ఉందిలే మంచికాలం...

8 Aug, 2017 01:13 IST|Sakshi
ఉందిలే మంచికాలం...

మత్స్యకారులకు మంచి రోజులు
జిల్లా మత్స్యరంగానికి రూ.19.46 కోట్లు విడుదల
కార్మికులకు రాయితీపై రుణాలు
సొసైటీ సభ్యులకే అవకాశం


జనగామ : చేపలపై ఆధారపడి జీవించే మత్స్యకారులకు మంచి రోజులు రాబోతున్నాయి. ఎప్పుడు లేనట్లుగా ఈసారి మత్స్య రంగానికి కోట్లాది నిధులు విడుదలైయ్యాయి. కార్మికులకు రాయితీపై రుణాలు అందించడం కోసం సన్నాహాలు చేస్తున్నారు. మత్స్య సొసైటీల్లో సభ్యులుగా ఉన్న వారికే ఈ నిధుల నుంచి ప్రోత్సహం లభించనుంది.

జిల్లాకు రూ.19.46 కోట్లు...
జిల్లాలోని మత్స్యకారులకు చేయూత అందించడం కోసం ఇంటిగ్రేటేడ్‌ ఫిషరీ డెవలప్‌మెంట్‌ స్కీం (ఐఎఫ్‌డీఎస్‌) కింద రూ.19.46 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులను రాష్ట్ర మత్స్య పారిశ్రామిక సమాఖ్య ఖాతాలో జమ చేస్తారు. అక్కడ నుంచి నేరుగా జిల్లాలకు నిధులను అందిస్తారు. 2017–18, 2018–19 సంవత్సరాలకు కలుపుకుని ఈ మొత్తాన్ని విడుదల చేశారు. భద్రత లేకుండా జీవనం సాగిస్తున్న మత్స్యకారులకు ఉపాధిని కల్పించడం కోసం నిధులను విడుదల చేశారు. అర్హులైన మత్స్యకారులను గుర్తించి ఈ నిధులతో ఆర్థిక సాయాన్ని అందిస్తారు.

లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేక కమిటీ..
ఐఎఫ్‌డీఎస్‌ నుంచి విడుదల చేసిన నిధులకు లబ్ధిదారులను ప్రత్యేక అధికారుల కమిటీ ఎంపిక చేస్తుంది. 18 ఏళ్లు నిండిన మత్స్యకారులు సొసైటీలో సభ్యులై ఉండాలి. మీ సేవ, ఆన్‌లైన్‌ కేంద్రాల ద్వారా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.  దరఖాస్తుదారుడి పేరు, సొసైటీ, ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్లను జతపర్చాల్సి ఉంటుంది. జిల్లా కలెక్టర్, జిల్లా ఫిషరీ అధికారి, జిల్లా పశుసంవసర్థక శాఖ అధికారులతో ఏర్పాటైన కమిటీ  దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది.

సబ్సిడీపై రుణాలు...
ఈ నిధులతో మత్స్యకారులకు వ్యక్తిగత, గ్రూప్‌ రుణాలను అందించనున్నారు. చేపల మార్కెట్ల నిర్మాణం, రవాణా సదుపాయాలతో పాటు చేపల పెంపకం కోసం రుణాలను అందించనున్నారు. వలలు, బుట్టలు, ఆటో, ఆటో ట్రాలీలు, మొబైల్‌ మార్కెటింగ్‌ అవుట్‌ లేట్, చేపల దాణా, ఐస్‌ ప్లాంట్ల వంటి వాటిని అందించనున్నారు.

మత్స్యకారులకు ప్రయోజనం..
ఎన్నడూ లేనట్లుగా ఈసారి మత్స్యకార్మికులకు పెద్ద మొత్తంలో నిధులు వచ్చాయి. జిల్లాలోని 13 మండలాలకు రూ.19.46 కోట్లు మంజూరయ్యాయి. పెద్ద మొత్తం నిధులు విడుదల కావడం కార్మికులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి. రెండు రోజుల క్రితమే నిధులు మంజూరయ్యాయి. ఇంకా పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు జారీ కాలేదు. ఆన్‌లైన్‌ కేంద్రాల ద్వారానే దరఖాస్తులను స్వీకరిచడం జరుగుతుంది. తేదీలను త్వరలో ప్రకటిస్తాం.
– శ్రీపతి, జిల్లా ఫిషరీ అధికారి

మరిన్ని వార్తలు