-

ఉత్సాహంగా జాతీయ క్రీడాదినోత్సవ రన్‌

29 Aug, 2016 23:54 IST|Sakshi
జెండా ఊపి ర్యాలీ ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే లక్ష్మీదేవి, కలెక్టర్‌ లక్ష్మీనరసింహం

శ్రీకాకుళం న్యూకాలనీ: మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతిని పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళంలో సోమవారం నిర్వహించిన జాతీయ క్రీడా రన్‌ ఆద్యాంతం కోలాహలంగా సాగింది. స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, కలెక్టర్‌ లక్ష్మీనరసింహంలు అంతర్జాతీయ క్రీడాకారిణిలు శాంతి(అథ్లెటిక్స్‌), లిఖిత(బాక్సింగ్‌)తో కలిసి ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో శ్రీకాకుళం పాతబస్టాండ్‌ వద్ద ఉన్న పొట్టిశ్రీరాములు జంక్షన్‌ నుంచి కళింగారోడ్, వైఎస్సాఆర్‌ సర్కిల్, పాలకొండ రోడ్‌ మీదుగా అంబేడ్కర్‌ జంక్షన్‌వరకు ర్యాలీ సాగింది. అనంతరం పశుసంవర్ధకశాఖ కార్యాలయ ప్రాంగణంలో కలెక్టర్, డీఎస్‌డీఓ, పీఈటీలు, తదితరులు మొక్కలునాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు ఉదయం  6.30 గంటలకు పొట్టిశ్రీరాములు జంక్షన్‌ వద్ద రోడ్డుపై వివిధ క్రీడాంశాల్లో క్రీడాకారులు ప్రదర్శించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. బాక్సింగ్, తైక్వాండో, బాస్కెట్‌బాల్, హాకీ, బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు విన్యాసానాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో శాప్‌ మానటరింగ్‌ అధికారి సూర్యారావు, డీఎస్‌డీవో బి.శ్రీనివాస్‌కుమార్, డీఎస్‌ఏ  కోచ్‌లు సాయిప్రసాద్, అప్పలనాయుడు, జిల్లా ఒలింపిక్‌ సంఘ ప్రధాన కార్యదర్శి పి.సుందరరావు, ఉపాధ్యాక్షులు ఎండి కాసీంఖాన్, జి.ఇందిరాప్రసాద్, పాపయ్య మాస్టారు, జిల్లా పీఈటీ సంఘ అధ్యక్షులు ఎం.వి.రమణ, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాగా జిల్లాకు చెందిన క్రీడల మంత్రి అచ్చెన్నాయుడు స్థానికంగా ఉన్నప్పటికీ జాతీయ క్రీడోత్సవ రన్‌కు మొహం చాటేయడాన్ని పలువురు తప్పుబట్టారు.

 

మరిన్ని వార్తలు