ఎస్సీలకు రూ.1100 కోట్ల రుణాలు

2 Sep, 2016 00:52 IST|Sakshi
ఎస్సీలకు రూ.1100 కోట్ల రుణాలు

– రూ.2 వేల కోట్లతో సీసీ రోడ్ల అభివృద్ధి
– పుష్కర నిర్వహణలో మనమే ఫస్ట్‌
– రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి


కర్నూలు(అర్బన్‌):రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా అర్హులైన ఎస్సీలకు రూ.1100 కోట్ల రుణాలను అందించనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. గురువారం నగర శివారుల్లోని వీజేఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సి. హరికిరణ్‌ అధ్యక్షతన ఎస్సీ కార్పొరేషన్‌ లబ్ధిదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ జూపూడి ప్రభాకర్‌రావు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు వై. ఐజయ్య, ఎస్వీ మోహన్‌రెడ్డి, బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, మాజీ మంత్రి మారెప్ప హాజరయ్యారు. ముందుగా ఉప ముఖ్యమంత్రి కేఈ, ప్రజా ప్రతినిధులు, అధికారులు డా.బీఆర్‌ అంబేడ్కర్, బాబు జగ్జీవన్‌రామ్‌ చిత్ర పటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కేఈ మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌ కింద ఎస్సీలకు రూ.8 వేల కోట్లు, ఎస్టీలకు రూ.3 వేల కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. అంబేడ్కర్‌ ఓవర్‌సీస్‌ పథకం కింద విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహకారాన్ని అందిస్తుందన్నారు. ఎన్‌టీఆర్‌ విద్యోన్నతి పథకం కింద ఐఏఎస్, ఐపీఎస్‌ తదితర సివిల్‌ సర్వీస్‌ పరీక్షలకు సంసిద్దం అయ్యేందుకు శిక్షణను ఇప్పిస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయ పరంగా కూడా ఎస్‌సీ వర్గాలను అభివద్ధి చేసేందుకు పలు రకాల యాంత్రిక పరికరాలపై సబ్సిడీని అందిస్తున్నామన్నారు.
– ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ దళిత, గిరిజనులకు రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకులు సహకరించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
– శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ తన నియోజకవర్గంలో దొరవారి భూములు దాదాపు 1600 ఎకరాలు ఉన్నాయని, వాటిని ప్రస్తుతం సాగు చేసుకుంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పట్టాలు ఇవ్వాలని కోరారు.
– ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దళిత, గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ఈ వర్గాలను ఆర్థికంగా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి అనేక పథకాలను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు.
– జేసీ హరికిరణ్‌ మాట్లాడుతు జిల్లాలో ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక గ్రీవెన్స్‌ ఏర్పాటు చేశామని ఇప్పటి వరకు వచ్చిన 900 ఫిర్యాదుల్లో 600 ఫిర్యాదులను పరిష్కరించామని, మిగిలినవి పరిష్కార దిశగా ఉన్నాయన్నారు.
– కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కె.మీనాక్షినాయుడు, తెలుగుమహిళ నాయకురాలు అంకం విజయ,  దళిత సంఘాలకు చెందిన నాయకులు బాలసుందరం, త్యాగరాజు, అశోకరత్నం, అనంతరత్నం మాదిగ, రాజ్‌కుమార్, కే వెంకటేష్, గడ్డం నాగముని, వేల్పుల జ్యోతి, డీవీఎంసీ సభ్యులు చిటికెల సలోమి, చిన్న లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.   
 

మరిన్ని వార్తలు