రోటో ఫెస్ట్‌ ప్రారంభం

11 Sep, 2016 22:54 IST|Sakshi
రోటో ఫెస్ట్‌ ప్రారంభం
గుంటూరు స్పోర్ట్స్‌: రోటరీ క్లబ్‌ ఆఫ్‌ గుంటూరు ఆధ్వర్యంలో స్థానిక బృందావన్‌ గార్డెన్స్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో ఆదివారం రోటో ఫెస్ట్‌ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలుత విద్యార్థులు మార్చ్‌ఫాస్ట్‌ నిర్వహించారు.  ముఖ్యఅతిథిగా హాజరైన అడిషనల్‌ ఎస్పీ జె.భాస్కర్‌ రావు క్రీడాకారుల నుంచి క్రీడా వందనం స్వీకరించారు. అనంతర బెలూన్‌లను వదిలి రోటో ఫెస్ట్‌ వేడుకలను ప్రారంభించారు.  ఈ సందర్బంగా భాస్కర్‌రావు మాట్లాడుతూ చిన్నారులలోని ప్రతిభను వెలికితీసేందుకు క్రీడా, సంస్కృతి విభాగాలలో పోటీలు నిర్వహించటం అభినందనీయమన్నారు. సేవా కార్యక్రమాలతో పాటు క్రీడా పోటీలు నిర్వహిస్తున్న రోటరీ సేవలను కొనియాడారు. శాప్‌ ఓఎస్‌డి పి.రామకృష్ణ మాట్లాడుతూ ఇలాంటి క్రీడాపోటీల స్ఫూర్తితో సింధూ లాంటి క్రీడాకారులు తయారవుతారని చెప్పారు. అందుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో అవసరమన్నారు. క్లబ్‌ అధ్యక్షుడు పి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ 15 రోజుల పాటు జరిగే  ఈ వేడుకలలో 35 క్రీడా, విద్యా, సంసృ ్కతిక విభాగాలలో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. ఈనెల 25వ తేదీన వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. తొలిరోజు 100 మీటర్ల పరుగు, షాట్‌పుట్, లాంగ్‌ జంప్, హైజంప్, స్కేటింగ్‌ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో రొటేరియన్లు కె.ఎస్‌.రమేష్, కొల్లా శ్రీనివాస్, న్యూజనరేషన్‌ డైరెక్టర్‌ ఎస్‌.అంకమ్మరావు, కోశాధికారి కాలేషావలి, భాస్కరరావు, శౌరయ్య, హరికృష్ణ, ధామస్, ఎం.వి.ప్రకాష్, బ్రహ్మ, యలమంచిలి వేణు, నంబూరు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు