌ ఘటనా ప్రదేశానికి వచ్చి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
భీతిల్లిపోయా
‘నా మెడలో మంగళ సూత్రం లాగేందుకు ఓ వ్యక్తి యత్నించడంతో భీతిల్లిపోయా’ అని మోగంటి లలిత ఆవేదనతో చెప్పారు. దొంగ ఎర్రగా, పొట్టిగా ఉన్నాడని, 22 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉంటుందని పేర్కొన్నారు. తాము వచ్చే సమయానికే ఇంటిలో దొంగలు ఉన్నారని, వారిని అక్కడి నుంచి పంపించడానికే బయట ఉన్న దొంగ తన మంగళసూత్రం లాగాడని, తాను కేకలు వేయడంతో లోపలున్న దొంగలు పరారయ్యారని వివరించారు. 
 
మరిన్ని వార్తలు