అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు?

18 Apr, 2017 23:57 IST|Sakshi

 జరిమానాతో లారీలను వదిలిపెట్టిన విజిలెన్స్‌ అధికారులు

ప్యాపిలి: అధికారాన్ని అడ్డుపెట్టుకుని అధికార పార్టీ నేతలు అడ్డదారిలో అక్రమార్జనకు తెరతీశారు. అయితే అధికారులు తరచూ దాడులు నిర్వహించి అక్రమాలను అడ్డుకట్ట వేసేందుకు యత్నించినా చివరకు అధికారపార్టీ నేతలదే పైచేయి అవుతోంది. మండల కేంద్రం ప్యాపిలి వద్ద ఇటీవల విజిలెన్స్‌ అధికారులు అక్రమంగా గ్రానైట్‌ను  తరలిస్తున్న రెండు లారీలను స్వాధీనం చేసుకుని చివరకు జరిమానాతో వాటిని వదిలేయడం చర్చనీయాంశమైంది.

కర్నూలు వైపు నుంచి అనంతపురం జిల్లా తాడిపత్రికి అక్రమంగా గ్రానైట్‌ ఖనిజాన్ని  తరలిస్తున్న  ఏపీ 02ఎక్స్‌ 6277, ఏపీ 02 టీఏ 6255 నంబర్లు గల లారీలను ఈ నెల 14న కర్నూలు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ప్యాపిలి వద్ద అదుపులోకి తీసుకున్నారు. లారీలను ప్యాపిలి పోలీస్‌స్టేషన్‌ అప్పగించిన అధికారులపై తాడిపత్రికి చెందిన అధికారపార్టీ నేతలు  తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మంగళవారం ప్యాపిలికి చేరుకున్న విజిలెన్స్‌ అధికారులు  పోలీస్‌స్టేషన్‌లో ఉన్న లారీలపై ఫెనాల్టీ వేసి వదిలేశారు. అయితే ఈ లారీలు ఎవరి పేరుతో ఉన్నాయన్న  విషయం, ఫెనాల్టి ఎంత వేశారన్న వివరాలు తెలియరాలేదు.
 

మరిన్ని వార్తలు