రెండేళ్లలో రూ.80వేల కోట్ల అప్పులా?

9 Aug, 2016 19:52 IST|Sakshi
అప్పులు చేసి పప్పుబెల్లాలు తింటున్న చందంగా ప్రభుత్వం అనవసర కార్యక్రమాలకు విచ్చలవిడి వ్యయం చేస్తూ వేలాది కోట్ల రూపాయల అప్పుల భారాన్ని ప్రజానీకంపై మోపుతోందని పీసీసీ ఉపాధ్యక్షుడు, శాసనసభ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆందోళన వ్యక్తంచేశారు. రెండేళ్ల పదవీకాలంలో మూడు బడ్జెట్లను ప్రవేశపెట్టిన ప్రభుత్వం, అందులోని మొత్తాన్ని ఖర్చుపెట్టామని చెబుతూనే రూ.80 వేల కోట్ల అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చినట్టు అమిత్‌షా ప్రకటించిన రూ.1.40 లక్షల కోట్ల డబ్బు ఏమైందనే ప్రశ్నలను తేటతెల్లం చేయాల్సిన సమయం ఆసన్నమైందని, ప్రభుత్వం చేసిన ఆదాయ వ్యయాలపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
 
తెనాలిలోని స్వగృహంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మనోహర్ మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పులు రూ.1.78 లక్షల కోట్లు కాగా, విభజన సమయంలో మన వాటా రూ.1,04,189 కోట్లుగా తేల్చినట్టు గుర్తుచేశారు. రెండేళ్లలో ఆ అప్పులు రూ.1,90,513 కోట్లకు పెరిగాయంటే రూ.80 వేల కోట్ల అప్పులు చేసినట్టు స్పష్టమవుతోందన్నారు. వడ్డీ కిందనే రూ.11 వేల కోట్లను వెచ్చించాల్సి ఉందన్నారు. రుణమాఫీ అన్నారు...రైతులకు అన్యాయం చేశారంటూ, మాఫీ పేరుతో పొదుపు సంఘాల మహిళలను వంచించారని, కొత్తగా అర్జీలు పెట్టుకున్న ఏ ఒక్క పేదవాడి కోసం ఇల్లు నిర్మించిన పాపాన పోలేదన్నారు. భాగస్వామ్య ఒప్పంద సదస్సు, ఎంఓయూలతో వేలాది కోట్ల పెట్టుబడులు వస్తాయన్న ఆర్భాటాల్లోనూ పస లేదని వెల్లడైందన్నారు. అప్పులు తెచ్చిన అనవసర కార్యక్రమాలకు వెచ్చిస్తూ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం కనీసం ప్రత్యేకహోదా కోసం ప్రయత్నం చేయటం లేదని ఆరోపించారు. సమావేశంలో పార్టీ నేతలు తోటకూర వెంకట రమణారావు, ఎం.దశరథరామిరెడ్డి, షేక్ రహిమాన్, దొడ్డక ఆదినారాయణ, నల్లగొర్ల నాగేశ్వరరావు. పిల్లి సుధాకర్ పాల్గొన్నారు.
 
 
మరిన్ని వార్తలు