ఆర్టీసీకి ‘పుష్కర’ంగా ఆదాయం

24 Aug, 2016 17:28 IST|Sakshi
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఆర్టీసీ రీజియన్‌కు పుష్కరాల ఆఖరు రోజుల్లో ఆదాయం బాగా సమకూరింది. తొలి వారం రోజుల పాటు ప్రయాణికుల ఆదరణ లేకుండా పోయింది. కృష్ణా పుష్కరాల కోసం ఈ నెల 12 నుంచి విజయవాడకు 924 సర్వీసులను నడిపింది. ఈ బస్సులు మొత్తం 7.30 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి 76 వేల మంది భక్తులను గమ్యస్థానాలకు చేర్చాయి.  అయితే ఆరంభంలో ప్రయాణికులు అంతగా బస్సుల్లో ప్రయాణించలేదు. దీంతో రోజుకు 80 బస్సుల చొప్పున నడపాలనుకున్న అధికారులు బాగా కుదించారు. బస్సులు పూర్తిగా నిండాకే వాటిని విజయవాడకు పంపేవారు. పుష్కరాలు ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో క్రమేపీ ఈ నెల 19 నుంచి భక్తుల రద్దీ ఎక్కువైంది. దీంతో 19 నుంచి 22 వరకు పెద్ద సంఖ్యలో వీరు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. ఫలితంగా ఈ 12 రోజులూ విశాఖ రీజియన్‌కు రూ.2.38 కోట్ల పుష్కర ఆదాయం సమకూరింది. గతంలో కృష్ణా పుష్కరాలకు ఈ రీజియన్‌ నుంచి 360 బస్సులను నడిపారు. మరోవైపు కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడలో ఘాట్ల వద్దకు ప్రయాణికులను తీసుకెళ్లడం కోసం 220 బస్సులను ఈ రీజియన్‌ నుంచి పంపారు. సుమారు వెయ్యి మంది కండక్టర్లు, డ్రై వర్లు అక్కడ విధులకు వెళ్లారు.  మరో 400 మంది ఇతర సిబ్బంది కూడా పుష్కర సేవల్లో పాల్గొన్నారు. ఈ పుష్కరాల 12 రోజుల పాటు విశాఖ ద్వారకా బస్‌స్టేషన్‌లో 24 గంటలూ సిబ్బంది విధులు సేవలందించారు. పుష్కరాలకు ఆర్టీసీ సేవా దృక్పథంతోనే తప్ప లాభార్జనతో బస్సులను నడపలేదని రీజనల్‌ మేనేజర్‌ జి.సుధేష్‌కుమార్‌ ‘సాక్షి’కి చెప్పారు. పుష్కర ఆదాయం సంతృప్తికరంగానే ఉందన్నారు. పుష్కరాల్లో ఉత్తమ సేవలందించిన సిబ్బందిని గుర్తించి వారికి ప్రశంసా పత్రాలు అందజేస్తామన్నారు. డిపోల వారీగా వారిని గుర్తించే ప్రక్రియ జరుగుతోందని తెలిపారు. 
 
>
మరిన్ని వార్తలు