అతిథులొచ్చాయ్‌!

30 Aug, 2017 00:47 IST|Sakshi
అతిథులొచ్చాయ్‌!
చోడవరంలో విదేశీ విహంగాల సందడి
 దశాబ్దాలుగా క్రమం తప్పకుండా రాక
 సైబీరియా పక్షులను సంరక్షిస్తున్న గ్రామస్తులు
 
జిల్లాలో పురుడు పోసుకుంటాయ్‌.. రెక్కలు వచ్చాక ఎగిరిపోయి ఎక్కడెక్కడో పెరుగుతాయి.. సంతానోత్పత్తి కోసం మళ్లీ పుట్టింటికి వస్తాయి.. నాలుగైదు నెలల పాటు సందడి చేస్తాయి.. ఆ తర్వాత పిల్లలతో కలిసి రెక్కలు కట్టుకుని మళ్లీ ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతాయి. కొన్నేళ్లుగా సైబీరియా పక్షులు జిల్లాకు క్రమం తప్పక వస్తూ మనకు అతిథిలుగా మారాయి. ఈ ఏడాది కూడా నల్లజర్ల మండలం చోడవరంకు అతిథిలొచ్చి సందడి చేస్తున్నాయి. 
 
నల్లజర్ల : నల్లజర్ల మండలం చోడవరం గ్రామానికి ఏటా మాదిరిగానే సైబీరియా పక్షులు వచ్చాయి. దీంతో ఆ గ్రామంలో సందడి మొదలైంది. గ్రామస్తులు ఈ పక్షులను ఎంతో అపురూపంగా చూసుకుంటారు. పక్షులు గ్రామానికి వస్తున్నాయంటే వర్షాలు ప్రారంభం కాబోతున్నాయన్న సంకేతంగా ఇక్కడి వారు భావిస్తారు. జూలై చివరలో వచ్చిన ఈ పెలికాన్‌ పక్షులు చెట్లపై గూళ్లు కట్టుకొని గుడ్లు పెట్టి పొదిగి పిల్లలు పెద్దయ్యాక వాటితో కలిసి నవంబర్‌లో తిరుగు ప్రయాణమవుతాయి. ఈ క్రమంలో గ్రామంలో పక్షుల కిలకిలరావాలు  గ్రామస్తులకు ఎంతో ఆనందాన్నిస్తాయి. జంటలుగా సంచరించడం, పక్షి పిల్లలకు ఆహారం తినిపించడం, నీరు తాగించడం, వాటికి ఎగరడం నేర్పించడం వంటి కనువిందైన సన్నివేశాలు గ్రామస్తులకు మానసికోల్లాసం కలిగిస్తుంటాయి. ఇది ఏన్నో ఏళ్లుగా జరుగుతుందని గ్రామస్తులు చెబుతున్నారు. వాటి రాక వల్ల తమ గ్రామం సుభిక్షంగా ఉంటుందని, పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని గ్రామస్తులు విశ్వసిస్తుంటారు. వీటిని ప్రత్యేక అతిథులుగా భావించిన గ్రామస్తులు సంరక్షణకు చొరవ చూపడంతో ప్రాణ హాని, భయం లేకుండా ఆహార అన్వేషణకు పరిసరాల్లో స్వేచ్ఛగా సంచరిస్తూ మరింత అలరిస్తున్నాయి.
 
పక్షులకు పుట్టిల్లు
విదేశీ పక్షులకు చోడవరం పుట్టిల్లుగా మారింది. మూడు దశాబ్దాలుగా ఇక్కడకు ఏటా క్రమం తప్పకుండా పక్షులు వస్తున్నాయి. చెట్లపై గూళ్లు కట్టుకున్న తర్వాత ఆడ, మగ పక్షులు ఒకదానితో ఒకటి తొక్కిళ్లు పడతాయి. ఇలా సంపర్కం తర్వాత 1012 రోజులకు ఆడపక్షి రోజుకొకటి చొప్పున రెండు నుంచి నాలుగు గుడ్లు పెడుతుంది. ఆ తర్వాత గుడ్లపై కూర్చుని పొదుగుతుంది. ఆ కాలంలో మగపక్షి పొలాల్లోకి వెళ్లి నత్తలు, చిన్న చిన్న చేపలు, కీటకాలను తెచ్చి ఆడపక్షి నోట్లో జారవిడుస్తుంది. 21 రోజులకు గుడ్లు పగిలి పిల్లలు బయటకు వస్తాయి. ఆ తర్వాత ఆడ, మగ పక్షులు ఆహారాన్ని వేటాడి తెచ్చి పిల్లలకు పెడుతుంటాయి. చోడవరంలో నత్తగుల్లలు ఎక్కువగా ఉండటంతో వాటి ఆహారానికి కొదవ ఉండదు. ఏటా క్రమం తప్పకుండా రావడానికి ఇది కూడా ప్రధాన కారణం.
గ్రామస్తుల సంరక్షణ
విదేశీ పక్షులు గ్రామంలోకి రాగానే వీటి సంరక్షణ బాధ్యతలను గ్రామస్తులే చేపడతారు. గతంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా పనిచేసిన అల్లూరి కృష్ణారావు స్వగ్రామం చోడవరం. ఎవరైనా పక్షులను వేటాడరని తెలిస్తే ఆయన పిలిచి కొరడాలతో కొట్టేవారని గ్రామస్తులు చెబుతారు. ఆనాటి నుంచే ఎవరైనా పక్షులను వేటాడినా గ్రామస్తులు జరిమానా విధిస్తారు. దీంతో వేటగాళ్లెవరూ ఈ పరిసర ప్రాంతాలకు రారు. వన్యప్రాణి విభాగం వారు కూడా పక్షుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. గ్రామంలో స్వాగత ద్వారం ఏర్పాటు చేశారు. పక్షుల ప్రేమికులు ఈ సైబీరియా పక్షులను తిలకించేందుకు గ్రామానికి వస్తారు. 
 
పక్షులొస్తేనే వానలొస్తాయి
చిన్నతనం నుంచి ఈ పక్షులను చూస్తున్నాం. ఇవి వస్తేనే వానలొస్తాయని, పంటలు పండుతాయని మాకు నమ్మకం. వీటి రాక ఆలస్యమైతే ఆ ఏడాది  వర్షాలు ఆలస్యమవుతూ ఉంటాయి. పక్షులకు ఎటువంటి హాని కలగకుండా గ్రామస్తులంతా చూస్తాం. 
 అయినం నాగేశ్వరావు, పడమర చోడవరం
 
పర్యాటక ప్రదేశంగా గుర్తించాలి
సైబీరియా పక్షులు మా గ్రామానికి ఏటా వస్తాయి. ఏటా ఆరేడు మాసాలు ఇక్కడ సందడి చేస్తాయి. ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా గుర్తించి అభివృద్ధి చేయాలి. కానీ ఇప్పటి వరకు అటువైపుగా ప్రభుత్వం ఆలోచించడం లేదు.  
 కొత్తపల్లి రమేష్, పడమర చోడవరం 
 
>
మరిన్ని వార్తలు