అధికార దోపిడీ

21 Dec, 2016 01:39 IST|Sakshi
  •  ప్రభుత్వ చలానా కంటే అధిక మొత్తం వసూలు
  •  ఉన్నతాధికారికి ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం
  • రవాణా కార్యాలయానికి వెళ్లాలంటే హడలెత్తుతున్న వైనం
  •  
    నెల్లూరు (టౌన్‌):
    పెద్ద నోట్లు రద్దుతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రవాణాశాఖలో మాత్రం పండగ చేసుకుంటున్నారు. ప్రభుత్వ చాలనాలోనే అధిక మొత్తం విధించి కొంతమంది ఉద్యోగులు బహిరంగ వసూళ్లకు పాల్పడుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ విషయంపై ఉన్నతాధికారికి పలువురు ఫిర్యాదు చేస్తే ఇక్కడ అంతే వసూలు చేస్తారు చెప్పినంత  చెల్లించి వెళ్లండంటూ ఉచిత సలహా ఇస్తున్నారు.
    నెల్లూరు నేతాజీనగర్‌కు చెందిన రాచమల్లి నాగభూషణం తన డ్రైవింగ్‌ లైసెన్స్‌ను రెన్యువల్‌ చేయించుకునేందుకు సోమవారం రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లాడు. రెన్యువల్‌ సెక‌్షనులో ఉండే ఉద్యోగికి తనకు సంబంధించిన పత్రాలను అందజేశాడు. రూ.1,060లు ప్రభుత్వ చలానా చెల్లించాలని చెప్పడంతో అడిగిన మొత్తాన్ని ఇచ్చి రశీదు పొందారు. నాగభూషణం డ్రైవింగ్‌ లైసెన్స్‌ రెన్యువల్‌ 2012 జూలై 12తో ముగిసింది. రెన్యువల్‌ చేయించుకోవాల్సిన సమయం నాలుగేళ్లు దాటడంతో ప్రభుత్వ చలానా రూ.560తో పాటు మొదటి ఏడాది రూ.100 ఆ తరువాత ఏడాది నుంచి రూ.50లు లెక్కన కట్టించుకుని ఐదేళ్లు గడువు ముగిసేంత వరకు రెన్యువల్‌ చేసే అవకాశం ఉంది. ఈ లెక్కన మొత్తం కలిపి రూ.810లు చలానా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అయితే అతని వద్ద నుంచి రూ.1060లు కట్టించుకోవడం  గమనార్హం. కార్యాలయంలో ప్రింటర్లు మరమ్మతులుకు గురవడంతో కార్యాలయంలో పనిచేస్తున్న ఆయా సెక‌్షన్ల ఉద్యోగులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసుం రూ.810లు మాత్రం కంప్యూటర్‌లో పొందుబరిచారు. చలనా కంటే మిగిలిన మొత్తం రూ.250ను కలిపి రూ.1060లు చేతితో రాసి వాహన చోదకులకు అందజేస్తున్నారు. ఈ రీతిలో ఒక్కో ఉద్యోగి సుమారు రోజుకు రూ.6 వేల నుంచి రూ.10వేల సంపాదిస్తున్నారని ఆశాఖ ఉద్యోగులే తెలియజేయడం విశేషం. 
    పెరిగిన అవినీతి
    పెద్దనోట్లు రద్దుతో రవాణాశాఖ కార్యాలయంలో అవినీతికి భారీగా పెరిగిపోయింది. ప్రభుత్వ చలనాల కోసం స్వైపింగ్‌ మిషన్‌ ఏర్పాటు చేసినా లంచం ఇవ్వకపోతే పని చేయడం లేదని పలువురు వాపోతున్నారు. ప్రభుత్వ చలనాలు చెల్లించేందుకు అధికారులు నగదునే డిమాండ్‌ చేస్తున్నారు. స్వైపింగ్‌ మిషన్‌ విషయంపై ఎవరైనా ప్రశిస్తే పని చేయకుండా పలుమార్లు కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు. ఽఒక పక్క పెద్దనోట్లు రద్దుతో బ్యాంకుల నుంచి డబ్బులు అందక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రవాణాశాఖ ఉద్యోగులుకు మాత్రం అవేమీ పట్టడం లేదు. తాము ఆడిగినంత ఇచ్చుకుని పత్రాలు తీసుకెళ్లాలని, లేకుంటే ఎంతకాలమైన మీ పత్రాలు కార్యాలయంలోనే ఉంటాయని చెబుతున్నారు. రవాణాశాఖ కార్యాలయంలో లంచం డిమాండ్‌తో పనుల మీద కార్యాలయానికి వెళ్లాలంటే వాహనదారులు హడలిపోతున్నారు. రవాణాశాఖలో జరుగుతున్న అవినీతిపై ఏసీబీ, విజిలెన్స్‌ అధికారులు చేత విచారణ చేయించి అధిక దోపిడీని అరికట్టాలని వాహనదారులు, వాహన చోదకులు కోరుతున్నారు.
     
    చర్యలు తీసుకుంటాం    -ఎన్‌.శివరాంప్రసాద్, రవాణాశాఖ ఉప కమిషనర్‌
    ప్రభుత్వ చలానా కంటే అధికంగా వసూలు చేయకూడదు. ఆ విధంగా వసూలు చేసిన విషంయపై పరిశీలించి చర్యలు తీసుకుంటాం. ఈ విషయంపై నాకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు.
     
     
మరిన్ని వార్తలు