విశ్రాంత ఉపాధ్యాయిని దారుణ హత్య

17 Oct, 2016 01:42 IST|Sakshi
విశ్రాంత ఉపాధ్యాయిని దారుణ హత్య
  •  గొంతుకోసి నగలు దోచుకెళ్లిన దుండగులు
  •  సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏఎస్పీ
  •  విభిన్న కోణాల్లో కేసు దర్యాప్తు
  • నెల్లూరు (క్రైమ్‌) :విశ్రాంత ఉపాధ్యాయిని దారుణ హత్యకు గురైంది. దుండగులు ఆమె గొంతు కోసి ఒంటిపై ఉన్న బంగారు నగలు దోచుకెళ్లారు. ఈ సంఘటన ఏసీ నగర్‌ (బాలాజీనగర్‌ పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరం)లో ఆదివారం తెల్లవారు జామున జరిగింది. హత్య జరిగిన తీరు పలు అనుమానాలాకు తావిస్తున్నాయి. స్థానికుల సమాచారం మేరకు.. ఏసీనగర్‌ వినాయకుడి గుడి సమీపంలో విశ్రాంత ఉపాధ్యాయిని కుంచాల విజయరత్నం (72) నివాసం ఉంటుంది. 2003లో ఆమె భర్త రాజారత్నం మృతి చెందాడు. విజయరత్నం సైతం పదవి విరమణ పొందటంతో అప్పటి నుంచి ఒంటరిగా జీవిస్తోంది. ఇంటి అద్దెలు, పింఛన్‌తో బతుకుతుంది. శనివారం రాత్రి ఎప్పటిలాగే విజయరత్నం తన ఇంట్లో నిద్రించింది. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి ఆమె ఎడమ చేతి నరాలను కోసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత గొంతుకోసి ఆమె ఒంటిపై ఉన్న సుమారు 5 సవర్ల బంగారు దండ, కమ్మలు, ఉంగరం దోచుకున్నారు. పక్క గదిలో ఉన్న బీరువాలను తెరిచి గాలించారు. ఎప్పటిలాగే శనివారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో వెంకటమ్మ పనులు చేసేందుకు ఇంటికి వచ్చింది. ఇంటి తలుపులు తెరచి ఉండటంతో లోనికి వెళ్లి చూడగా విజయరత్నం మంచంపై హత్యకు గురై ఉంది. దీంతో  ఆమె పెద్దగా కేకలు వేస్తూ బయటకు వచ్చి సరస్వతీనగర్‌లోని మృతురాలి కుమారుడు (తన భర్త మొదటి భార్య కుమారుడు) రమేష్‌కుమార్‌కు చెప్పింది. అతను సంఘటనా స్థలానికి చేరుకుని బాలాజీనగర్‌ పోలీçసులకు సమాచారం అందించారు. ఏఎస్పీ బి. శరత్‌బాబు, నగర, సీసీఎస్‌ డీఎస్పీలు జె. వెంకటరాముడు, బాలసుందరం, స్థానిక ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ రామారావుతో పాటు ఇన్‌స్పెక్టర్లు సుధాకర్‌రెడ్డి, సీతారామయ్య, రామకృష్ణారెడ్డి, ఎస్‌ఐలు శ్రీనివాసరావు, అలిసాహెచ్, జగత్‌సింగ్‌లు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్యకు నిందితుడు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలంలో క్లూస్‌టీం ఏఎస్‌ఐ రవీంద్రరెడ్డి ఆధ్వర్యంలో వేలిముద్రలు సేకరించారు. డాగ్‌స్క్వాడ్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించింది. హత్యా స్థలి నుంచి ఏసీ మున్సిపల్‌ స్కూల్‌ మీదుగా అల్లం టీ సెంటర్‌ వరకు వెళ్లి అక్కడే జాగిలం ఆగిపోయింది. హత్య ఘటనపై బాలాజీనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం డీఎస్‌ఆర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 
    విభిన్న కోణాల్లో కేసు దర్యాప్తు 
    విజయరత్నం హత్యకేసు పలు అనుమానాను రేకత్తిస్తోంది. దుండగులు ఇంట్లోకి ప్రవేశించి ఆమెను హత్యచేసే క్రమంలో కనీసం పెనుగులాడిన ఆనవాళ్లు, దుండగులను తప్పించుకునేందుకు యత్నించిన ఆనవాళ్లు సైతం లేవు. ఆమె బాగా తెలిసిన వారిని మినహా ఇతరులెవ్వరిని ఇంట్లోకి అనుమతించేది కాదని కుటుంబ సభ్యులు, అదే ప్రాంగణంలో అద్దెకు ఉంటున్న వారు తెలిపారు. దీన్ని బట్టి ఆమెను హత్య చేసిన వారు బాగా తెలిసిన వారై ఉండొచ్చునని, హత్యోదంతాన్ని పక్కదోవ పట్టించేందుకు నగలు దోచుకెళ్లి దోపిడీ దొంగల పనిగా సృష్టించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  మరోవైపు ఆమె నిద్రపోయే క్రమంలో తలుపులకు గడియ పెట్టుకోవడం మరిచిపోయి ఉండటంతో దుండగులు లోనికి జొరబడి హత్య చేసి ఉండొచ్చునన్న అనుమానాలు లేకపోలేదు. దీంతో పోలీసులు విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.  
మరిన్ని వార్తలు