రూ.1.98 కోట్లు నిరుపయోగమేనా..?!

13 Aug, 2016 23:03 IST|Sakshi
  • అశ్వారావుపేట ఫ్యాక్టరీలో పూర్తికాని రెండో బాయిలర్‌
  • మళ్లీ పాతదే దిక్కు
  • అశ్వారావుపేట: అశ్వారావుపేటలోని పామాయిల్‌ ఫ్యాక్టరీ ఆధునీకరణ పేరుతో బాయిలర్‌ కొనుగోలుకు వెచ్చించిన 1.98 కోట్ల రూపాయలు వృథా అయినట్టేనన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఫ్యాక్టరీ ఆధునీకరణ, దమ్మపేట మండలం అప్పారావుపేటలో కొత్త ఫ్యాక్టరీ నిర్మాణ పనుల్లో నాణ్యత లోపాలపై ‘కొత్తది కదలదు.. పాతది నడవదు’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. అందులో చెప్పినట్లుగానే అప్పారావుపేట ఫ్యాక్టరీ పూర్తికాలేదు. అశ్వారావుపేట ఫ్యాక్టరీలో రెండో బాయిలర్‌ వృథాగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. రూ.18 కోట్లతో ఆధునీకరించిన అశ్వారావుపేట పామాయిల్‌ ఫ్యాక్టరీని ఈ నెల 16న వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, స్పీకర్‌ మధుసూధనాచారి, ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ తదితరులు ప్రారంభిస్తారు. ఫ్యాక్టరీని ఆర్నెల్లుగా మూసివేసి చేస్తున్న మరమ్మతులు ఇంకా కొలిక్కి రాలేదు. ఫ్యాక్టరీలో గతంలో ఎనిమిది టన్నుల సామర్థ్యమున్న బాయిలర్‌ ఉండేది. దీని ద్వారా గంటకు 15 టన్నుల పామాయిల్‌ గెలలను ఉడికించేవారు. ఫ్యాక్టరీ సామర్థ్యానికి మించి గెలలు రావడంతో గతేడాది రైతులు, ఫ్యాక్టరీ యాజమాన్యానికి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. దమ్మపేట మండలం అప్పారావుపేటలో రూ.60కోట్లతో అధునాతన ఫ్యాక్టరీ నిర్మిస్తున్నందున అశ్వారావుపేట ఫ్యాక్టరీని ఆధునీకరించాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ అధికారులు ఆధునీకరణ పనులు చేపట్టారు.

    • రెండో బాయిలర్‌కు ఏమయింది.?

    ఫ్యాక్టరీలో రూ.1.98 కోట్లతో నిర్మించిన రెండో బాయిలర్‌ పాతదయింది బాయిలర్‌ మినహా మిగిలిన సామగ్రిని అనవసరంగా కొత్తవి కొనుగోలు చేశారు. దేశంలోని వివిధ  ప్రాంతాలకు చెందిన అనేకమంది నిపుణులు ఈ బాయిలర్‌ పైనే ప్రయోగాలు చేశారు. అందుకే ఇది ఇప్పటివరకు పనులు ఓ కొలిక్కి రాలేదు. రెండో బాయిలర్‌తోపాటు మొదటి బాయిలర్‌ను కూడా వినియోగిస్తామని.. అవసరమైతే రెండు బాయిలర్లను ఏకకాలంలో వినియోగిస్తామని అధికారులు చెబుతున్నారు. కానీ రెండు బాయిలర్లను అనుసంధానించే పరికరం ఇప్పటికీ అమర్చకపోవడం, రెండో బాయిలర్‌ ఏర్పాటు పూర్తికాకపోవడంతో మొదటి బాయిలర్‌తోనే పరిశ్రమను నడిపించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

    • స్టీమ్‌ టర్బైన్‌ సంగతేంటో..!

    అశ్వారావుపేట ఫ్యాక్టరీలో¯ తెట్టు కుంబకోణంతో జైలుపాలైన అప్పటి మేనేజర్‌ చంద్రశేఖరరెడ్డి రూ.కోటి వెచ్చించి చైనా నుంచి స్టీమ్‌ టర్బైన్‌ను మూడేళ్ల క్రితం కొనుగోలు చేశారు. దానిని ఇప్పటివరకూ వాడలేదు. కమీషన్ల కోసమే దీనిని కొనుగోలు చేశారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ స్టీమ్‌ టర్బైన్‌కు బాయిలర్‌ నుంచి ఆవిరిని అందిస్తే.. ఫ్యాక్టరీ మొత్తం ఆగిపోతుంది. స్టీమ్‌ టర్బయిన్‌ నుంచి వెలువడే విద్యుత్‌ ఫ్యాక్టరీలో కనీసం ఒక్క యూనిట్‌ను కూడా నడపలేని నాసిరకమైనది. దీంతో ఇది నిరుపయోగంగా ఉంది. ప్రస్తుతం రెండు బాయిలర్లను అమర్చినా స్టీమ్‌ టర్బైన్‌ను వినియోగంలోకి తెచ్చే అవకాశాల్లేవు.

    • పామాయిల్‌ ఫ్యాక్టరీ పునఃప్రారంభం ఉదయమే

    అశ్వారావుపేట పామాయిల్‌ ఫ్యాక్టరీ పునః ప్రారంభం ఈ నెల 16న సాయంత్రం మూడు గంటలకు కాకుండా ఉదయం 10 గంటలకే ఉంటుందని సీనియర్‌ మేనేజర్‌ సుధాకర్‌రెడ్డి తెలిపారు. ఈ మార్పును రైతులు, అధికారులు, అతిథులు గమనించి సకాలంలో రావాలని కోరారు.

మరిన్ని వార్తలు