జులాయి..

29 Jul, 2017 23:02 IST|Sakshi
జులాయి..

అదనపు కట్నం కోసం వేధింపులు
భార్యాపిల్లలపై అంతులేని నిర్లక్ష్యం
తరచూ ఇంటి నుంచి అదృశ్యం
పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
ఫినాయిల్‌ తాగి బెదిరింపులకు దిగిన శాడిస్టు


అనైతిక వివాహేతర సంబంధం ఓ పచ్చని కాపురంలో చిచ్చురేపింది. వరుసకు అత్త అయిన వివాహితతో సంబంధం పెట్టుకుని భార్యాపిల్లలను నిర్లక్ష్యం చేశాడు. పెద్దలు పంచాయితీ నిర్వహించి, భార్యను సక్రమంగా చూసుకోవాలని హితవు పలికారు. అయితే తన వివాహేతర సంబంధం గుట్టురట్టు చేసిన ఇల్లాలిపై కక్ష కట్టిన అతను పథకం ప్రకారం అదనపుకట్నం పేరిట వేధింపులకు దిగాడు. వేధింపులు తారస్థాయికి చేరుకోవడంతో తనకు విముక్తి కల్పించాలని బాధితురాలు వేడుకుంటోంది.

గుంతకల్లు రూరల్‌: కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన సైరాబాను, లతీఫ్‌ దంపతుల కుమార్తె ముంతాజ్‌కు గుంతకల్లులోని పక్కీరప్ప కాలనీ నివాసి షర్ఫుద్దీన్‌ కుమారుడు రహిమాన్‌తో ఏడేళ్ల కిందట వివాహమైంది. కట్నకానుకల కింద రూ.1.2 లక్షలు, 8 తులాల బంగారు నగలతోపాటు ఒక మోటార్‌సైకిల్‌ను ఇచ్చారు. వీరికి ఒక కుమార్తె ఉన్నారు. వరుసకు అత్త అయిన వివాహితతో రహిమాన్‌ అనైతిక సంబంధం కొనసాగిస్తూ వచ్చేవాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య... తన భర్తకు హితవు పలికింది. అప్పటి నుంచి భార్యాకుమార్తె బాగోగులను పట్టించుకోవడం మానేశాడు. కుటుంబ పెద్దలు జోక్యం చేసుకోవడంతో అ‍త్తతో పాటు ఉడాయించాడు. రోజులు గడుస్తున్నా... భర్త తిరిగి రాకపోవడంతో ముంతాజ్‌ తన పుట్టింటికి చేరుకుంది.

ఏడాది తర్వాత..
ఏడాది తర్వాత రహిమాన్‌ తిరిగి గుంతకల్లుకు చేరుకున్నాడు. తన తండ్రి మరణానంతర 40 రోజుల కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చాడు. అప్పటికే ‘మిస్సింగ్‌’ కేసులో నిందితుడిగా ఉన్న రహిమాన్‌ను కసాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సమస్యను తామే పరిష్కరించుకుంటామని బంధువులు అతడిని స్టేషన్‌ నుంచి బయటకు తీసుకొచ్చారు. మత పెద్దలు, అంజుమన్‌ కమిటీ సభ్యుల సమక్షంలో రహిమాన్‌ తన భార్యతో కలిసి ఉండేలా అగ్రిమెంట్‌ రాయించారు.

అదనపు కట్నం వేధింపులు
అగ్రిమెంట్‌ అనంతరం భార్యతో కలిసి బెంగళూరుకు మకాం మార్చిన రహిమాన్‌ రోజూ మద్యం మత్తులో ఇంటికి చేరుకుని అదనపు కట్నం కోసం భార్యను హింసించేవాడు. డబ్బు ఇవ్వగానే తీసుకుని పది రోజులపాటు కనిపించకుండా వెళ్లిపోయేవాడు. కూతురుని అల్లుడు పెట్టే చిత్రహింసలు చూడలేక అడిగిన ప్రతిసారీ అత్తమామలు డబ్బు ముట్టజెప్పేవారు. ఈ ఏడాది రంజాన్‌ పండుగ కోసమని భార్య, కూతురుతో రహిమాన్‌ గుంతకల్లుకు వచ్చాడు. రెండు రోజులకే ఇంటి నుంచి వెళ్లిపోయాడు.

పోలీసులను ఆశ్రయించిన భార్య
తన భర్త ప్రవర్తనతో ముంతాజ్‌ విసిగిపోయింది. తనకు, తన కుమార్తెకు న్యాయం చేయాలంటూ మూడు రోజుల కిందట కసాపురం పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కౌన్సెలింగ్‌తో భార్య, కూతురుతో కలిసి ఉండేందుకు అంగీకరించిన రహిమాన్‌ గురువారం రోజు రాత్రి ఫినాయిల్‌ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో అతడు కావాలనే బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నాడని బాధితురాలు తన తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు మొర పెట్టుకుంది.

మరిన్ని వార్తలు