మహిళలపై హింస పెరుగుతోంది

31 Dec, 2016 19:37 IST|Sakshi
మహిళలపై హింస పెరుగుతోంది

విజయవాడ (గాంధీనగర్‌) : మహిళలపై రోజురోజుకూ హింస పెరుగుతోందని చైతన్య మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాధ అన్నారు. లైంగికంగా, కుటుంబ పరంగా, రాజ్యపరంగా.. ఇలా అనేక రూపాల్లో హింస జరుగుతోందన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో చైతన్య మహిళా సంఘం ఆధ్వర్యాన ‘మహిళలపై జరుగుతున్న రాజ్యహింస’ అనే అంశంపై రౌండ్‌టేబుల్‌ సమావేశం శనివారం జరిగింది. ఆమె మాట్లాడుతూ మహిళలపై హింసకు ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక కారణాలే మూలమని పేర్కొన్నారు. ఆదివాసీ మహిళలు దుర్భర జీవితం గడుపుతున్నారని, వారిపై సైనికులే లైంగికదాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆదివాసీలపై జరుగుతున్న దాడులను తెలుసుకునేందుకు వెళ్లిన ప్రొఫెసర్‌ నందినీ సుందర్, అర్చనా ప్రసాద్, జర్నలిస్ట్‌ మాలినీ సుబ్రహ్మణ్యంపై హత్యానేరం కింద కేసులు నమోదు చేశారని తెలిపారు. మహిళలపై దాడులను ప్రశ్నించేవారిని ప్రభుత్వం అణచివేస్తోందన్నారు. చైతన్య మహిళా సంఘం జిల్లా కార్యదర్శి రాజేశ్వరి ప్రసంగించారు. అనంతరం రాజ్యహింసను ఎదుర్కొనేందుకు పోరాటాలను తీవ్రతరం చేయాలని ఈ సమావేశంలో తీర్మానించారు. ఈ సమావేశంలో బి.కొండారెడ్డి (పీకేఎఫ్‌),  టి.శ్రీరాములు (కేఎన్‌పీఎస్‌), వీఎన్‌ఎన్‌ రాజ్యలక్ష్మి (ఓపీడీఆర్‌), ఎస్‌ఎస్‌సీ బోసు(పౌరహక్కుల సంఘం), కొప్పల మాధవి (రూట్స్‌ హెల్త్‌ ఫౌండేషన్‌), మురళీకృష్ణ (పద్మశ్రీ నాజర్‌ కళాక్షేత్రం), మహిళా, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు