పాములేటికి రూ.2లక్షల పరిహారం

18 Nov, 2016 22:31 IST|Sakshi
పాములేటికి రూ.2లక్షల పరిహారం
మానవ హక్కుల సంఘం ఆదేశం
 
నంద్యాల: ప్రభుత్వ ఆసుపత్రిలో న్యాయవాది పాములేటి కాళ్లకు సంకెళ్లు వేసినందుకు ప్రభుత్వం రూ.2 లక్షల పరిహారాన్ని ఇవ్వాలని మానవహక్కుల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిహారాన్ని బాధ్యులైన పోలీసు అధికారుల నుంచి రికవరీ చేయాలని సూచించింది. ఈ మేరకు హెచ్‌ఆర్‌సీ జారీ చేసిన ఆదేశాలు బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధి, రావినూతన దుర్గాప్రసాద్‌కు అందాయి. చాగలమర్రికి చెందిన విమలమ్మ ఆస్తి వివాదంలో న్యాయం చేయాలని జూన్‌ 13 నంద్యాల ఆర్‌డీఓ సుధాకర్‌రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఆమెకు మద్దతుగా నిలిచిన న్యాయవాది పాములేటి, మరి కొందరికి, ఆర్‌డీఓ సుధాకర్‌రెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. ఆర్‌డీఓ  ఫిర్యాదు మేరకు త్రీటౌన్‌ సీఐ వెంకటరమణ వీరిని అరెస్ట్‌ చేశారు. అనారోగ్యంతో ఉన్న పాములేటిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.అయితే పారిపోకుండా పోలీసులు కాళ్లకు సంకెళ్లు వేశారు. దీనిపై ‘సాక్షి’లో న్యాయానికి సంకెళ్లు అనే వార్త జూన్‌ 14న ప్రచురితమైంది. ఈ వార్తను మానవ హక్కుల సంఘం సుమోటగా తీసుకొని కేసు నమోదు చేసింది. బార్‌ అసోసియేషన్‌ తరపున ప్రముఖ న్యాయవాది రావినూతన దుర్గాప్రసాద్‌ కూడా పాములేటికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ సంఘటనలో ఎస్‌ఐ అశోక్, నలుగురు కానిస్టేబుళ్ల పోలీసు అధికారులు సస్పెండ్‌ చేసి, సీఐ అశోక్‌ను వేకన్సీ, రిజర్వ్‌కు పిలిపించింది. ఈ కేసు విచారణ తర్వాత పాములేటికి ప్రభుత్వం రూ.2లక్షల పరిహారాన్ని మూడు నెలల్లో ఇవ్వాలని ఆదేశించింది. ఈ మొత్తాన్ని సీఐ వెంకటరమణ, ఎస్‌ఐ అశోక్‌ల నుంచి రూ.50వేలు చొప్పున, కానిస్టేబుళ్లు మహేంద్ర, లక్ష్మణరావు, శోభన్‌బాబు, బాల మౌలాలి నుంచి రూ.25వేల చొప్పున రికవరీ చేయాలని ఆదేశించింది.    
 
మరిన్ని వార్తలు