‘ఎస్‌’ ఫార్ములాతో విజయాలు సొంతం

23 Dec, 2016 22:51 IST|Sakshi
రాజరాజనరేంద్రనగర్‌ (రాజానగరం) :
విద్యార్థి దశ నుంచి ప్రతి ఒక్కరూ ’ఎస్‌’ ఫార్ములాను పాటిస్తే విజయాలను సొంతం చేసుకోగలరని అమెరికాకు చెందిన సాఫ్ట్‌వేర్‌ నిపుణుడు, విద్యావేత్త డాక్టర్‌ రఘు కొర్రపాటి అన్నారు. అమెరికాలోని దక్షిణ కరోలినా రాష్ట్రానికి ఉన్నత విద్యా కమిషనర్‌గా వ్యవహరించిన ఆయన శుక్రవారం ఆదికవి నన్నయ యూనివర్సిటీని సందర్శించి, అధ్యాపకులు, విద్యార్థులతో కొద్దిసేపు మమేకమయ్యారు. ’స్మైల్, స్మార్ట్, స్పెసిఫిక్, సింపుల్‌ అండ్‌ స్మాల్‌’ అనే ఐదు లక్షణాలను అలవర్చుకోవాలన్నారు. ముఖంపై ఎల్లప్పుడు చిరునవ్వు ఉంటే అటువంటి వారితో స్నేహం చేయాలని, మాట్లాడాలని ఇతరులు కుతూహలం చూపిస్తారన్నారు. అలాగే రాక్‌ స్మార్ట్‌ ఫార్ములా ద్వారా పరిశోధనలు జరగాలన్నారు. పని చేయడాన్ని ఉత్సాహంతో ఒక ఆటగా భావించాలన్నారు. ఆ పని చిన్నౖదైనా, పెద్దదైనా మనస్సు లగ్నం చేసి చేయడంతోపాటు, సంస్థలో సహచరులతో సంయమనంతో వ్యవహరించాలన్నారు. దీనివల్ల పని ఒత్తిడి తగ్గడంతో పాటు మంచి ఫలితాలు ఉంటాయన్నారు. ఉపకులపతి ఆచార్య ఎస్‌.టేకి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ ఆచార్య పి. సురేష్‌వర్మ, డాక్టర్‌ ఉదయ్‌భాస్కర్, డాక్టర్‌ రమేష్, పద్మవళ్లి, తదితరులు పాల్గొన్నారు. 
 
>
మరిన్ని వార్తలు