ఆన్‌లైన్‌ నమోదు నత్తనడక...!

9 Jan, 2017 01:58 IST|Sakshi
ఆన్‌లైన్‌ నమోదు నత్తనడక...!

గ్రామీణ పింఛన్‌ లబ్ధిదారుల బ్యాంకు, ఆధార్‌ వివరాలు
ఇప్పటి వరకు 24 శాతం మాత్రమే ఆన్‌లైన్‌
ఎనిమిది మండలాల్లోనే  చురుగ్గా నమోదు
వచ్చేనెల బ్యాంకులో   డబ్బులు జమ కష్టమే


ఇందూరు : పెద్ద నోట్ల రద్దు అనంతరం నగదు నిల్వలు లేకపోవడంతో జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీపై ప్రభావం పడింది. బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో నగదు లేక పింఛన్‌ లబ్ధిదారులు, ముఖ్యంగా వృద్ధులు వికలాంగులు డబ్బులు పొందలేకపోతున్నారు. ఇకపై వచ్చే నెల నుంచి పట్టణ ప్రాంతాల్లో మాదిరిగా గ్రామీణ ప్రాంతాల్లోని పింఛన్‌ లబ్ధిదారులకు కూడా బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులను జమ చేయాలని నిర్ణయించాం. ఇందుకు అన్ని మండలాల ఎంపీడీఓలు గ్రామీణ ప్రాంతాల్లోని పింఛన్‌ లబ్ధిదారుల నుంచి బ్యాంకు ఖాతా, ఆధార్, ఫోన్‌ నెంబర్‌లు సేకరించి ఆసరా వెబ్‌సైట్‌లో ఈ నెల 7 లోగా నమోదు చేయండి. (జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా పది రోజుల క్రితం ఎంపీడీఓలకు జారీ చేసిన ఆదేశాలు.) అయితే జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు బేఖాతరయ్యాయి.

గ్రామాల నుంచి పింఛన్‌ లబ్ధిదారుల వివరాలైన బ్యాంకు ఖాతాలు, ఆధార్, ఫోన్‌ నెంబర్‌ల సేకరణ చాల మండలాల్లో జరగనేలేదు. కలెక్టర్‌ వివరాల నమోదుకు ఇచ్చిన ఈ నెల 7 గడువు ముగిసిపోయింది. ఇందుకు 10 తేదీ వరకు గడువు పొడగించగా... ప్రస్తుతం వివరాలు సేకరించిన మండలాల్లో మాత్రం ఇప్పుడిప్పుడే ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేయిస్తున్నారు. దీంతో కలెక్టర్‌ అనుకున్నట్లు వచ్చే నెల పింఛన్‌ల పంపిణీ బ్యాంకు ఖాతాల ద్వారా సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. మళ్లీ నగదు డబ్బుల కోసం పింఛన్‌ లబ్ధిదారులు ఆందోళనలు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే నవంబర్‌ నెలకు సంబంధించిన పింఛన్‌ల పంపిణీ ఇప్పటి వరకు కొనసాగుతోంది. డిసెంబర్‌కు సంబంధించిన పింఛన్‌ డబ్బులు ప్రభుత్వం నుంచి ఇదే నెలలో 18 లేదా 20 తేదీకి జిల్లాకు రానున్నాయి. బ్యాంకు ఖాతాలు, ఆధార్‌ నెంబర్ల వివరాలు పూర్తి స్థాయిలో ఆసరా పింఛన్‌ల వెబ్‌సైట్‌లో ఇంకా నమోదు కాలేదు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో అన్ని రకాల పింఛన్‌ లబ్ధిదారులు కలిపి 1,90,357 మంది ఉన్నారు. ఇప్పటి వరకు అన్ని మండలాలు కలిపి కేవలం 45,724 మంది (24శాతం) వివరాలను మాత్రమే నమోదు చేశారు. ఇంకా 1,46,633 (76శాతం) మంది వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంది. రెండు రోజుల్లో వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం కష్టమని సిబ్బంది అంటున్నారు.

ఆ ఎనిమిది మండలాలు బెటర్‌...
గ్రామాల్లోని పింఛన్‌ లబ్ధిదారుల బ్యాంకు ఖాతా, ఆధార్‌ నెంబర్, ఫోన్‌ నెంబర్‌లను ఇవ్వాలని ఇందుకు గ్రామాల్లో దండోరా, టాంటాం చేయించాలని కలెక్టర్‌ ఆదేశాలిచ్చారు. పంచాయతీ కార్యదర్శికి పింఛన్‌ లబ్ధిదారుల వివరాలు అందజేయాలని లబ్ధిదారులకు తెలియజేయాలని సూచించారు.  కలెక్టర్‌ ఈ ఆదేశాలిచ్చి పదిరోజులు అవుతున్నా కొన్ని మండలాల్లోనే పింఛన్‌ లబ్ధిదారుల వివరాలను సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయిస్తున్నారు. మిగతా మండలాల్లో నమోదు ఇంకా ప్రారంభం కాకపోగా, మరికొన్ని మండలాల్లో 5 నుంచి 10 శాతం మంది వివరాలు నమోదు కాక నత్తనడకన సాగుతోంది. ప్రస్తుతం చురుగ్గా పని చేస్తున్న మండలాలు నిజామాబాద్‌ (75 శాతం), జక్రాన్‌పల్లి (57శాతం), ఆర్మూర్‌ (25శాతం), మోర్తాడ్‌ (35శాతం), నందిపేట్‌ (30శాతం), వర్ని (35శాతం), భీమ్‌గల్‌ (28శాతం), డిచ్‌పల్లి (25శాతం) ఉన్నాయి. మిగతా మండలాలైన బాల్కొండ, సిరికొండ, వేల్పూర్, ఎడపల్లి, మాక్లూర్, బోధన్, ధర్పల్లి, కమ్మర్‌పల్లి, సిరికొండ, నవీపేట్‌ తదితర మండలాలు వివరాల నమోదులో తీవ్ర జాప్యం చేస్తున్నాయి. ఈ మండలాల్లో 5 నుంచి 10 శాతం కూడా వివరాల నమోదు దాటలేదు.

ఒత్తిడి తెస్తున్న కలెక్టర్‌...
నగదు నిల్వలు లేనందున డిసెంబర్‌ నెలకు సంబంధించిన పింఛన్‌ డబ్బులను చేతికి ఇవ్వకుండా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని కలెక్టర్‌ నిర్ణయించారు. లబ్ధిదారుల వివరాలు వేగంగా సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయించాలని ఎంపీడీఓలకు ఆదేశాలు ఇచ్చారు.
కలెక్టర్‌ ఆదేశాలతో పై ఎనిమిది మండలాల ఎంపీడీఓలు చురుగ్గా పని చేస్తున్నారు. కంప్యూటర్‌ ఆపరేటర్‌లతో రాత్రింబవళ్లు, సెలవు దినాల్లో కూడా పని చేయిస్తూ డాటా ఎంట్రీ చేయిస్తున్నారు. ఎప్పటికప్పుడు డీఆర్‌డీఏ అధికారులతో వివరాల నమోదు ఎంత వరకు వచ్చిందో కలెక్టర్‌ ఆరా తీయిస్తున్నారు. నమోదు వేగవంతం చేయాలని ఒత్తిడి తీవ్రం చేస్తున్నారు. నిర్లక్ష్యంగా ఉన్న ఎంపీడీఓలకు నోటీసులు అందే సూచనలు కనిపిస్తున్నాయి.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు