కుమ్ముడు కనుమా..

16 Jan, 2017 01:11 IST|Sakshi
కుమ్ముడు కనుమా..

రూ.12 కోట్ల విలువైన మటన్, చికెన్‌ లాగించారు..
రూ.8 కోట్ల మందు తాగేశారు..  


విశాఖపట్నం: మాంసం ప్రియులు, మందుబాబులు మజా చేశారు. కనుమ పండగను బాగా ఎంజాయ్‌ చేశారు. సుమారు నాలుగు లక్షల కిలోల చికెన్‌ను, లక్ష కిలోల మటన్‌ను లాగించేశారు. దాదాపు రూ.8 కోట్ల విలువైన మద్యాన్ని తాగేశారు. వెరసి కనుమకు మాంసం, మద్యం కోసం రూ.20 కోట్లు వెచ్చించి ఔరా! అనిపించారు. సంక్రాంతి మూడు రోజుల్లో కనుమ పండగకు ఓ ప్రత్యేకత. మాంసాహారులు, మద్యం ప్రియులకు ప్రీతికరమైన పండగ. భోగి, సంక్రాంతి పండగలకు మాంసాహారానికి దూరంగా ఉంటారు. సంక్రాంతి మర్నాడు వచ్చే కనుమ పండగ నాడు విధిగా మాంసాన్ని భుజించడం ఆనవాయితీ. మద్యం తాగాలన్న ఆచారం, ఆనవాయితీలు లేకపోయినా పనిలో పనిగా మందుబాబులు కనుమ నాడు మద్యం సేవించడానికి ప్రాధాన్యమిస్తారు. అందువల్లే కనుమ రోజు లిక్కర్, చికెన్, మటన్‌ కొనుగోళ్లకు జనం క్యూ కట్టారు. ఈ ఏడాది కనుమకు మాంసాహారులు, మద్యం ప్రియులకు ఆదివారం అడ్డంగా కలిసొచ్చింది. దీనికి చికెన్‌ ధర అందుబాటులో ఉండడం తోడైంది. ఇంకేముంది? కుమ్మేశారు.

ఈ కనుమ పండగ కోసం పౌల్ట్రీ వ్యాపారులు రెండు లక్షల కోళ్లను సిద్ధం చేశారు. ఒక్కో కోడి బరువు సగటున రెండున్నర కిలోలకు చేరుకుంది. ఈ లెక్కన వ్యర్థాలు పోను ఒక్కో కోడి రెండు కిలోల చొప్పున చూస్తే ఇటు నగరంలోనూ, అటు జిల్లాలోనూ నాలుగు లక్షల కేజీల చికెన్‌ విక్రయాలు జరిగాయి. కిలో చికెన్‌ ధర స్కిన్‌ 130, స్కిన్‌లెస్‌ రూ.140–150కు విక్రయించారు. ఈ లెక్కన ఒక్క కనుమ నాడు అమ్ముడయిన చికెన్‌ ఖరీదు దాదాపు రూ.6 కోట్లన్నమాట! ఇక మటన్‌ విషయానికొస్తే జిల్లాలోను, నగరంలోనూ సుమారు 8 వేల మేకలు, గొర్రెలు అమ్ముడు పోయినట్టు అనధికార అంచనా. ఒక్కో గొర్రె నుంచి సగటున 12 కిలోల మాంసం లభ్యమవుతుంది. అంటే దాదాపు లక్ష కిలోల మటన్‌ అన్నమాట. కిలో మటన్‌ మార్కెట్‌లో రూ.600లకు విక్రయించారు. ఇలా చూస్తే దీని విలువ రూ.6 కోట్ల వరకు ఉంటుంది. అంటే చికెన్, మటన్‌లకు కనుమ రోజు వెచ్చించిన సొమ్ము రూ.12 కోట్లు!

మరిన్ని వార్తలు