ఆమెతో మాట్లాడితే రూ.3 వేలు జరిమానా

11 Sep, 2015 12:22 IST|Sakshi
ఆమెతో మాట్లాడితే రూ.3 వేలు జరిమానా

తవణంపల్లె : జిల్లాలోని తవణంపల్లె మండలంలో ఓ దళిత మహిళకు గ్రామ పెద్దలు శిక్ష విధిస్తూ తీర్మానించారు. ఆమెకు గ్రామంలో సహాయ నిరాకరణ చేయాలనేదే పెద్దల తీర్మానం. మండలంలోని గోవిందరెడ్డిపల్లె దళితవాడలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు 15 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ధరణీధర గురువారం రాత్రి తెలిపారు.

ఎస్‌ఐ కథనం మేరకు.. గోవిందరెడ్డిపల్లె దళితవాడకు చెందిన పుష్ప అదే గ్రామంలో 2004 సంవ త్సరంలో రోడ్డుకు ఆనుకుని 13 సెంట్లు స్థలం కొనుగోలు చేసింది. ఈ స్థలానికి ఆనుకుని 2007లో పంచాయతీ అధికారులు పశువుల దాహార్తి తీర్చేందుకు నీటి తొట్టె కట్టారు. అప్పటి నుంచి గ్రామస్తులు కొందరు ఆ నీటి తొట్టె దగ్గర దుస్తులు ఉతకడం మొదలుపెట్టారు.
 
 నీటి తొట్టెకు సమీపంలో ఆమె స్థలంలో ఇల్లు కట్టుకోవాలని చూస్తోంది. అయితే అక్కడ దుస్తులు ఉతకడంతో వృథా నీరంతా తన స్థలంలోకి వస్తోందని, ఇక్కడ ఉతక వద్దని చాలాసార్లు మొరపెట్టుకుంది. అయినా వారు వినకుండా అలానే చేయడంతో ఆమెకు, దళితవాడ ప్రజలకు వాగ్వాదం జరిగింది. గత మే నెలలో దళితవాడ వాసులంతా మాట్లాడుకుని ఆమెకు సహాయ నిరాకరణ చేయాలని నిర్ణయించుకున్నారు.
 
 ఆమెతో ఎవరూ మాట్లాడరాదని, మాట్లాడితే రూ.3 వేలు అపరాధం వేస్తామని కట్టుదిట్టం చేశారు. ఈ విషయంపై బాధితురాలు పుష్ప ఈ నెల 8న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మేరకు ఎన్.పరదేశి, రాజేశ్వరి, అప్పాదొరై, గుణశేఖర్‌తోపాటు మరో 11 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. గురువారం రాత్రి చిత్తూరు డీఎస్పీ లక్ష్మీనాయుడు, సీఐ ఆదినారాయణ ఆ గ్రామానికి వెళ్లి బాధితురాలు పుష్ప, గ్రామస్తులను విచారించారు.

మరిన్ని వార్తలు