ప్రగతిలేని చక్రం

19 Jun, 2016 17:14 IST|Sakshi
ప్రగతిలేని చక్రం

నష్టాల  బాటన ఆర్టీసీ ఏడాదికి రూ.10 కోట్ల భారంఠ
కరువు ప్రధాన కారణం విపరీతంగా పడిపోయిన ఆక్యుపెన్సీ
జిల్లాలో ఏడు డిపోలు, 618 బస్సులు
78 వేల బస్సు పాసులు కరువు వల్లే నష్టాలు


 గతంతో పోలిస్తే ఈయేడు ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉంది. రెండేళ్ల క్రితం రూ.3కోట్లు నష్టంలో ఉండగా, ఈసారి 10కోట్లకు చేరింది. ప్రధానంగా కరువు నెలకొనడం.. పల్లె జనం వలస బాట పట్టడంతో ఆక్యుపెన్షి విపరీతంగా పడిపోయింది. దీనికితోడు ఉద్యోగుల వేతన పెంపు, ఆర్టీసీ కోసం తీసుకొచ్చిన రుణం వడ్డీ పెరగడం మరో కారణం.  హైదరాబాద్‌కు మెదక్‌జిల్లా దగ్గరగా ఉండటంతో ఆదాయం రావడం లేదు. తెలంగాణలోని ఖమ్మం, కరీంనగర్ వంటి డిపోలు లాభాల బాటలో ఉంటాయి. హైదరాబాద్‌కు దూరంగా ఉండటం వల్ల బస్సు ఛార్జీలు అధికంగా ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే బస్సులు నష్టాలు చవిచూస్తున్నాయి. -రఘునాథ్, ఆర్‌ఎం
 
 మెదక్: ప్రగతి రథచక్రాలు.. ప్రగతిని వీడి నష్టాల్లో కూరుకుపోతున్నాయి. జిల్లాలో ఏడాదికి రూ. పది కోట్ల భారం పడుతోంది. రెండేళ్ల క్రితం రూ. 3 కోట్లు ఉండగా. ఈసారి ఏకంగా రూ.10 కోట్లకు చేరింది. ఉద్యోగుల వేతనాల పెంపు, తరచూ పెరిగే డిజీల్‌ధరలు, మెతుకుసీమలో నెలకొన్న కరువు నష్టాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. హైదరాబాద్, తిరుపతి, కాకినాడ, అమలాపురం వంటి దూర ప్రాంతాలకు తప్ప మిగతా రూట్లలో నష్టాలను చవి చూడాల్సి వస్తోంది. మెదక్‌తోపాటు  సిద్దిపేట, నారాయణఖేడ్, జహీరాబాద్, ప్రజ్ఞాపూర్, దుబ్బాక, సంగారెడ్డి డిపోలున్నాయి. ఇందులో మొత్తం 618 బస్సులుండగా, నిత్యం 2లక్షల 37వేల కిలో మీటర్ల ప్రయాణం చేస్తున్నాయి. ఇందులో 177 ఎక్స్‌ప్రెస్‌లు, ఆర్డీనరీ, ప్రైవేట్ బస్సులు ఉండగా, 407 పల్లె వెలుగు,  17 సూపర్ లగ్జరీలు, మరో 17 డీలక్స్ బస్సులున్నాయి.

హైదారాబాద్, తిరుపతి, కాకినాడ, అమలాపురం వంటి రూట్లలో మాత్రమే కాస్తో.. కూస్తో లాభం వస్తుందని, మిగతా రూట్లలో ఆర్టీసికి తీవ్ర నష్టం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీకి సంబంధించి 78 వేల బస్సు పాసులున్నాయి. అందులో విద్యార్థులకు ఉచిత బస్సు పాస్‌లు ఉండగా, మరి కొందరికి సబ్సిడీ పాస్‌లున్నాయి. 50 శాతం సబ్సిడీతో వికలాంగుల పాస్‌లున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే బస్సులు తీవ్రనష్టాన్ని చవిచూస్తున్నాయని తెలిపారు. ప్రతిగ్రామంలో పదుల సంఖ్యలో ఆటోలు ఉండటం ప్రధాన కారణం. జిల్లాలో సుమారు వంద గ్రామాలకు నేటికీ బస్సులు నడవడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఆటోలు అధికంగా తిరగడం వల్ల ప్రయాణికులు బస్సుల్లో ఎక్కడం లేదని ఓ అధికారి పేర్కొన్నారు.

బస్సులు గ్రామాలకు వెళ్లే సమయంలోనే ప్రయాణికులు ఉంటున్నారని, తిరిగి వచ్చే సమయంలో ఉండటంలేదని తెలిపారు. ఆర్టీసీ ఉన్నతాధికారులతో సీఎం అత్యవసర సమావేశం నిర్వహించిన విషయం విదితమే. నష్టాల్లో నడుస్తున్న ఆర్టీసీని లాభాల బాట పట్టించుకునేందుకు కొన్ని సూచనలు చేశారు. ఆర్టీసీ అభివృద్ధి పథంలో నడిచేందుకు నియోజకర్గంలోని ఎమ్మెల్యేల అభివృద్ధి కోటా నుంచి ఆర్టీసీకి కొన్ని నిధులు కేటాయించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఈ నిధులతో ప్రయాణికుల సౌకర్యార్థం బస్టాండ్‌లో సౌకర్యాలు కల్పించనున్నారు. అలాగే షాపులను ఏర్పాటు చేసి వాటిని వ్యాపారులకు అద్దెకు ఇవ్వడం, వాణిజ్య ప్రకటనలకు ప్రాధాన్యత ఇచ్చేందుకు నిర్ణయించారు. అంతేకాకుండా మెదక్ జిల్లా బస్సులు కాకినాడ వంటి దూర ప్రాంతాలకు అదనంగా నడిపి ఆదాయాన్ని సమకూర్చకునేందుకు సమాయాత్తమవుతున్నట్లు వినికిడి.

మరిన్ని వార్తలు