మా రోజులు మారాయి

7 Jul, 2016 15:46 IST|Sakshi
మా రోజులు మారాయి

జిల్లావాసుల ఆదరణ మరువలేనిదని, తమ చిత్రాన్ని గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు తమ చిత్రయూనిట్ ఎంతగానో రుణపడి ఉందని, ఈ చిత్రంతో ‘మా రోజులు మారాయి’ అని అన్నారు ‘రోజులు మారాయి’ చిత్ర హీరోలు, హీరోయిన్. ఆ చిత్ర యూనిట్ బుధవారం కాకినాడ, రాజమహేంద్రవరంలలో సందడి చేసింది. చిత్ర విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా వచ్చిన హీరోలు పార్వతీశం, చేతన్‌మద్దినేని, హీరోయిన్ కృతిక, దర్శకుడు మురళీకృష్ణ ‘సాక్షి’తో ముచ్చటించారు.

సినిమా విశేషాలు వెల్లడించారు. కాకినాడ శ్రీప్రియ థియేటర్‌ను సందర్శించిన చిత్రయూనిట్‌కు థియేటర్ యాజమాన్యం ఘన స్వాగతం పలికి, పుష్పగుచ్ఛాలతో అభినందించింది. చిత్ర కథానాయిక కృతిక మాట్లాడుతూ హాస్యం, సస్పెన్స్ తో నిర్మించి ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోందన్నారు. తనకు ‘దృశ్యం’ చిత్రం బాగా గుర్తింపు తెచ్చిందన్నారు.                  
 
‘కేరింత’ నూకరాజని పిలుస్తున్నారు
 రోజులు మారాయి హీరో పార్వతీశం
 
ఆల్కాట్‌తోట(రాజమహేంద్రవరం) : తనను ఇప్పటి వరకు ప్రేక్షకులు ‘కేరింత’ నూకరాజుగానే గుర్తిస్తున్నారని, అదే తనపేరైందని ‘రోజులు మారాయి’ హీరో పార్వతీశం పేర్కొన్నారు. స్థానిక ఆనందరీజెన్సీ హోటల్‌లో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.

సాక్షి : స్వగ్రామం, పెరిగింది ఎక్కడ?
పార్వతీశం : స్వగ్రామం పలాస, బెంగళూరులో పెరిగా. అక్కడే బీటెక్ చదివా, యాక్టింగ్‌పై మక్కువతో హైదరాబాద్ వచ్చేశా.


సాక్షి : ఇప్పటి వరకు చేసిన సినిమాలు?
పార్వతీశం : కేరింత, రోజులు మారాయి చిత్రాలు చేశాను. బెక్కం వేణుగోపాల్ నిర్మాతగా ‘నాన్నా.. నేను నా బాయ్‌ప్రెండ్స్’ చిత్రం చేస్తున్నా. హెబ్సాపటేల్ హీరోయిన్‌గా చేస్తుంది.


సాక్షి : రోజులు మారాయి చిత్రానికి ఎలాంటి స్పందన వస్తోంది?
పార్వతీశం : రోజులు మారాయి చిత్రానికి రోజురోజుకి ఆదరణ పెరుగుతోంది. మేము వెళుతున్న ప్రతి థియేటర్‌లో ఈ సినిమాలో పీటర్ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కేరింత నూకరాజు అనేవారు పీటర్ అంటూ పిలుస్తున్నారు. సినిమాలోని డైలాగులు నాకంటే ముందే ప్రేక్షకులు చెప్పేస్తుండడంతో చాలా ఆనందంగా ఉంది.


సాక్షి : ఏ పాత్రలు చేయాలని అనుకుంటున్నారు?
పార్వతీశం : ప్రకాష్‌రాజ్, నాని, అమీర్‌ఖాన్‌లు అంటే చాలా ఇష్టం. అన్ని రకాల పాత్రలలో నటించాలన్నదే తన ఆకాంక్ష.

