తగ్గిన సాగర్‌ ఇన్‌ఫ్లో

5 Oct, 2016 22:38 IST|Sakshi
తగ్గిన సాగర్‌ ఇన్‌ఫ్లో
నాగార్జునసాగర్‌ :  సాగర్‌ జలాశయం నీటి మట్టం 532.80(173.664టీఎంసీలు) అడుగులకు చేరింది. ‡జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు(312.0450టీఎంసీలు). ఇన్‌ఫ్లో తగ్గడంతో నీటిమట్టం నిలకడగా ఉంది. శ్రీశైలం జలాశయం ఎడమ విద్యుదుత్‌ ఉత్పాదన కేంద్రం ద్వారా గడిచిన 24 గంటల్లో 5,094 క్యూసెక్కులు విడుదల చేశారు.  శ్రీశైలం ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 885.00 అడుగులు(214 టీఎంసీలు). కాగా ప్రస్తుతం 882.80 (203.4270టీఎంసీలు) అడుగులున్నది. ఎగువనుంచి 48,000 క్యూసెక్కుల నీరు జలాశయంలో చేరుతుంది. కొంతనీటిని పోతిరెడ్డి పాడు ద్వారా విడుదల చేస్తున్నారు. 
  రైతులకు అందుబాటులో...
 సాగర్‌ ఆయకట్టు రైతులకు 245 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. రబీలో ఆరుతడి పంటలు సాగు చేసేందుకు సరిపోతుందని అధికారులు అంచనావేస్తున్నారు. శ్రీశైలంలో 203 టీఎంసీలు ఉండగా నాగార్జునసాగర్‌ జలాశయంలో 510 అడుగులు కనీస నీటిమట్టం పైన 42టీఎంసీలు అందుబాటులో ఉంటాయి. దిగువన గల నీటిని రెండు రాష్ట్రాల్లో గల పలు జిల్లాలకు తాగు నీటి అవసరాలకు మాత్రమే వాడుకునేందుకు వీలుంటుంది. వాస్తవంగా సాగర్‌ ఆయకట్టుకు రెండు రాష్ట్రాల్లోని కుడి, ఎడమ కాల్వలకు వరి పంటకు గాను ఒక పంటకు  132 టీఎంసీల చొప్పున 264 టీఎంసీల నీరు కావాలి. అదే విధంగా ఆవిరి నష్టం మరో 17 టీఎంసీలు అవసరమవుతాయి.  ఈనీటితో కుడికాల్వ కింద 11,74,874 ఎకరాలు, ఎడమ కాల్వ కింద 10,37,796 ఎకరాలు మొత్తం  22,12,670 ఎకరాలకు నీరందుతుంది. ఈ పంటల ద్వారా రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.10 వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంది. గత రెండేళ్లుగా సాగర్‌ జలాశయం నిండకపోవడంతో ఆయకట్టు  రైతులు ఆర్థికంగా చితికిపోయారు. ఈ సీజన్‌లోనైనా ప్రభుత్వం నీటిని విడుదల చేస్తే పంటలను సాగు చేయనున్నారు. 
నిండుకుండల్లా ఎగువన జలాశయాలు
 కృష్ణానది పైన గల జలాశయాలు సాగర్‌ మినహా మిగతావన్నీ నిండుకుండలా ఉన్నాయి. ఆల్మట్టి నుంచి నారాయణపూర్, జూరాల, శ్రీశైలం వరకు పూర్తిస్థాయి నీటి మట్టంతో కళకళలాడుతున్నాయి.  ఇకపై ఎగువ నుంచి అదనంగా వచ్చే ప్రతి నీటి బొట్టు సాగర్‌ జలాశయానికే వచ్చే అవకాశాలున్నాయి. 
 
మరిన్ని వార్తలు