దేశంకోసం ఇందిర ప్రాణత్యాగం

12 Dec, 2016 15:19 IST|Sakshi
దేశంకోసం ఇందిర ప్రాణత్యాగం

మాజీ ప్రధానికి రోశయ్య నివాళి
సాక్షి, హైదరాబాద్: పేద ప్రజల బతుకుల్లో మార్పుకోసం అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న ఇందిరాగాంధీ దేశంకోసం ప్రాణ త్యాగం చేశారని తమిళనాడు మాజీ గవర్నర్ కె.రోశయ్య అన్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ శతజయంతి ఉత్సవాలను శనివారం గాంధీభవన్‌లో ప్రారంభించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, సీఎల్పీనేత కె.జానారెడ్డి, పార్టీనేతలు పొన్నాల లక్ష్మయ్య, పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు నేరెళ్ల శారద ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో రోశయ్య మాట్లాడుతూ ఎంతో సంపన్నమైన కుటుంబంలో జన్మించినా బాల్యంలో చాలా కష్టాలు ఎదుర్కొన్న మహిళ.. ఇందిరాగాంధీ అని అన్నారు. దేశ సంక్షేమంకోసం ఆమె కఠినమైన నిర్ణయాలు తీసుకుని ఉక్కుమహిళగా పేరుతెచ్చుకున్నారని గుర్తుచేశారు. ఇందిరాగాంధీ సూచించిన మార్గంలో నడవడమే ఆమెకు అర్పించే నిజమైన నివాళి అని రోశయ్య పేర్కొన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఇందిర శతజయంతి ఉత్సవాలను ఏడాదిపాటు రాష్ట్రంలో నిర్వహిస్తామన్నారు.

రోశయ్యకు సన్మానం
మాజీ గవర్నర్ రోశయ్యను శనివారం కాంగ్రెస్ నేతలు గాంధీభవన్‌లోనూ, అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలోనూ సన్మానించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్య నిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, సీఎల్పీనేత కె.జానారెడ్డి, నేతలు టి.జీవన్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి తదితరులు రోశయ్యను సత్కరించారు. గాంధీ భవన్‌కు రావడం తనకు సొంతఇంటికి వచ్చి నంత సంతోషంగా ఉందని ఈ సందర్భంగా రోశయ్య అన్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొ నాలని ఉన్నప్పటికీ ఆరోగ్య పరిస్థితుల కారణంగా రాలేకపోతున్నానని చెప్పారు.

మరిన్ని వార్తలు