తెలుగు తమ్ముళ్ల ఒత్తిళ్లు.. అధికారులు సెలవు బాట

20 Apr, 2016 09:56 IST|Sakshi
తెలుగు తమ్ముళ్ల ఒత్తిళ్లు.. అధికారులు సెలవు బాట

కార్పొరేషన్లో అధికారపార్టీ నేతల బెదిరింపులు
 
ఏం నేనవరునుకున్నావ్... నేను చెప్పిన పని చేయవా... నీ అంతు చూస్తా.. అంటూ నగర పాలక సంస్థ అధికారులపై తెలుగు తమ్ముళ్లు బెదిరింపులకు దిగుతున్నారు.  నాయ కుల అక్రమాలకు సహకరించలేక, బెదిరింపులు తట్టుకోలేక టౌన్‌ప్లానిం గ్‌లోని ఇద్దరు అధికారులు దీర్ఘకాలిక సెలవుపై  వెళ్లారు.
 

 
 నెల్లూరు, సిటీ:  నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో ఇంజనీరింగ్, టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ, హెల్త్ విభాగాలు ఉన్నాయి. వీటిలో టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ విభాగాలు కార్పొరేషన్ రెవెన్యూకు ప్రధానమైనవి. ఈ విభాగాల్లో కార్పొరేషన్ ఆదాయానికి గండికొట్టి, జోబులు నింపుకోవడానికి అధికారులు, అధికార పార్టీ నేతలు దారులు వెతుకుతుంటారు. అయితే ఇటీవల కాలంలో అధికార పార్టీ నాయకుల అక్రమాలకు అంతు లేకుండా పోయింది. అందినకాడికి దోచుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. అధికారులపై ఒత్తిళ్లు తీసుకొచ్చి తాము చెప్పినట్టు నడుచుకోవాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. నాయకులు చెప్పిన పనులు చేస్తే తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. కొంత మంది అధికారులు ఒత్తిళ్లు తట్టుకోలేక ధీర్ఘకాలిక సెలవు పెట్టారు.  


 సర్వేయర్ రెండు నెలల నుంచి సెలవు
 నగర పాలక సంస్థలోని టౌన్‌ప్లానింగ్ విభాగంలో ఇద్ద రు అధికారుల్లో ఒకరు సర్వేయర్ మూర్తి. మరొకరు టీపీఓ సుధాకర్. వీరిలో మూర్తి రెండు నెలల నుంచి, టౌన్‌ప్లానింగ్ అధికారి సుధాకర్ నెల నుంచి సెలవులో ఉన్నారు. మూర్తికి నగర పాలక సంస్థ పరిధిలో కాలువల ఆక్రమణలు గుర్తించాలని గతంలో పాలకులు ఆదేశాలు జారీ చేశారు. ఈ కాలువల ఆక్రమణల్లో బడాబాబులు ఎక్కువగా ఉండడంతో సర్వే చేసే సమయంలో అధికార పార్టీ నాయకుల నుంచి ఒత్తిడి వచ్చినట్లు తెలి సింది. మా భవనాలను సర్వేలో చూపిస్తే పరిస్థితి వేరే విధంగా ఉంటుందని అధికారపార్టీ నేతలు హెచ్చరిం చినట్లు సమాచారం. దీంతో మూర్తి దీర్ఘకాలిక సెలవులో వెళ్లినట్లు టౌన్‌ప్లానింగ్ అధికారులు అంటున్నారు.


 టీపీఓ నెల నుంచి..
 టీపీఓ సుధాకర్‌కు టౌన్‌ప్లానింగ్ అధికారిగా కొన్ని నెలల క్రితం ఇన్‌చార్జి బాధ్యతలు ఇచ్చారు. ఈ క్రమంలో సుధాకర్ కొంతకాలం సజావుగా విధులు నిర్వహించారు. ఓ అధికార పార్టీ కార్పొరేటర్ తనకు ప్రతి నెలా లక్షల్లో మామూళ్లు ఇవ్వాల్సిందేనని హెచ్చరికలు జారీ చేశా రు. అదేవిధంగా భారీ అక్రమాలకు సంబంధించిన ఫైల్స్‌పై సంతకాలు పెట్టాలని బెదిరించినట్లు తెలిసింది. దీంతో ఆయన నెల రోజుల నుంచి సెలవులో ఉన్నారు. ఈ క్రమంలో అధికారులిద్దరూ బదిలీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం టౌన్‌ప్లానింగ్‌లో పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫైల్స్ కదలడం లేదని పలువురు అంటున్నారు.


 ఇంజనీరింగ్ విభాగంలోనూ..
 ఇంజనీరింగ్ విభాగంలోని ఓ ఉన్నతాధికారి ప్రస్తుతం అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గలేక సెలవు లేదా బదిలీపై వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచా రం. ఇద్దరు డీఈలు, ముగ్గురు ఏఈలు ఇప్పటికే బదిలీ ప్రయత్నాలు చేశారు. నగర పాలక సంస్థ పరిధిలో అభివృ ద్ధి పనులు జరగనున్న నేపథ్యంలో తెలుగు తమ్ముళ్ల ఒత్తిళ్లతో అధికారులు సెలవులపై వెళుతుండడంతో ఆ పనులు ఆగిపోయే ప్రమాదం ఉందని ప్రజలు విమర్శిస్తున్నారు.

మరిన్ని వార్తలు