ఆర్టీసీ కండక్టర్‌ అనుమానాస్పద మృతి

25 Feb, 2017 00:16 IST|Sakshi

కదిరి టౌన్‌ : కదిరి డిపోలో పనిచేస్తున్న ఆర్టీసీ కండక్టర్‌ జానకీపతిరెడ్డి (47) శుక్రవారం వైఎస్సార్‌ జిల్లా పులివెందులకు వెళ్లే దారిలోని నామాల గుండు వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాలిలావున్నాయి. తలుపుల మండలం వేపమానిపేటకు చెందిన జానకీపతిరెడ్డికి భార్య లక్ష్మిదేవి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కదిరి పట్టణంలోని వాణీవీధిలో నివాసమున్న ఆయన మూడు మాసాల కిందట తన కుమార్తె అనుషాకు వివాహం చేశాడు. కుమారుడు నవీన్‌రెడ్డి తిరుపతిలో బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం డ్యూటీ లేనందున జానకీపతిరెడ్డి ఉదయాన్నే ఇంటిలో టిఫిన్‌ తిని బయటకు బయలుదేరాడు. మధ్యాహ్నమైనా తిరిగి రాకపోయేసరికి అతని సెల్‌కు భార్య పలుమార్లు ఫోన్‌ చేసింది.

ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ వస్తుండటంతో ఆందోళన చెంది వెతకడం ప్రారంభించింది. ఈలోపు పులివెందులకు వెళ్లేదారిలోని నామాలగుండు వద్ద జానకీపతిరెడ్డి ముఖం, కాళ్లు, చేతులకు బలమైన రక్తగాయాలై కొండకింద రాళ్లమధ్య విగతజీవిగా పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. జేబులోని డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఆధారాలను బట్టి స్థానికులు ఈ విషయాన్ని భార్యకు ఫోన్‌ చేసి చెప్పారు. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన భార్య, కుటుంబ సభ్యులు పరుగున సంఘటనాస్థలికి వెళ్లారు. పులివెందుల పోలీసులు సంఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఎవరైనా ఇతన్ని హత్య చేశారా..? లేక కొండ పైనుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఏదైనా రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడా..? తెలియడం లేదు. జానకీపతిరెడ్డి మృదుస్వభావి అని, ఎవరితోనూ గొడవలు, కక్షలు లేవని  కుటుంబ సభ్యులతోపాటు ఇరుగుపొరుగు వారు కూడా చెబుతున్నారు. ఈయన కొంతమందికి అప్పులు ఇచ్చాడు. వారిలో ఎవరైనా డబ్బు ఎగ్గొట్టేందుకు ఏమైనా హత్య చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానిజాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా