అవమాన భారం.. బలవన్మరణం

10 Jul, 2016 03:56 IST|Sakshi
అవమాన భారం.. బలవన్మరణం

సహచరుడు చెప్పుతో కొట్టాడని ఉరి వేసుకున్న
ఆర్టీసీ కార్మికుడు  ఫిర్యాదును పోలీసులు
పట్టించుకోక పోవడంతో తీవ్ర ఆవేదన

 ప్రొద్దుటూరు టౌన్: ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపో గ్యారేజీలో శ్రామిక్‌గా పని చేస్తున్న ధనిరెడ్డి కొండారెడ్డి (47) శనివారం వేప చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తనకు జరిగిన అవమానాన్ని తలుచుకుని కుమిలిపోయిన ఆయన చివరకు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అతను డిపోలో ఐదేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. బుధవారం గ్యారేజీలో టైర్ల సెక్షన్‌లో పని చేస్తున్న కొండారెడ్డి పని ముట్లు కనిపించలేదని అక్కడే ఉన్న కార్మికులను అడిగాడు. వారు మెకానిక్ రామచంద్రుడు తీసుకెళ్లినట్లు చెప్పారు.

కొద్ది సేపటి తర్వాత కనిపించిన పనిముట్లకు గ్రీసు, ఆయిల్ పూసి ఉండటంతో ఇలా చేస్తే ఎలా అని కొండారెడ్డి ప్రశ్నించాడు. దీంతో రామచంద్రుడు.. కొండారెడ్డితో వాగ్వాదానికి దిగాడు. ఈ విషయాన్ని ఎంఎఫ్ మద్దిలేటి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సర్ది చెప్పారు. ఎంఎఫ్‌కు తనపై ఫిర్యాదు చేస్తావా? అని కొండారెడ్డిని.. తన అనుచురులు పట్టుకోగా రామచంద్రుడు చెప్పుతో కొట్టాడు. కొండారెడ్డి అక్కడే ఉన్న టైర్ రింగ్ తీసుకొని రామచంద్రుడిపైకి విసిరాడు. అతనికి గీకుడు గాయమైంది. దీంతో రామచంద్రుడు.. కొండారెడ్డి తనను కొట్టాడని జిల్లా ఆస్పత్రి ఔట్‌పోస్టులో ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు అదే రోజు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని కొండారెడ్డి తీవ్ర ఆవేదనతో యూనియన్ నాయకులు ఎన్‌ఆర్.శేఖర్, సీఆర్‌ఎస్.రెడ్డి, మాచయ్య దృష్టికి తీసుకెళ్లారు.

కొండారెడ్డి ఫిర్యాదు చేసినా తీసుకోని పోలీసులు..

గురువారం కొండారెడ్డితోపాటు యూనియన్ నాయకులు మాచయ్య, మరికొందరు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ అధికారులు ఎవ్వరూ లేక పోవడంతో తిరిగి శుక్రవారం వెళ్లారు. అయితే కొండారెడ్డి ఫిర్యాదును ఎస్‌ఐ ఆంజనేయులు తీసుకోలేదు. దీంతో వారు వెనుదిరిగారు. ఈ విషయాన్ని కొండారెడ్డి భార్య సులోచనకు శుక్రవారం రాత్రి చెప్పి కన్నీటి పర్యంతమయ్యాడు. ఆమె ఓదార్చినా అతని వేదన తీరలేదు. శనివారం యథావిధిగా విధులకు వచ్చాడు. మధ్యాహ్నం 3.10 గంటల సమయంలో గ్యారేజీలో ఉన్న వేప చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్యారేజీలో 40 మందికి పైగా కార్మికులు పని చేస్తున్నారు. వారు భోజనానికి వెళ్లారు. కొండారెడ్డి అఘాయిత్యానికి పాల్పడిన సమయంలో ఎవరూ లేరని అధికారుల విచారణలో తేలింది. చెట్టుకు వేలాడుతున్న కొండారెడ్డిని గ్యారేజీలోకి వచ్చిన కొందరు కార్మికులు చూసి కిందికి దించారు. అప్పటికే కొండారెడ్డి చనిపోయాడు.

 ఎస్‌ఐ ఏమంటున్నారంటే...
ఈ సంఘటనపై వన్‌టౌన్ ఎస్‌ఐ ఆంజనేయులును ‘సాక్షి’ వివరణ కోరగా.. ఆర్టీసీ యూనియన్ నాయకులు ఫిర్యాదు విషయంపై తనతో మాట్లాడలేదన్నారు. కొండారెడ్డిపై పెట్టిన కేసును లోక్ అదాలత్‌లో పెట్టించి.. రాజీ చేసే విషయంపై మాట్లాడారని ఆయన చెప్పారు.       

ఫిర్యాదు తీసుకుని ఉంటే చనిపోయేవాడు కాదు
విషయం తెలుసుకుని సంఘటన స్థలానికి వచ్చిన అర్బన్ సీఐ సుధాకర్‌రెడ్డి, రూరల్ సీఐ ఓబులేసు, టూటౌన్ ఎస్‌ఐ మంజునాథరెడ్డితో యూనియన్ నాయకులు మాచయ్య, శేఖర్  మాట్లాడారు. కొండారెడ్డి ఫిర్యాదును తీసుకుని ఉంటే అతను చనిపోయి ఉండే వాడు కాదని వారు అన్నారు. కుటుంబ సభ్యులు కొండారెడ్డి మృతదేహం వద్దకు వచ్చి రోదించడం తోటి కార్మికులను కలిచివేసింది. ‘దిక్కులేనోళ్లను చేసి.. వెళ్లావా’ అంటూ భార్య సులోచన గుండెలవిసేలా రోదించింది.

‘నా భర్తను కొట్టి.. కేసు పెట్టినందుకే అవమానంతో చనిపోయాడు. ఆయన చావుకు మీరే కారణం’ అని ఆమె ఆరోపించింది. జరిగిన సంఘటనపై డిపో మేనేజర్ హరి దృష్టికి కార్మికులు తీసుకెళ్లినా.. ఇద్దరిని సస్పెండ్ చేస్తామని అన్నారే తప్ప వారిని విచారణ చేసి, మందలించి ఉంటే ఈ సంఘటన జరిగేది కాదని యూనియన్ నాయకులు అంటున్నారు. కొండారెడ్డి కుమారుడు వెంకట కిరణ్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు