ఇతడికి హెచ్‌ఐవీ... అంటించడమే పని!

21 Oct, 2015 04:12 IST|Sakshi
ఇతడికి హెచ్‌ఐవీ... అంటించడమే పని!

♦ జల్సాలతో హెచ్‌ఐవీ కొనితెచ్చుకున్న జోసఫ్ జేమ్స్
♦ నేరాలు చేసి సంపాదించిన డబ్బుతో జల్సాలు
♦ ఒంటరి మహిళలను టార్గెట్ చేసి లోబరుచుకున్న నిందితుడు
♦ వారిని వలలో వేసుకోవడానికి విచ్చలవిడిగా డబ్బు ఎర
♦ సుమారు 300 మందిని లొంగదీసుకుని హెచ్‌ఐవీ అంటించిన రాక్షసుడు
 
 హైదరాబాద్: అతనో హెచ్‌ఐవీ పేషెంట్.. జల్సాలు చేసి హెచ్‌ఐవీని కొనితెచ్చుకున్నాడు. తన నిర్వాకం వల్ల సోకిన జబ్బును సమాజంపై బలవంతంగా రుద్దాలనుకున్నాడు. ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకున్నాడు. బస్టాపులు, సినిమా హాళ్లు, రైల్వే స్టేషన్ల వద్ద ఒంటరిగా కనిపించే మహిళలను మాయమాటలతో ఆకట్టుకునేవాడు. తెలివిగా వలలో వేసుకోవడం.. షాపింగ్‌కు తీసుకెళ్లి నచ్చిన వస్తువులు కొనిపెట్టడం.. ఆ తర్వాత లోబర్చుకోవడమే అతని లక్ష్యం. ఇందు కోసం ఎంత డబ్బయినా ఖర్చు చేసేవాడు. ఆ డబ్బు సంపాదించేందుకు ఎలాంటి నేరాలకైనా తెగబడేవాడు. నేరాలు చేసి డబ్బు సంపాదించడం, ఆ డబ్బుతో మహిళలను లోబర్చుకుని తన పైశాచికత్వాన్ని ప్రదర్శించడం ఇదే అతని నిత్యకృత్యం.

తనకు ప్రాణాంతకమైన జబ్బు ఉందని తెలిసినా.. కనీస మానవత్వం మరచి.. ఒక్కరు, ఇద్దరు కాదు.. ఏకంగా 300 మందిని లొంగదీసుకున్నాడు. ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన ఈ ఉదంతం రాష్ట్ర రాజధానిలో సంచలనం సృష్టించింది. మంగళవారం మల్కాజిగిరి ఏసీపీ రవిచందన్‌రెడ్డి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. మల్కాజిగిరి మీర్జాలగూడకు చెందిన జోసఫ్ జేమ్స్(31) టెన్త్ వరకు చదువుకున్నాడు. ఆరేళ్ల క్రితం ఒక  అమ్మాయిని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు.

మరో ఇద్దరితో సహజీవనం కొనసాగించడంతో.. భార్య కొడుకును తీసుకుని దూరంగా వెళ్లిపోయింది. అమ్మ, చెల్లి, సోదరుడితో కలసి జేమ్స్ మల్కాజిగిరిలో నివాసం ఉంటున్నాడు. అప్పటి నుంచి జేమ్స్ ఇద్దరు మహిళలతో సంబంధాలు కొనసాగిస్తూనే.. ఒంటరిగా కనిపించే మహిళలను లక్ష్యంగా చేసుకున్నాడు. కానీ మహిళలతో విచ్చలవిడి సంబంధాల కోసం వచ్చిన డబ్బంతా ఖర్చు కావడంతో అదనపు సంపాదన కోసం నేరాలకు దిగాడు.

మల్కాజిగిరి కేంద్రంగా మట్కా దందా మొదలుపెట్టాడు. ఆ దందాలో వచ్చిన డబ్బుతో జల్సా జీవితానికి అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో జేమ్స్‌కు హెచ్‌ఐవీ సోకింది. అనుమానం వచ్చి ఆరోగ్య పరీక్షలు చేయించుకోగా హెచ్‌ఐవీ పాజిటివ్ అని తేలింది. దీంతో సమాజం పట్ల కసిని పెంచుకున్న జేమ్స్ తన రాక్షసత్వాన్ని బాహాటంగా ప్రదర్శిస్తూ.. విశృంఖలంగా తయారయ్యాడు. ఒంటరి మహిళలను లోబరుచుకునేందుకు.. జల్సాల కోసం డబ్బు సంపాదించేందుకు నేర ప్రవృత్తిని ఎంచుకున్నాడు. తనకు వచ్చిన ప్రాణాంతక రోగాన్ని సమాజంలో వ్యాపింప చేయాలనే పైశాచిక నిర్ణయానికి వచ్చాడు. అమాయక మహిళలను వల పన్ని లోబరుచుకునేవాడు. ఇలా సుమారు 300 మందిని లొంగదీసుకుని తన రోగాన్ని వారికి అంటించాడు.
 
 ఇలా పట్టుబడ్డాడు...
  కొద్దిరోజుల క్రితం ఉప్పల్‌లోని తన స్నేహితుని ఇంట్లో తాళం పగులగొట్టి బీరువాలో దాచిన ఐదు తులాల బంగారు గొలుసును జేమ్స్ దొంగిలించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అనుమానం వచ్చి  జేమ్స్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా తానే దొంగిలించినట్లు అంగీకరించాడు. దొంగిలించిన డబ్బుతో మహిళలను వలలో వేసుకుంటానని, తాను చేసే పని కూడా వారికి చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు జేమ్స్‌ను మంగళవారం రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు