సాగర మథనం.. సాహస జీవనం

12 Dec, 2016 14:26 IST|Sakshi
సాగర మథనం.. సాహస జీవనం

కడలి ఘోష వారికి అమ్మపాడే లాలి పాట..
తీరం వారికి తల్లిఒడి.. ఆ గంగమ్మ బిడ్డలకు అలలు అనునిత్యం ఊగే ఊయలలు.
ఇతరులను భీతిల్లజేసే అపారజలరాశే వారి వేటకు ఆటపట్టు.
సముద్రమే వారికి అన్నం పెట్టే అమ్మ, బతుకు తెరువును నేర్పే గురువు, బతుకంతా కలిసి ఉండే నేస్తం, బతుకు సమస్తం.
అందరికీ దినచర్య వేకువతో మొదలైతే.. వారికి అర్ధరాత్రే ఆరంభమవుతుంది.
అందరూ గాఢనిద్రలో ఉండే సమయంలో వారు సాగరగర్భంలో వలలతో గాలింపు జరుపుతుంటారు.
అగాధ జలధిలో అలవోకగా మెలగే ఆ సాహసికుల జీవితం మాత్రం ఆటుపోట్ల మయం.
చేపల వేటలో వారు చూపే తెగువా, పడే శ్రమా నిస్సందేహంగా ప్రాణాలను పణంగా పెట్టి చేసే ఓ సాహసకృత్యమే.
ఇల్లు విడిచి, కడలిలోకి వెళ్లే వారు.. తిరిగొచ్చే వరకూ అనుక్షణం ప్రకృతి విసిరే సవాళ్లను ఎదుర్కొంటూ ఆడే ఉత్కంఠభరిత క్రీడే. సామాన్యులుగా కనిపిస్తూ అసామాన్యమైన ధైర్యస్థైర్యాలను కలిగి ఉండే మత్స్యకారుల జీవనచిత్రాన్ని కళ్లకు కట్టించేదే నేటి ‘సాక్షి’ ఫోకస్‌..
            

మత్స్యకారులు...అంటే చేపల వేటతో జీవనం సాగించే వారన్నది అందరికీ తెలిసిందే. అయితే వారి బతుకు లోతుల్లోకి తొంగిచూస్తే అనేక విశేషాలు, విలక్షణతలు కనిపిస్తాయి. వీరి జీవన వలయం తెడ్డు తెర చాపతో ప్రారంభమై ఫైబర్‌బోటు, డీజిల్‌ ఇంజ¯ŒS వరకు చేరుకున్నా వారి జీవితాలకు మాత్రం భరోసా దక్కలేదు. సాధారణంగా మత్స్యకారుల పిల్లలు నడక ప్రారంభించిన నాటి నుంచే కడలి వైపు అడుగులు వేస్తారు. చిన్న నీటి గుంటను చూస్తేనే మనం హడలెత్తిపోతాం. కానీ మత్స్యకార బాలలు మాత్రం చిన్ననాటి నుంచీ పెద్ద కెరటాల్లో కేరింతలు కొడుతుంటారు. ఎగిసిపడే కెరటాలను అవలీలగా దాటి సాగరాన్ని సునాయాసంగా ఈదుతారు. చిన్న చెక్క ముక్కే ఆధారంగా ఈదుతూ సుదూరాలకు సాగుతారు. చూసేవారికి భయమేసినా వారికి మాత్రం అదే జీవితం.

తెడ్డు తెరచాపతో మొదలై..
గతంలో కేవలం చెక్కతో తయారు చేసిన తెడ్డు, నాటు పడవలు మాత్రమే ఉపయోగించేవారు. చేతితో ఇరగాలా, వగ్గం అనబడే పరికరంతో నూలును పేని వలలు తయారు చేసేవారు. దారంతో తయారు చేసిన వలలు నీటిలో తడిసి చిరిగిపోకుండా ఉండేందుకు చెట్టు బెరడులను మరగబెట్టి ఆ రసంలో నానబెట్టి అనంతరం వలలను ఉపయోగించేవారు. కండబలం, గుండెధైర్యమే పెట్టుబడిగా వేటసాగించి వచ్చిన రాబడితో తృప్తి చెంది జీవించేవారు. తెడ్డు తెరచాపతో సాగరంపై వేట సాగిస్తూ వారు పాడే కూనిరాగాలు వినసొంపుగా ఉండేవి.  

కుటుంబమంతా ఒకటై..
జిల్లాలోని 13 మండలాల్లో విస్తరించిన సముద్రతీరంలో 99 మత్స్యకార గ్రామాలున్నాయి. వాటిలో 3.89 లక్షల మంది మత్స్యకారులుండగా 1.8 లక్షల మందికి కడలిపై వేటే వృత్తి.  మహిళలు భర్తలు వేటాడి తెచ్చిన చేపలను బజారులో అమ్మి సొమ్ము చేసి వచ్చిన దాంతో వండి వార్చుకుని జీవనం సాగించేవారు. గృహంలో మహిళలు వంటా వార్పులో నిమగ్నమయితే మగవారు మరునాడు వేట కోసం చిరిగిన వలలను బాగు చేసుకుంటూ కనిపిస్తారు. ఉన్న గుడిసెలోనే ఇంటిల్లిపాది కలిసి జీవించడం ఉమ్మడి కుటుంబానికి తార్కాణంగా నిలుస్తుంది.

అవరోహణ క్రమంలో వేలం..
తీరంలో వ్యాపారాలు విచిత్రంగా ఉంటాయి. వేటాడి తెచ్చిన చేపలకు వేలం పాట నిర్వహిస్తుంటారు. ఈ వేలంపాట అవరోహణ క్రమంలో ఉంటుంది. ముందు ఎక్కువగా పాట పెట్టి అది తగ్గించుకుంటూ వచ్చి చివరకు పాట ఖరారు చేస్తారు. పిల్లలకు పెద్దలు వేటాడి తెచ్చిన చేపలు ఇస్తే ఆ చేపలతో తీరంలో అమ్మే తాటి టెంకలు, దుంపలు, వేరుశెనగలు, ఐస్‌ల వంటి తినుబండారాలు కొని తింటుంటారు. 

జట్టీ కడితే కొండంత బరువైనా కాకి ఈకే..
మత్స్యకారులు బరువులు మోసే విధానాన్ని జట్టీ కట్టడం అంటారు.  మోయాల్సిన బరువుకు కర్రకట్టి, ఆ కర్రకు అటూఇటూ మత్స్యకారులు ఉండి మోసే విధానాన్ని జట్టీ కట్టడం అంటారు. ఇది చూసేందుకు ఆశ్చర్యంగా ఉన్నా పెను బరువులు మోయడానికి ఈ విధానం మాత్రం ఎంతో సులువైనది. పది మంది మోయలేని బరువును ఇద్దరు జటీ కట్టే విదానంలో మోయగలరంటేనే ఈ విధానంలోని ప్రత్యేకత అర్థమవుతుంది.  

అమ్మవార్ల పేర్లూ చిత్రమే
సాధారణంగా మత్స్యకారులు పూజించే అమ్మవార్ల పేర్లు భాగిర్తమ్మ, బంగారమ్మ, గంగమ్మ, కాశిమ్మ, పోలేరమ్మ, చినతల్లి, పెదతల్లి వంటివే అయి ఉంటాయి. ఇవే పేర్లు మత్స్యకారులు తమ పిల్లలకు పెడుతుంటారు. సాధారణంగా గ్రామ దేవతల ఆలయాలలో ఎక్కువ శాతం వారానికి ఒకసారైనా సాధారణ పూజలు చేస్తుంటారు. కానీ ఈ కోవెలల్లో దేవతలకు మాత్రం ఏడాదికి ఒకసారి అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. నియమనిష్టలతో ఉపవాసాలుండి, పూజలు నిర్వహించి అగ్నిగుండాలు తొక్కడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. 

వేటకు వేళాయెరా..!
అర్ధరాత్రి 12 గంటలు దాటే వేళ.. లోకమంతా గాఢనిద్రలో మునిగి ఉండే వేళ..  తీర ప్రాంతంలోని ఆ గ్రామాలు మేలుకుం టాయి. వాన కురుస్తున్నా, చలి కరుస్తున్నా  చిన్న దుప్పటి కప్పుకొని ఒక వ్యక్తి ‘ఒరే ఎల్లయ్యా! యోసేబూ! నూకప్పా!’ అం టూ ఒక్కో ఇంటి దగ్గరా కేకలు వేస్తూ, ఒక్కొక్కరినీ లేపి వేటకు వేళాయెరా అంటు చెప్పుకుంటూ వెళ్లిపోతాడు. అతని కేక విన్నవారు అంతా నిద్ర లేచి తమ జీవనోపాధికే పయనమవుతారు. చద్దన్నం ముంతలు సర్దుకుని లాంతరు, ఇతర వేట సామగ్రితో తీరానికి బయలుదేరుతారు. తెప్పల వద్దకు వెళ్లి దగ్గరలో భద్రపర్చిన ఇంజన్లు మోసుకొచ్చి అమర్చి వలలు, వేట సామగ్రిని తెప్పలో సిద్ధం చేస్తారు. ఒడ్డున ఉన్న ఒక్కొక్క తెప్పను జట్టీ కట్టి మోసుకొచ్చి కెరటాల మధ్య వేటకు వెళ్లేందుకు సిద్ధం చేస్తారు. ఇంజనులో ఆయిల్‌ పోసి, స్టార్ట్‌ చేశాక, వేటకు వెళ్లేందుకు అంతా సిద్ధమని అనుకున్న తర్వాత ఎవరి తెప్పపై వారు ఎక్కి కడలిలోకి కదిలిపోతారు. సుమారు ఒంటిగంటన్నర ప్రాం తంలో ప్రారంభమైన పయనం తెల్లవార్లూ కొనసాగుతుంది.
 
తల్లుల హృదయాల్లా.. తలుపులు లేని కోవెలలు
ఆ ఆలయాలలో నిత్యధూపదీపనైవేద్యాలు, పూజలు ఉండవు. కానీ అమ్మవారి ప్రతిమలు ఉంటాయి. కొలిచే భక్తులూ కోకొల్లలే. వైవిధ్యభరితంగా కనిపించే ఆ కోవెలలే మత్స్యకారులు కొలిచే దేవతల ఆలయాలు. ఈ గుడులు చిన్నచిన్న ఆలయాలుగా ఉండి ఒకే చోట రెండు నుంచి ఐదేసి వరుసగా నిర్మించి ఉంటాయి. ఆలయాలపై ఎటువంటి కళాకృతులు ఉండవు.ముఖమండపాలు అసలే కనిపించవు.  వాటిలో దేవతామూర్తుల ప్రతిరూపాలు విలక్షణంగా ఉంటాయి. కొన్ని విగ్రహాలు అమ్మవారి రూపాలతో ఉండగా కొన్ని విచిత్ర రూపాలలో ఉండి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. వివిధ ఆకృతులలో ఉన్న చెక్కతో తయారు చేసిన విగ్రహాలు కనిపిస్తాయి. ఏ ఆలయానికైనా ద్వారబంధాలు తప్ప తలుపులు కానరావు. సాగరంలో జీవనపోరాటం చేస్తున్న తమకు ఎప్పుడు ఎదురుగా కనిపించే విధంగా  ప్రతి ఆలయం సముద్రతీరానికి అతి దగ్గరలో సముద్రం వైపు ముఖం ఉండేలా (సముద్రం లోంచి చూస్తే అమ్మవారు కనిపించేలా) నిర్మించి ఉంటాయి. అమ్మవారు ఎప్పుడూ తమకు తోడునీడగా ఉండాలని, ఆలయాలకు తలుపులు బిగిస్తే ఆమెను బంధించినట్టవుతుందన్న భావనతోనే తమ పూర్వీకులు ఈ విధంగా ఆలయాలకు తలుపులు వేసేవారు కాదని మత్స్యకార పెద్దలు చెబుతున్నారు. అర్ధరాత్రి వేటకు వెళ్లే మత్స్యకారులు వలలు, ఇతర సామగ్రితో చేతులు ఖాళీ లేకుండా వెళుతుండడం వల్ల తలుపులు తీయడం వీలు కుదరదు కాబట్టి అమ్మవార్లకు మొక్కుకునే విధంగా ఎప్పుడూ అమ్మవార్లు ఎదురుగా కనిపించాలనే ఉద్దేశంతోనే తలుపులు ఏర్పాటు చేయరని, ఇది పూర్వం నుంచి వస్తున్న ఆచారమని చెబుతున్నారు. 
 
కటిక చీకటిలోనే వేట
చుట్టూ కటిక చీకటి. తెప్పలో ఉన్న వారికి  మిగతా ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. కొన్ని గంటల ప్రయాణం తరువాత మత్స్యకారులు వెంట తెచ్చిన వలను వేయనారంభిస్తారు. తమ వలను మరో తెప్ప ధ్వంసం చేయకుండా ఉండేందుకు ఆనవాలుగా నీటిపై తేలిఆడే విధంగా తయారు చేసిన కిరోసిన్‌ లాంతరును వల వేసిన చోట వదులుతారు (ప్రస్తుతం బ్యాటరీలతో తయారు చేసిన ఎల్‌ఈడీ బల్బులు వాడుతున్నారు) వల వేశాక సహచరులందరూ నిష్క్రమించగా ఒక్క మత్స్యకారుడు మాత్రం తెప్పకు లంగరు వేసి వలను పరి శీలిస్తూ కాపలా కాస్తుంటాడు.  తెలవారనుండగా తిరిగి వలను పైకి లాగి పడిన చేపలను భద్రపరుచుకుంటారు. సూర్యోదయమవుతుండగా వలలు సర్దుకుని తీరానికి తిరుగుము ఖం పడతారు. వేటాడి తెచ్చిన చేపలను విక్రయించి వలలు, తెప్పలు, ఇంజన్లను సురక్షిత ప్రాంతాల్లో భద్రపరుచుకొని వేటలో తెగిన వలలను అల్లుకొనే పనిలో నిమగ్నమవుతారు. 
 
కడలి సృష్టించే కన్నీటి సంద్రాలు
వేట క్రమంలో ప్రమాదాలకు గురై ఆచూకీ లేకుండా పోయిన  మత్స్యకారుల కోసం వారి కుటుంబాలు ఏళ్ల తరబడి నిరీక్షిస్తుంటాయి. 11 సంవత్సరాల క్రితం సుబ్బంపేటకు చెందిన ఏడుగురు మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళి గల్లంతయ్యారు. అప్పటి నుంచీ వారి ఆచూకీ లభించలేదు. కానీ వారి కుటుంబీకులు వారి కోసం నిరీక్షిస్తూనే ఉన్నారు. నడికడలిలో ప్రమాదాలకు గురై ఉప్పు నీరు తాగి, పచ్చి చేపలు తిని, పదిరోజులు గడిపి ప్రాణాలతో బయటపడిన వారున్నారు. కొత్తపల్లి మండలం అమీనాబాద్‌కు చెందిన ఒక మత్స్యకార కుటుంబం పారాదీప్‌ వెళ్ళి అక్కడ వేట సాగిస్తూ జీవనోపాధి పొందేది. ఆ క్రమంలో సోదే కోటియ్య, నగేష్, జగన్నాథం బోటుపై  పారాదీప్‌ నుంచి సముద్రంలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు బోటు మునిగిపోవడంతో ఒక చెక్క ముక్కను ఆధారంగా చేసుకొని పది రోజుల పాటు నడిసంద్రంలో గడిపారు. తినేందుకు తిండి లేక, తాగేందుకు నీరు లేక, ఉప్పు నీటినే తాగుతూ, చేతికి చిక్కిన పచ్చి చేపలనే తింటూ ఎవరైనా వచ్చి కాపాడకపోతారా అనే ధైర్యంతో నిరీక్షించారు. ప్రాణాలు కడలిలో కలిసే స్థితిలో అటుగా వెళ్లిన కొందరు జాలర్లు  గమనించి రక్షించారు. ఇలా మత్స్యకారుల జీవితాలలో అనేక జీవన్మరణ సంఘటనలు తరుచూ చోటు చేసుకుంటూనే ఉంటాయి. కోట్ల రూపాయల విదేశీ మారకద్రవ్యాన్ని తెచ్చిపెట్టే మత్స్యసంపదను ప్రాణాలకు తెగించి వేటాడి తెచ్చే మత్స్యకారులకు మాత్రం ప్రభుత్వపరంగా సౌకర్యాలు అందుతున్న దాఖలాలు లేవు. 
 
అప్పుడున్నన్ని చేపలు లేవు..
అర్ధరాత్రి 12 గంటల దాటినప్పటి నుంచి మా దినచర్య ప్రారంభమయ్యేది. చీకట్లోనే భుజాన్న వలవేసుకుని కర్రతెప్పను తీసుకుని వేటకు బయలుదేరేవారము. రోజంతా వేటాడితే బత్తానికి తులమో ఫలమో దొరికేది. అప్పుడు అర్ధరూపాయి వచ్చినా కుటుంబం అంతా కలిసి బువ్వతినేవాళ్లము. ఇప్పుడు వంద వచ్చినా ఇద్దరికీ చాలడంలేదు. ఆ నాడు రొయ్యలు పడినా ఒక్కరూ కొనేవారు కాదు. నేడు వాటినే బంగారం కంటే ఎక్కువగా కొంటున్నారు. ఇసుకలో నడిస్తే తుపా¯ŒS వస్తుందోలేదో తెలిసిపోయేది. ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఉన్నా వేటాడేందుకు చేపలు లేవు. అప్పట్లో ఒకే రకం వల ఉండేది. దానితోనే వేట సాగించేవారు. పెద్ద చేపలు ఒడ్డులోనే కనిపించేవి. 
 
– కంబాల తాతబ్బాయి
 
వేటకు వెళితేనే రోజు గడిచేది..
మాది కొత్తపల్లి మండలం అమినాబాద్‌. సుమారు 75 ఏళ్లుగా చేపల వేట సాగించి బువ్వతింటున్నా.  గతంలో చిన్నపాటి చెక్కతో చేసిన పడవలపై తెరచాపనే ఆధారంగా చేసుకుని వేటకు వెళ్లేవారము. అప్పట్లో తీరంలో ఎటువంటి సౌకర్యాలు లేక భయంకరంగా వచ్చే అలలను దాటడమే మాకు ప్రాణం పోయేంత పనిగా ఉండేది. ఎలాగోలా కడలిలో అడుగు పెట్టి  ఓపిక ఉన్నంత మేర వేట సాగించి తిరిగి ఇంటికి చేరితే ఆరణాలో, అర్ధరూపాయో సంపాదించగలిగేవారము. అప్పట్లో మేమే దారాన్ని పేని వలలు తయారు చేసేవారము. సోడి అంబలి, జావ తినేవాళ్లము. రాత్రనక, పగలనక వేట సాగించినా కొనే నాథుడు ఉండేవాడు కాదు. ఇప్పటిలా ఏ విధమైన సౌకర్యాలు లేకపోయినా కెరటాల ఉధృతి, గాలివాటాన్ని బట్టి సముద్రంలో పరిస్థితిని అంచనా వేసి వేట సాగించేవారము. ఏ రోజు వేట దొరికేతే ఆ రోజే 
గడిచేది. – రాచపల్లి భూలోకం 
 
స్టోరీ: సాక్షి ప్రతినిథి, పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లా.
 

మరిన్ని వార్తలు