ఆరు నెలల ఆర్టీసీ నష్టం రూ.46 కోట్లు

16 Oct, 2016 00:28 IST|Sakshi

కర్నూలు(రాజ్‌విహార్‌):
ఆర్టీసీ కర్నూలు రీజియన్‌కు గత ఆరు నెలల్లో రూ. 46కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని రీజినల్‌ మేనేజర్‌ గిడుగు వెంకటేశ్వర రావు వెల్లడించారు. శనివారం స్థానిక జోనల్‌ స్టాఫ్‌ ట్రైనింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ రంగ ప్రజా రవాణా సంస్థకు అనుకోని ఎదురుదెబ్బలు పడుతూనే ఉన్నాయని, ఈ కారణంగా నష్టాల్లోకి కూరుకుపోతోందని చెప్పారు. వార్షిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు సంస్థకు రూ.46కోట్ల మేరకు నష్టం వచ్చిందని, ఇందులో ఎమ్మిగనూరు, ఆత్మకూరు డిపోలో రూ. 5కోట్ల చొప్పున నష్టాల్లో మొదటి స్థానంలో ఉన్నాయని పేర్కొన్నారు. బనగానపల్లె, డోన్‌ డిపోలు రూ.4కోట్లతో రెండో స్థానంలో, ఆళ్లగడ్డ రూ.3కోట్లు, కర్నూలు–1, 2డిపోలో రూ. 2కోట్ల నష్టాల్లో ఉన్నాయని వెల్లడించారు. సంస్థను ముందుకు నడిపించేందుకు సగటున నెలకు రూ.7.50 కోట్ల వరకు అప్పులు తెస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఈనష్టాలను నివారించేందుకు చర్యలు చేపట్టామని, రెండు మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకోనున్నట్లు చెప్పారు. కొత్తగా ప్రవేశపెట్టిన పార్సిల్, లగేజీ విధానంతోపాటు సూపర్‌ లగ్జరీ (హైటెక్‌) బస్సు డిక్కీలను నెలవారి అద్దె ప్రతిపాదికన బాడుగకు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని వాణిజ్య, వ్యాపారస్తులు, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.   

మరిన్ని వార్తలు