ఆర్‌పీ బయోలో కేళీలు వాస్తవమే

5 Oct, 2016 23:30 IST|Sakshi
ఆర్‌పీ బయోలో కేళీలు వాస్తవమే
తొర్రేడు (రాజమహేంద్రవరం రూరల్‌) : జిల్లాలో ఆర్‌పీ బయో 226 వరి రకం సాగుచేసిన పొలాల్లో కేళీలు వచ్చిన మాట వాస్తవమేనని మార్టేరు వ్యవసాయ పరిశోధనాకేంద్రం అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ పాలడుగు సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీసీడ్స్‌) ద్వారా జిల్లాలోని రాజమహేంద్రవరం రూరల్, పెద్దాపురం, పిఠాపురం ప్రాంతాల్లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఈ విత్తనాలు పంపిణీ చేశారు. అయితే వీటిలో కేళీలు ఎక్కువగా ఉన్నాయని రైతుల నుంచి ఫిర్యాదులు రావడంతో మార్టేరు పరిశోధనాకేంద్రం శాస్త్రవేత్తలు, ఏరువాక శాస్త్రవేత్తలు, ఏపీ సీడ్స్‌ బృందం బుధవారం తొర్రేడులోని వరి పొలాలను పరిశీలించారు. పరిశోధనాకేంద్రం అసోసియేట్‌ డీన్‌ సత్యనారాయణ మాట్లాడుతూ బీపీటీ 5204కు ప్రత్యామ్నాయంగా ఆర్‌పీబయో రకం సరఫరా చేశారన్నారు. కేళీలు రావడం వల్ల దిగుబడి తగ్గే ప్రమాదం ఉందన్నారు. ఏరువాక శాస్త్రవేత్తలు ప్రవీణ, నందకిషోర్, మార్టేరు పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు మల్లికార్జునరావు, చాముండేశ్వరి, కృష్ణంరాజు, రాజమహేంద్రవరం వ్యవసాయ సహాయ సంచాలకుడు (ఎఫ్‌ఏసీ) కె.సూర్యరమేష్, వ్యవసాయాధికారి కె.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు