సర్కారు కక్ష సాధింపు.. సాక్షి ప్రసారాలకు బ్రేక్

10 Jun, 2016 01:52 IST|Sakshi
సర్కారు కక్ష సాధింపు.. సాక్షి ప్రసారాలకు బ్రేక్

ఏసీటీ మినహా అన్ని లోకల్ నెట్‌వర్‌‌కలలో ప్రసారాల నిలిపివేత
గ్రామీణ ప్రాంతాల్లో కూడా అదే పరిస్థితి
అభిమానుల ఆందోళన.. ఫోన్లలో ఆరా
సాక్షి కార్యాలయాలకు ఫోన్ల తాకిడి
ముద్రగడ దీక్ష నేపథ్యంలోనే  ఆపారంటూ ప్రచారం
{పభుత్వ చర్యలను తీవ్రంగా ఖండించిన జర్నలిస్టు సంఘాలు

 

విశాఖపట్నం: నిజాలు నిర్భయంగా చెబుతున్న ‘సాక్షి ’మీడియాపై ప్రభుత్వం మరోసారి అక్కసు వెళ్లగక్కింది. కాపు ఉద్యమనేత ముద్రగడ దీక్ష, అరెస్టు.. ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రభుత్వం నుంచి అందిన మౌఖిక ఆదేశాల మేరకు మాస్టర్ సిగ్నల్ ఆపరేటర్స్(ఎంఎస్‌ఒ) జిల్లాలో సాక్షి ఛానల్ ప్రసారాలను నిలిపివేశారు. విశాఖ నగరంతో పాటు గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో సైతం చాలాచోట్ల గురువారం మధ్యాహ్నం నుంచి సాక్షి ప్రసారాలు నిలిపివేశారు. నగర పరిధిలో 10కి పైగా లోకల్ చానల్స్ ఉన్నాయి. వాటిలో ఏసీటీ చానల్‌లో మినహా మిగిలిన ఎంఎస్‌ఒలందరూ తమ పరిదిలో సాక్షి చానల్ ప్రసారాలను నిలిపివేశారు. గాజువాకలో బుధవారం రాత్రి నుంచే నిలిపివేయగా.. మిగిలిన ప్రాంతాల్లో గురువారం ఉదయం నుంచి దశల వారీగా నిలిపివేశారు. సాయంత్రానికి ఏసీటీ మినహా మిగిలిన ఎంఎస్‌ఒల పరిధిలో ప్రసారాలు నిలిచిపోయాయి. భీమిలి, పెందుర్తి, అనకాపల్లితో సహా జిల్లాలోని గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో సాక్షి ప్రసారాలు నిలిపివేశారు. అరకు, పాడేరులో ఒకటి రెండమండలాల్లో మాత్రమే సాక్షి ప్రసారాలు వస్తున్నాయి.

 
ఎందుకంటే: తుని ఘటనలో అరెస్ట్ చేసిన కాపు సామాజిక వర్గీయులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గురువారం ఉదయం స్వగ్రామమైన కిర్లంపూడిలో ఆమరణ నిరాహార దీక్ష చేయడం... పోలీసులు బలవంతంగా తలుపులు బద్దలుకొట్టి ముద్రగడను అరెస్ట్ చేయడం.. గోదావరి జిల్లాల్లో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఉదయం నుంచీ సాక్షితో సహా అన్ని చానల్స్‌లోనూ కాపు ఉద్యమ సెగలపై కథనాలు వస్తున్నాయి. అయితే ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా కధనాలు ప్రసారం చేస్తున్నారంటూ సాక్షి మీడియాపై అభాండాలు వేస్తూ ప్రసారాలను నిలిపి వేసేలా ప్రభుత్వం మౌఖికంగా ఆదేశాలివ్వడం పట్ల ఆపరేటర్లు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తామేమీ ఇష్టపూర్వకంగా సాక్షి ప్రసారాలు ఆపలేదని..పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఆపాల్సి వచ్చిందని ఎంఎస్‌వోలు సైతం అంగీకరిస్తున్నారు.

 
అభిమానుల ఆందోళన

మరో పక్క సాక్షి చానల్ ప్రసారాలు నిలిపివేయడంతో జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది సాక్షి అభిమానుల తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అసలు ఏం జరిగింది? ఎందుకు సాక్షి ప్రసారాలను ఆపేశారు? ప్రభుత్వం ఎందుకీ చర్యలకు ఒడిగడుతోంది? సాక్షి మీడియాపై ఎందుకీ అక్కసు అంటూ సాక్షి టీవీ, పత్రికా ప్రతినిధులతో పాటు కార్యాలయాలకు ఫోన్లు చేసి ఆరా తీశారు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. ఇలా మీడియా గొంతు నొక్కడం సరికాదంటూ మండిపడ్డారు. మరో పక్క జర్నలిసు ్టసంఘాలు కూడా ప్రభుత్వ తీరును తప్పుబట్టాయి. దురుద్దేశంతోనే సాక్షి చానల్ ప్రసారాలను నిలిపివేసారని, తక్షణమే ప్రసారాలను పునరుద్ధరించాలని సంఘాల నేతలు డిమాండ్ చేశారు. నిష్కారణంగా ‘సాక్షి’ ఛానల్ ప్రసారాలను నిలిి వేయడం పట్ల  వైజాగ్ జర్నలిస్టు ఫోరం, ఉత్తరాంధ్ర జర్నలిస్టుల ఫోరం, ఏపీయూడబ్ల్యుజే, జాప్ తదితర జర్నలిస్టుల సంఘాల ప్రతినిధులు మండిపడ్డారు.

 

మరిన్ని వార్తలు