రూ. కోట్లలో ‘స్టాంప్‌ల’ కుంభకోణం!

21 Sep, 2016 08:25 IST|Sakshi

కడప అర్బన్‌: జిల్లాలో ‘స్టాంప్‌ల’ కుంభకోణం కొత్త మలుపులు తిరుగుతోంది. నిందితులంతా సమాజంలో కీలక ప్రభుత్వ శాఖలకు అనుబంధంగా ఉన్న రిజిస్ట్రేషన్, రెవెన్యూ, బ్యాంక్‌ అధికారులు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే జిల్లాతోపాటు,  అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాలకు కూడా ఈ కుంభకోణం విస్తరించిందని పోలీసులు చెబుతున్నారు.
–  ఈ కుంభకోణంలో ప్రధానంగా మైదుకూరుకు చెందిన స్టాంప్‌ వెండర్, డాక్యుమెంట్‌ రైటర్‌ కోడూరు విజయభాస్కర్‌ రెడ్డి అలియాస్‌ భాస్కర్‌ సూత్రధారిగా, పాత్రధారిగా వ్యవహరించాడు.
– ఈ క్రమంలో  మైదుకూరు రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో జరగుతున్న అవినీతిపై అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదులు అందాయి.  ఆ శాఖ వారు ఈఏడాది జూన్‌లో ఆకస్మిక దాడులు నిర్వహించారు. దీంతో అక్కడి నుంచి విజయభాస్కర్‌ రెడ్డి తన మకాం కడప రవీంద్రనగర్‌కు మార్చాడు.
– కడప రవీంద్రనగర్‌లో విజయభాస్కర్‌ రెడ్డి నివసిస్తుండగా రాత్రి వేళల్లో గుర్తుతెలియని వ్యక్తులు పాతకాలపు స్టాంప్‌లను కొనేందుకు వస్తూ, వెళుతూ ఉండటంతో ఆ ప్రాంత ప్రజలకు ఇబ్బంది కలిగింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రవీంద్రనగర్‌లో విజయభాస్కర్‌ రెడ్డి నివసిస్తున్న ఇంటిపై తాలూకా ఎస్‌ఐ రాజరాజేశ్వర్‌ రెడ్డి తమ సిబ్బందితో దాడి చేశారు. అతను పరారవడంతో ఆ ఇంటి వాతావరణాన్ని గమనించి కేసు నమోదు చేశారు.
– నిందితుడు విజయభాస్కర్‌ రెడ్డిని ఎట్టకేలకు ఆగస్టు 15న బిల్టప్‌ సమీపంలో అరెస్ట్‌ చేశారు. అతన్ని విచారించిన అనంతరం ప్రస్తుతం ఈ కుంభకోణంలో 50 మందిని నిందితులుగా చేర్చారు. వీరిలో ఇప్పటి వరకు 11 మందిని అరెస్ట్‌ చేశారు. ఇంకా 40 మందికి పైగా అరెస్ట్‌ కావాల్సి ఉంది.

రూ.కోట్లలో కుంభకోణం
 రూ. కోట్లలో కుంభకోణం జరిగిందనే వాస్తవాలు క్రమక్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. విజయ భాస్కర్‌రెడ్డి వద్ద నుంచి 2800 ఖాళీ స్టాంప్‌ పేపర్లు, ఇతర నిందితుల దగ్గరి నుంచి 22 నకిలీ రబ్బరు స్టాంప్‌లు, 24 నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు.  స్వాధీనం చేసుకున్న స్టాంప్‌లలో 1960–70 కాలం నాటివి సీజ్‌ చేశామని పోలీసులు చెబుతున్నారు. వీటి ఆధారంగా తాము ఎంచుకున్న ఆస్తినిగానీ, స్థలాలను గానీ, భూములనుగానీ సొంతం చేసుకుని బ్యాంకుల్లో సైతం రుణాలు పొందారు. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో ఎంచక్కా రిజిస్ట్రేషన్లు కూడా చేయించుకోవడం లాంటి అక్రమాలకు పాల్పడ్డారని తెలుస్తోంది. ఇలా కోట్లాది రూపాయల కుంభకోణానికి పాల్పడినట్లు స్పష్టమవుతోంది.

– ఈ కుంభకోణంలో కొందరు బ్యాంకు అధికారులు, సిబ్బంది, రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖల ఉద్యోగుల ప్రమేయం కూడా ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 1960, 1970, 1990  కాలం నాటి స్టాంపులను కూడా వేలాది రూపాయలకు విక్రయించి సొమ్ము చేసుకున్నారని విచారణలో తెలుస్తోంది. అరెస్టు అయిన వారంతా డాక్యుమెంట్‌ రైటర్స్, స్టాంప్‌ వెండర్లు, నకిలీ రబ్బరు స్టాంపుల తయారీదారులు, రెవెన్యూశాఖలోని ఉద్యోగులు, వారి బంధువులు కావడం గమనార్హం. ఇంకా లోతుగా విచారిస్తామని, త్వరలో బ్యాంకులకు, రిజిస్ట్రేషన్, రెవెన్యూ కార్యాలయాలకు నోటీసులు కూడా జారీ చేస్తామని పోలీసులు అంటున్నారు. జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ ఈ కుంభకోణం విషయంలో ప్రత్యేక దృష్టితో  విచారణ చేయిస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు