పెరుగుతున్న సాగర్‌ నీటిమట్టం

27 Sep, 2016 22:11 IST|Sakshi

మాచర్ల/ విజయపురి సౌత్‌: కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసి వరద నీరు వస్తుండడంతో సాగర్‌ రిజర్వాయర్‌ నీటిమట్టం రోజు రోజుకూ పెరుగుతోంది. నాలుగు రోజుల్లో సుమారు 8 అడుగులు పెరిగింది. ఇప్పటికే శ్రీశైలం రిజర్వాయర్‌ నిండుకుండలా ఉండడంతో ఆల్మట్టి నుంచి గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌కు జూరాల నుంచి 1,37,576 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వచ్చి చేరుతుంది. శ్రీశైలం ప్రస్తుతం నీటి మట్టం 881.60 అడుగులకు చేరుకుంది. ఈ రిజర్వాయర్‌ గరిష్ట నీటి మట్టం (885 అడుగులు. శ్రీశైలానికి ఇన్‌ఫ్లో పెరిగే అవకాశం ఉండడంతో రేపో మాపో శ్రీశైలం రిజర్వాయర్‌ గేట్లు ఎత్తే అవకాశాలున్నాయి. ప్రస్తుతం నాగార్జున సాగర్‌ 73,589 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తుంది. ఈ నెల 23న 514.40 అడుగుల వద్ద ఉన్న సాగర్‌ రిజర్వాయర్‌ మంగళవారం సాయంత్రానికి 522.10 అడుగులకు చేరుకుంది. ఇది 153 టీఎంసీలకు సమానం. ఔట్‌ఫ్లోగా నల్గొండ జిల్లాకు చెందిన ఎస్‌ఎస్‌బీసీ కాలువకు 900 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వచ్చే ఇన్‌ఫ్లో అంతా రిజర్వాయర్‌లో నిల్వ అవుతుండడంతో సాగర్‌ నీటి మట్టం రోజుకు రెండు అడుగుల మేర పెరుగుతుంది.

మరిన్ని వార్తలు