22 నేరాలకు పాల్పడిన 13 మంది పట్టివేత

1 Oct, 2016 22:41 IST|Sakshi
22 నేరాలకు పాల్పడిన 13 మంది పట్టివేత
  • రూ.29.50 లక్షలు సొత్తు రికవరీ
  • కాకినాడ రూరల్‌ : 
    మూడేళ్లుగా జిల్లాలో వివిధ చోరీలకు పాల్పడుతున్న 13 మందిని కాకినాడ క్రైమ్‌ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. వీరి నుంచి రూ. 29.50 లక్షల విలువైన సొత్తు రికవరీ చేశారు. కాకినాడ గొడారిగుంట దుర్గానగర్‌ వెనుక ఖాళీ స్థలంలో వీరిని శుక్రవారం రాత్రి క్రైమ్‌ పోలీసులు దాడిచేసి పట్టుకున్నట్టు ఏఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ తెలిపారు. కాకినాడ క్రైమ్‌ డీఎస్పీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో క్రైమ్‌ డీఎస్సీ పిట్టా సోమశేఖర్‌తో కలసి ఆయన మాట్లాడారు. పెద్దాపురం, రాజమహేంద్రవరం, కాకినాడ ప్రాంతాలకు చెందిన 17 మంది ముఠాగా ఏర్పడి మూడేళ్లుగా జిల్లాల్లో 22 నేరాలకు పాల్పడ్డారని ఆయన తెలిపారు. వారు∙రూ.63.46 లక్షల విలువైన బంగారం, వెండి, నగదు, మోటారు సైకిళ్లు, ట్యాబ్‌లు చోరీ చేశారని చెప్పారు. ఇందులో రూ.29.32 లక్షల విలువైన 1,173 గ్రాముల బంగారం, రూ.5.45 లక్షల విలువైన 13.625 కిలోల వెండి వస్తువులు ఉన్నాయన్నారు. పెద్దాపురం మండలం గోరింట గ్రామానికి చెందిన పిడుగు శ్రీనివాస తమ్మారావు అలియాస్‌ బాబి గ్యాంగ్‌ లీడర్‌గా వ్యవహరించినట్టు ఏఎస్పీ తెలిపారు. 
    పెద్దాపురం ఎలక్ట్రికల్‌ కార్యాలయంలో ప్రైవేట్‌ కార్మికునిగా పనిచేసే తమ్మారావుకు కాకినాడకు చెందిన పెద్ద నేరస్తుడైన ఘంటసాల రమణ అలియాస్‌ రమణబాబుతో సంబంధాలు ఏర్పడ్డాయన్నారు. రమణబాబు పోర్టులో దొంగతనం చేసి తెచ్చిన ఎరువులు, మొక్కజొన్నలు, బియ్యం అమ్మి తమ్మారావు కమీషన్‌ తీసుకునేవాడు. దుర్వ్యసనాలకు బానిసైన తమ్మారావుకు రమణబాబు గ్యాంగ్‌నుంచి, ఎలక్ట్రికల్‌ ఆఫీసులో వచ్చే డబ్బులు చాలక పోవడంతో  దొంగతనాలకు దిగాడు. తన స్నేహితులైన గోరింటకు చెందిన ఏడుగురిని, రాజమహేంద్రవరానికి చెందిన ముగ్గురిని, కాకినాడకు చెందిన ఏడుగురితో దొంగల ముఠాగా ఏర్పాటు చేశాడు. వారు 2014 నుంచి ఇళ్లల్లో దొంగతనాలు, దోపిడీలు చేస్తున్నారు. ఆ డబ్బులు పంచుకుని వారు జల్సాలకు,  చెడు అలవాట్లకు ఖర్చు చేసేవారని ఏఎస్పీ దామోదర్‌ వివరించారు. వీరందరూ కలసి మారుతీ 800 కారును, 220 సీసీ పల్సర్‌ మోటార్‌సైకిల్, హీరో హోండా స్లె్పండర్, పేషన్‌ఫ్లస్‌ తదితర వాహనాలను ఉపయోగించి దొంగతనాలకు పాల్పడేవారన్నారు. 
    వెండి, బంగారం వస్తువులతో పాటు రూ. 27.86 లక్షల నగదు, రూ. 75 వేలు విలువైన మూడు మోటార్‌సైకిళ్లు, రూ. 10వేలు విలువైన ట్యాబ్‌ మొత్తం రూ. 63.46 లక్షలు విలువైన వస్తువులు వీరు చోరీ చేసినట్టు   పోలీసులు గుర్తించారు. వాటిలో రూ. 22.35 లక్షల విలువైన 894 గ్రాముల బంగారం, 10.019 కిలోల వెండి, రూ. 1.85 లక్షల నగదు, రూ. 10 వేలు విలువైన ట్యాబ్‌ను పోలీసులు రికవరీ చేశామన్నారు. ఈ ఏడాది జూలైలో కాకినాడ పళ్లంరాజు నగర్‌ రోడ్‌నంబర్‌ 1లో రిలయన్స్‌ కంపెనీ వారి ఇంటిల్లో రాత్రిపూట జరిగిన దోపిడీ కేసులో ఈ గ్యాంగ్‌లో 13 మందిని పట్టుకున్నట్లు దామోదర్‌ వివరించారు. మరో నలుగురు పరారీలో ఉన్నారన్నారు. వారిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. 
     
మరిన్ని వార్తలు