అధికార పార్టీ నేతల అరాచకం

6 Jun, 2016 02:26 IST|Sakshi
అధికార పార్టీ నేతల అరాచకం

- రైతు భరోసా యాత్రలో అలజడి సృష్టించేందుకు యత్నం
- అనంతపురంలో వైఎస్సార్‌సీపీ అభిమానిపై కత్తితో దాడి

 అనంతపురం: అనంతపురం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతులు, చేనేత కార్మికుల కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్రలో యాత్రలో అలజడి సృష్టించేందుకు అధికార టీడీపీ నేతలు శతవిధాలా ప్రయత్నించారు. అయితే, ప్రజలే జగన్‌కు రక్షణగా నిలవడంతో టీడీపీ నేతల కుయుక్తులు సాగలేదు. తాడిపత్రిలో ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి రైతు భరోసా యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తాను తెర వెనుక ఉండి రాయలచెరువు, పెద్దపప్పూరులో గ్రామస్థాయి కార్యకర్తలతో ఆందోళనలు చేయించారు.

యాడికిలో జగన్ కాన్వాయ్‌కు ఎదురుగా ర్యాలీ నిర్వహించేందుకు యత్నించారు. పోలీసులు కూడా టీడీపీ నేతలకు వత్తాసు పలుకుతూ ర్యాలీని అడ్డుకోకుండా జగన్ కాన్వాయ్‌ను ఆపే ప్రయత్నం చేశారు. ఇదేమిటని ప్రశ్నిస్తే... ‘వారు పవర్‌లో ఉన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటుంది’ అని బదులిచ్చారు. కదిరిలో జగన్ యాత్రకు లభించిన జనాదరణను చూసి ఓర్వలేక మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్.. జగన్ కాన్వాయ్‌పై రాళ్లు, మట్టితో నింపిన వాటర్ బాటిళ్లతో దాడి చేయించారు. ఈ ఘటనలో జగన్ ప్రచార రథం అద్దాలు ధ్వంసమయ్యాయి. జగన్ భద్రతా సిబ్బంది ఇస్మాయిల్‌కు ముక్కుపై గాయమైంది.

 ‘అనంత’లో వైఎస్సార్‌సీపీ అభిమానికి కత్తిపోట్లు
 అనంతపురం పట్టణంలో ఆదివారం వైఎస్సార్‌సీపీ నిర్వహించిన ‘ప్రజాస్వామ్య పరిరక్షణ సభ’లో అరాచకం సృష్టించాలని టీడీపీ నాయకులు కుట్రపన్నారు. శాంతియుతంగా బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న వైఎస్సార్‌సీపీ అభిమానులపై దాడికి తెగబడ్డారు. ముందస్తు ప్రణాళికతో మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కాపు కాచి దాడికి తెగించారు. అనంతపురం రూరల్  మండలంకట్టకిందపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ అభిమాని చంద్రమోహన్‌రెడ్డిపై కత్తితో దాడి  చేశారు. బాధితుడికి పొట్ట భాగంలో తీవ్ర గాయమై రక్తస్రావమైంది. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు చంద్రమోహన్‌రెడ్డిని ఆస్పత్రికి తరలించారు. ఐదుకుట్లు పడ్డాయని బాధితుడి బంధువులు తెలిపారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు అనంతపురం నగరంలో భయోత్పాతం సృష్టించారు. అధికార పార్టీ నాయకుల అరాచకాన్ని నిలదీసేందుకు ప్రయత్నించిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై పోలీసులు విరుచుకుపడ్డారు. దొరికినవారిని దొరికినట్లు చావబాదారు. టీడీపీ నాయకులు, పోలీసుల తీరుపై జిల్లావ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి

>
మరిన్ని వార్తలు