 
 
 ‘తొలి సినిమాకే ఆదరణ చూపిస్తున్నారు’
 రోజులు మారాయి హీరో చేతన్ మద్దినేని
తాను నటించిన మొదటి సినిమా ‘రోజులు మారాయి’కి ప్రేక్షకులను నుంచి మంచి ఆదరణ లభిస్తోందని సినిమా హీరో చేతన్ మద్దినేని పేర్కొన్నారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే. ‘‘మా స్వగ్రామం విశాఖపట్నం. 15 ఏళ్ల క్రితం తల్లిదండ్రులు యూఎస్‌లో సెటిల్‌అయ్యారు.

యాక్టింగ్‌పై మక్కువతో హైదరాబాద్‌లో ఉంటున్నా. రోజులుమారాయి నా మొదటి సినిమా. సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వంలో ‘గల్ఫ్’సినిమాలో నటించాను. మూడు భాషల్లో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. రోజులు మారాయి చిత్రం నాకు ఎంతగానో గుర్తింపు తెచ్చింది. ప్రతి థియేటర్‌లో నన్ను ఈజీగానే గుర్తుపట్టారు. రిపీట్ ఆడియన్స్ ఎక్కువగా వస్తున్నారు. మేము చెప్పే డైలాగులను ముందుగానే ప్రేక్షకులు చెప్పడం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది.
 
 అన్ని రకాల పాత్రలను చేస్తాను. అంతేకాకుండా దర్శకుడు మారుతి చిత్రాల్లోనే నటిస్తా. ఆయనే నాకు గాడ్‌ఫాదర్. ఆయన వల్లే చిత్రసీమకు వచ్చా.

 

‘మా అమ్మమ్మ వాళ్లది రాజమహేంద్రవరమే’
 రోజులు మారాయి దర్శకుడు మురళీకృష్ణ
ఆల్కాట్‌తోట(రాజమహేంద్రవరం) : ‘మా స్వగ్రామం కృష్ణాజిల్లా గుడివాడైనా.. అమ్మమ్మవాళ్లది రాజమహేంద్రవరమే’ అని రోజులు మారాయి చిత్ర దర్శకుడు మురళీకృష్ణ పేర్కొన్నారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.


 సాక్షి : ఎన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు.
 మురళీకృష్ణ : ఇప్పటివరకు సీరియల్స్‌కు దర్శకత్వం వహించాను. రోజులు మారాయి నా మొదటి చిత్రం.
 

సాక్షి : ఏయే సీరియల్స్‌కు దర్శకత్వం వహించారు.
మురళీకృష్ణ : నాన్న, చిన్నారి, అమ్మమ్మ డాట్ కమ్ సీరియల్స్‌కు దర్శకత్వం వహించాను. మూడింటికీ ఉత్తమ సీరియల్స్‌గా నంది అవార్డులు అందుకున్నా. అలాగే నాన్న, అమ్మమ్మ డాట్ కమ్ సీరియల్స్‌కు ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు వచ్చింది.

 

సాక్షి : రోజులు మారాయి సినిమాకు ఎలాంటి స్పందన వస్తుంది?
మురళీకృష్ణ : వెళ్లిన ప్రతి చోట ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది. యూత్, ఫ్యామిలీ ఎంటర్‌టైైనర్ సినిమా. ప్రేక్షకుల ఆదరణ మరువలేనిది.


సాక్షి : కొత్తగా దర్శకత్వం వహించే సినిమాలు
మురళీకృష్ణ :  నిర్మాతలు దిల్‌రాజు, జి.శ్రీనివాసరావుల తో కలిసి కొత్తగా ఒక సినిమా చేద్దామని అన్నారు. త్వరలోనే మొదలు పెడతాం.


సాక్షి : సెలవులకు రాజమహేంద్రవరం వచ్చినప్పుడు ఏం చేసేవారు?
మురళీకృష్ణ :  అమ్మమ్మవాళ్లది రాజమహేంద్రవరంలోని ఇన్నీసుపేట. చిన్నప్పుడు సెలవులకు వచ్చినప్పుడు సైకిల్ తొక్కుకుంటూ గోదావరి గట్లపై తిరుగుతూ ఉండేవాడిని. ఎంతో ఆనందంగా ఉండేది. ఇప్పటి కీ మరిచిపోలేని అనుభూతి. మరలా రాజమహేంద్రవరం ‘రోజులు మారాయి’ విజయోత్సవ ర్యాలీకి రావడం ఆనందంగా ఉంది.

మరిన్ని వార్తలు