వాడివేడిగా నారాయణఖేడ్‌లో ‘ఆర్టీసీ’ ఎలక్షన్స్‌

17 Jul, 2016 23:15 IST|Sakshi
నారాయణఖేడ్‌ ఆర్టీసీ డిపో
 • ఆర్భాటంగా  ఎన్నికల ప్రచారం
 • గుర్తింపు కోసం తలపడుతున్న యూనియన్లు
 • నారాయణఖేడ్‌: ఆర్టీసీలో జరుగుతున్న గుర్తింపు ఎన్నికల్లో ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు వివిధ కార్మిక సంఘాలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే డిపో ఆవరణంలో ఎన్నికల సందడి మొదలైంది. ఈనెల 19న పోలింగ్‌ జరగనున్నాయి.

  ఇప్పటి వరకు ఎన్‌ఎంయూదే ఆధిపత్యం
  నారాయణఖేడ్‌లో ఆర్టీసీ డిపో 1987వ సంవత్సరంలో ఆవిర్భవించింది. డిపో ఆవిర్భావం నుంచి ఎక్కువసార్లు నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌(ఎన్‌ఎంయూ)నే ఆధిపత్యం కొనసాగిస్తోంది. 1991లో ఒకసారి భారతీయ మజ్దూర్‌సంఘ్‌(బీఎంఎస్‌) గెలుపొందింది. ఇదిలా ఉండగా, గత ఏడాది ఎన్నికల్లో నూతనంగా ఆవిర్భవించిన తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌(టీఎంయూ) గెలిచింది.

  టీఎంయూ ఏర్పాటు అనంతరం ఎన్‌ఎంయూ భారీగా పతనమైంది. ఎన్‌ఎంయూలో చాలామంది నాయకులు, కార్మికులు టీఎంయూలో చేరడంతో ఆ యూనియన్‌ బలపడింది. ఈసారి కూడా తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు టీఎంయూ ప్రయత్నిస్తుండగా.. ఆ యూనియన్‌ను మట్టికరిపించాలని మిగతావారు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. డిపోలో 327 మంది కార్మికులు ఓటర్లుగా ఉన్నారు.

  గట్టిపోటీ ఇవ్వనున్న టీఎంయూ
  ఎన్నికల్లో రాష్ట్రస్థాయి గుర్తింపునకు క్టాస్‌–3కు తెలుపురంగు ఓటరు స్లిప్పుపై, రీజినల్‌æస్థాయిలో గుర్తింపునకు క్లాస్‌–6 పింక్‌కార్డు ఓటరు స్లిప్పుపై ఓటేయాల్సి ఉంది. రీజియన్‌ స్థాయిలో గెలిచిన యూనియన్‌ అధికారికంగా స్థానిక డిపోల్లో అధికారిక యూనియన్‌గా చలామణి అవుతుంది. నారాయణఖేడ్‌ డిపోలో టీఎంయూ మాత్రమే స్వతహాగా క్లాస్‌–3, క్లాస్‌–6కు పోటీ చేస్తోంది.

  కాగా, ఎంప్లాయీస్‌ యూనియన్‌(ఈయూ), బీఎంఎస్, ఎన్‌ఎంయూ యూనియనుల్లు జేఏసీగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. ఈ మూడు యూనియన్లు రీజియన్‌ స్థాయిలో క్లాస్‌–6కు ఐక్యంగా పోటీలో ఉన్నాయి. రాష్ట్రస్థాయిలో క్లాస్‌–3కి మాత్రం విడివిడిగా పోటీకి దిగుతున్నారు. ఇప్పటికే టీఎంయూతో కలిసి టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రచారం నిర్వహించారు.

  ఆ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు తిరుపతయ్య, జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్‌.. యూనియన్‌ తరపున బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అధికారంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉన్నందున కార్మికులంతా టీఎంయూకు ఓటేసి గెలిపించాలని, తమ సమస్యల పరిష్కారానికి టీఎంయూ మాత్రమే ప్రత్యామ్నాయమని హామీలిచ్చారు.

  కాగా, బీఎంఎస్‌ నుంచి రీజియన్‌ కార్యదర్శి మెట్టు రాఘవులు, ఎంప్లాయీస్‌ యూనియన్‌ నుంచి జిల్లా కార్యదర్శి కాన్షీరాం, ఎన్‌ఎంయూ జిల్లా అధ్యక్షుడు రాములు ప్రచారాన్ని నిర్వహించారు. టీఎంయూ నాయకులు కార్మికుల వద్ద ముడుపులు వసూలు చేస్తూ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు