నిరుద్యోగుల పాలిట కల్పతరువు

15 Apr, 2017 23:38 IST|Sakshi
నిరుద్యోగుల పాలిట కల్పతరువు

- ఎందరికో స్వయం ఉపాధి కల్పన
- 28 కోర్సుల్లో యువతకు శిక్షణ

 
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ) సమీపంలో ఏర్పాటైన రూడ్‌సెట్‌ సంస్థ నిరుద్యోగుల జీవితాలకు కల్పతరువులా నిలిచింది. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించి..వారిని సాధికారత దిశగా తీసుకెళుతోంది. వివిధ రంగాల్లో నైపుణ్యం పెంపొందించి.. అవకాశాలు అందిపుచ్చుకొని సొంతకాళ్లపై నిలదొక్కుకునేలా తీర్చిదిద్దుతోంది. ఉచిత భోజనం, వసతి కల్పించి మరీ శిక్షణ ఇస్తూ.. ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తూ..శిక్షణార్థులకు బ్యాంకు రుణం మంజూరు చేయించి, వారు జీవితంలో స్థిరపడే వరకు బాధ్యత తీసుకుంటోంది. శిక్షణ పొందిన వారు మరికొంతమందికీ ఉపాధి కల్పించే స్థాయికి తీసుకెళ్తోంది. ధర్మస్థలం ట్రస్టు, సిండికేట్‌ బ్యాంకు సంయుక్త ఆధ్వర్యంలో నడుస్తున్న రూడ్‌సెట్‌ 28 రకాల కోర్సుల్లో శిక్షణ ఇస్తోంది. గతేడాది 768 మంది ఇక్కడ శిక్షణ పొంది స్వయం ఉపాధి రంగంలో స్థిరపడ్డారు.
- ఎస్కేయూ

అందిస్తున్న కోర్సులు :
ఉమెన్స్‌ టైలర్‌ :
అనంతపురం జిల్లాకు చెందిన నిరుద్యోగ మహిళలు 35 ఏళ్ల లోపు వయసు వారు ఈ కోర్సు చేసేందుకు అర్హులు. ఆధార్‌ కార్డు తప్పనిసరిగా ఉండాలి. నెలరోజుల కాలవ్యవధిలో 240 గంటలు తరగతులు నిర్వహిస్తారు. టైలరింగ్‌ కోర్సు పూర్తయిన తరువాత వివిధ రకాల బ్యాంకుల నుంచి రుణ సదుపాయం కల్పిస్తారు.

బ్యూటీ పార్లర్‌ మేనేజ్‌మెంట్‌ :
మహిళలకు ఉచితంగా బ్యూటీ పార్లర్‌ కోర్సులో శిక్షణ ఇస్తారు. 18 నుంచి 35 ఏళ్లలోపు వయసు ఉండి ఆధార్‌ కార్డు ఉన్న వారికి కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. 30 రోజుల కాలవ్యవధితో 240 గంటలు తరగతులు నిర్వహిస్తారు.

ఎలక్ట్రికల్‌ మోటార్‌ రీ వైండింగ్‌ అండ్‌ రిపేరీ సర్వీసెస్‌ :
ఎలక్ట్రికల్‌ రంగంలో కనీస అవగాహన కలిగి ఉండాలి. మోటార్‌ రివైండింగ్‌ అండ్‌ రిపెరీ సర్వీసెస్‌ను పూర్తిగా పురుషులకు నేర్పిస్తారు. నెల రోజులు కోర్సు కాల వ్యవధి. 240 గంటలు తరగతులు తీసుకుంటారు.

డెయిరీ ఫార్మింగ్, వర్మీ కంపోస్ట్‌:
పశువులు పెంపకంలో గల మెలకువలు, పాల ఉత్పత్తి ఆధారిత పరిశ్రమలకు సంబంధించిన సమాచారం తదితర అంశాలను వివరిస్తారు. కోర్సు 10 రోజులు కాల వ్యవధితో 80 గంటలు తరగతులు నిర్వహిస్తారు.

ఫొటోగ్రఫీ అండ్‌ వీడియోగ్రఫీ :
ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ రంగంలో అవకాశాలు అపారంగా ఉన్నాయి. ఆధునికతకు అనుగుణంగా ఇక్కడ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. కోర్సు పూర్తయ్యాక బ్యాంకు రుణం మంజూరు అయ్యేలా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. శిక్షణ పూర్తయ్యాక కనీసం మూడేళ్లు శిక్షణార్థులను ప్రత్యేక పరిశీలన చేస్తారు. శిక్షణార్థి స్థిరత్వం వచ్చేంతవరకు అనేక అవకాశాలు కల్పించేలా చేయూతనిస్తారు. నెల రోజులు కోర్సు నేర్పిస్తారు.

గొర్రెల పెంపకం :
గొర్రెలను పెంచే విధానం, ఏ కాలంలో ఏ రకమైన వ్యాధులు వస్తాయి? వాటిని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై శాస్త్రవేత్తలతో తగిన సలహాలు, సూచనలు ఇప్పిస్తారు. 10 రోజులు కోర్సు కాల వ్యవధితో 80 గంటలు ప్రత్యేక తరగతులు ఉంటాయి. కోర్సు అనంతరం సూక్ష్మస్థాయి రుణాలు బ్యాంకుల నుంచి మంజూరు చేయడానికి చొరవ తీసుకుంటారు.

ఇన్‌స్టలేషన్‌ ఆఫ్‌ సర్వీసింగ్‌ అండ్‌ సీసీ టీవీ :
ప్రస్తుత పరిస్థితుల్లో సీసీ టీవీ వినియోగం తప్పనిసరి. ఈ రంగంలో ఉపాధి అవకాశాలు అపారంగా ఉన్నాయి. సీసీ టీవీల ఏర్పాటు, సర్వీసింగ్‌ విధానంపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. 13 రోజుల కాల వ్యవధిలో 104 గంటలు తరగతులు నిర్వహిస్తారు.

ఎంబ్రాయిడరీ అండ్‌ ఫ్యాబ్రింగ్‌ పెయింటింగ్‌ :
ఎంబ్రాయిడరీ అండ్‌ ఫ్యాబ్రింగ్‌ ట్రైనింగ్‌ పూర్తిగా మహిళలకు ఇస్తున్నారు. 30 రోజుల్లో 240 గంటలు తరగుతులు జరుగుతాయి.

కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ అండ్‌ నెట్‌వర్కింగ్‌ :
ఈ కోర్సులో ప్రవేశం కల్పించడానికి కనీస అర్హత డిగ్రీ. 45 రోజులు కోర్సు కాల వ్యవధి. 360 గంటలు తరగుతులు నిర్వహిస్తారు.
– డ్రెస్‌ డిజైనింగ్‌ ఫర్‌ ఉమెన్, పికిల్‌ అండ్‌ పాపడ్‌ మేకింగ్, సిల్క్‌ థ్రెడ్‌ అండ్‌ జ్యువెలరీ మేకింగ్‌పై మహిళలకు ప్రత్యేకంగా నేర్పిస్తారు.
– సోలార్‌ అండ్‌ ఎల్‌ఈడీ ఎక్విప్‌మెంట్‌ అసెంబ్లింగ్‌ , మల్టీ ఫోన్‌ సర్వీసింగ్, స్మార్ట్‌ఫోన్‌ సర్వీసింగ్, ఎల్‌ఎంవీ డ్రైవింగ్‌, ఎలక్ట్రికల్‌ మోటార్‌ రీవైండింగ్, అండ్‌ పంప్‌సెట్‌ మెయింటెనెన్స్‌ కోర్సులలో పురుషులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు.

కుటుంబానికి అండ
కుటుంబాన్ని చుట్టుముట్టిన ఆర్థిక ఇబ్బందులు, మరో వైపు పిల్లల చదువులు నన్ను ఆలోచనలో పడేశాయి. నేను ఏదైనా పనిచేసి నా కుటుంబానికి అండగా నిలవాలనుకున్నా. కుటుంబ సభ్యులు, బంధువులు అభ్యంతరం చెప్పినా నిర్ణయం మార్చుకోలేదు. పట్టుదలతో ఆటో నేర్చుకున్నా. రోజుకు రూ.300 నుంచి రూ.400 సంపాదిస్తున్నా. కుటుంబ పోషణ, పిల్లల ఫీజులు, పుస్తకాల కోసం ఆ మొత్తాన్ని ఖర్చు చేస్తున్నా. పిల్లలకు మంచి విద్య అందించాలన్నదే నా ధ్యేయం .
– నల్లమ్మ, ఆటో డ్రైవర్‌

స్వతహాగా ఎదగాలని...
- నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ)లో ఉద్యోగం చేశా. ఉద్యోగం చేసే కంటే స్వతహాగా ఎదగాలనుకున్నా. రూడ్‌సెట్‌లో సెల్‌ఫోన్‌ రిపేరీ నేర్చుకొన్నా. అనంతపురంలో గూగుల్‌ మొబైల్‌ షాపును ప్రారంభించా. వ్యాపారం బాగా జరుగుతోంది.
– రామునాయక్‌ , సెల్‌ఫోన్‌ రిపేరీ షాపు యజమాని

నెలకు రూ. 8వేల దాకా సంపాదన
పదో తరగతి వరకు చదివాను. ఉన్నత చదువులకు వెళ్లకపోవడంతో రూడ్‌సెట్‌లో టైలరింగ్‌లో శిక్షణ పొందాను. అనంతరం ఇంట్లోనే కుట్టుమిషన్‌ పెట్టుకున్నాను. డ్రెస్‌ మెటీరియల్, పంజాబీ డ్రెస్సెస్, బ్లౌజెస్, పెట్టీ కోట్స్‌ కుడుతున్నాను. నెలకు రూ.6 వేల నుంచి రూ. 8 వేల దాకా సంపాదిస్తున్నాను.
– సౌజన్య, తరిమెల, శింగనమల మండలం

కల సాకారమైంది
సొంతంగా వ్యాపారం నిర్వహించాలనే కల సాకారమైంది. పదో తరగతి వరకే చదవడంతో రూడ్‌సెట్‌లో బ్యూటీపార్లర్‌ కోర్సులో ప్రవేశం పొందాను. కోర్సు పూర్తయిన తరువాత పార్లర్‌ ఏర్పాటు చేయడానికి  కుటుంబ సభ్యులు సహకారం అందించారు. ఉచితంగా కోర్సు, వసతి కల్పించిన రూడ్‌సెట్‌ సంస్థ సహకారం మరువలేం. ‘ సోఫియా బ్యూటీ పార్లర్‌’ ఏర్పాటుకు రూ. 25 వేలు పెట్టుబడి అయింది. నెలకు రూ.6 వేలు సంపాదిస్తున్నాను.
– సల్మా, బ్యూటీపార్లర్‌ నిర్వాహకురాలు

 ఏడాదికి రూ.30 వేల ఆదాయం
గొర్రెల పెంపకంలో మెలకువలు రూడ్‌సెట్‌ సంస్థ ద్వారా తెలుసుకోవడంతో రూ.30 వేలు పెట్టుబడి పెట్టి 7 గొర్రెలు కొన్నాను. రూ.5 వేలు గొర్రెల ఫీడ్‌కు ఖర్చు అయింది. మొత్తం రూ.65 వేలకు అమ్మగా రూ.30 వేలు మిగిలింది. ఇలా రెండు సంవత్సరాల నుంచి ఆదాయం వస్తోంది.
– టి.లక్ష్మీదేవి, ముద్దినాయనపల్లి

శిక్షణ పొందిన వారంతా జీవితంలో స్థిరపడాలి
రూడ్‌సెట్‌లో శిక్షణ పొందిన ప్రతి అభ్యర్థీ జీవితంలో స్థిరపడాలి. మరో పది మందికి ఉపాధి కల్పించగలగాలన్నదే సంస్థ ఆశయం. సంస్థ వ్యవస్థాపకులు వీరేంద్ర హేగ్డే కలుల సాకారం చేయాలన్నదే మా లక్ష్యం. మరిన్ని కొత్త కోర్సులు అందుబాటులోకి తీసుకొచ్చే యోచనలో ఉన్నాం.
– ఎస్‌. రాంకుమార్, రూడ్‌సెట్‌ డైరెక్టర్, అనంతపురం  
 
సేవ చేసే భాగ్యం లభించడం అదృష్టం
గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు సేవ చేసే భాగ్యం రూడ్‌సెట్‌ సంస్థ ద్వారా దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. శిక్షణ ఇప్పించడమే కాకుండా సత్ప్రవర్తన, ఆత్మవిశ్వాసం, జీవితంలో పైకి వస్తామనే నమ్మకాన్ని అభ్యర్థుల్లో కలిగిస్తున్నాం. కోర్సులో ప్రవేశం పొందినప్పటి ప్రవర్తన, కోర్సు అనంతరం ప్రవర్తన అభ్యర్థిలో కనబడుతుంది. మానసికంగా దృఢత్వం కలిగించడానికి యోగా, తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
– ఉషారాణి, ఫ్యాకల్టీ మెంబర్, రూడ్‌సెట్, అనంతపురం .

ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగేలా..
ఉద్యోగం చేయడం కంటే.. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తగా ఎదిగి పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ప్రతి అభ్యర్థినీ తీసుకెళ్లేలా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాం. కోర్సు అనంతరం అభ్యర్థులను విస్మరించకుండా వారిని ప్రత్యేకంగా పరిశీలిస్తాం. జీవితంలో స్థిరత్వం వచ్చేంత వరకు చేయూతనిస్తున్నాము.
–బాపూజీ, ఫ్యాకల్టీ మెంబర్, రూడ్‌సెట్, అనంతపురం

ప్రముఖుల అభిప్రాయాలు : (సంస్థను సందర్శించిన సమయంలో వారు రాసిన విజిటర్స్‌ పుస్తకం నుంచి అనువాదం )

ప్రముఖ సంస్థల జాబితాలో చోటు ఖాయం
అనంతపురంలో ఉన్న రూడ్‌సెట్‌ సంస్థకు రాష్ట్రంలోని ప్రముఖ సంస్థల జాబితాలో చోటు దక్కడం ఖాయమనిపిస్తోంది. టీంవర్క్‌తో అన్ని కార్యక్రమాలూ నిర్వహిస్తుండడంతో స్వల్పకాలంలోనే సంస్థ ప్రతిష్ట పెరిగింది. జిల్లాలోని ప్రముఖ అధికారుల సహకారంతో కొత్త కోర్సులు అందుబాటులోకి తీసుకురావడం గర్వకారణం .
– వి.జె.అరుణ, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, రూడ్‌సెట్‌  

రూడ్‌సెట్‌ సేవలు ప్రశంసనీయం
యువతలోని నైపుణ్యాలు వెలికితీసే సంస్థను అనంతపురంలో ఏర్పాటు చేయడం గర్వకారణం. సంస్థ అందిస్తున్న సేవలు చూసి నాలో గొప్ప అనుభూతి కలిగింది. రూడ్‌సెట్‌ టీం  అంకితభావంతో నిర్వహిస్తున్న కార్యక్రమాలు  ప్రశంసించదగినవి.
– ఆచార్య కె.రాజగోపాల్, ఎస్కేయూ వీసీ

అసాధారణమైన కార్యక్రమాలు
అసాధారణమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు వెతుక్కోకుండా .. వారే అవకాశాలు కల్పించేంత పరిస్థితులు కల్పిస్తున్నారు.
– ఎస్‌.పి. శర్మ , ఫీల్డ్‌ జనరల్‌ మేనేజర్‌, ఎఫ్‌జీఎం ఆఫీసు, సిండికేట్‌ బ్యాంకు, హైదరాబాద్‌.

గొప్ప అనుభూతి
మానవ సేవే మాధవసేవ అనే సేవాభావం అలవరచుకొని.. సామాన్య ప్రజలకు సేవ చేస్తుండడం గొప్ప అనుభూతి కలిగిస్తోంది. సంస్థలోని శిక్షణ పొందుతున్న అభ్యర్థుల క్రమశిక్షణ, సోదరభావం నన్ను ఆకట్టుకున్నాయి. భవిష్యత్తు సృష్టికర్తలు మీరే అని ప్రగాఢంగా నమ్ముతున్నా. అనంతపురం జిల్లాలో ఇలాంటి సంస్థలు ఉండడం గొప్ప విషయంగా భావిస్తున్నా.
– డాక్టర్‌ వి.వినోద్‌ కుమార్‌ ఐఏఎస్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ (అండర్‌ ట్రైనింగ్‌), అనంతపురం

మరిన్ని వార్తలు