‘సాక్షి’ చొరవ భేష్

13 Jul, 2016 01:46 IST|Sakshi
‘సాక్షి’ చొరవ భేష్

ఈత వనాల పెంపకం పెద్ద బాధ్యత
సామాజిక సమస్యకు పరిష్కారం
16న చిట్టాపూర్‌లో జరిగే హరితహారానికి తరలిరండి
గీత కార్మికులకు మంత్రి హరీశ్‌రావు పిలుపు

గజ్వేల్: ఈత వనాల పెంపకం గీత కార్మిక సామాజిక వర్గానికి బతుకుదెరువని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖమంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. స్వచ్ఛమైన కల్లు రావాలంటే విరివిగా ఈత చెట్లను పెంచడమే పరిష్కారమన్నారు. ఈత వనాల ప్రాముఖ్యతకు గుర్తింపునిస్తూ సామాజిక బాధ్యతగా ‘హరితహారం’ కార్యక్రమాన్ని చేపట్టడానికి ‘సాక్షి’ ముందుకు రావడం అభినందనీయమన్నారు. మంగళవారం ఆయన గజ్వేల్ నియోజకవర్గంలో నిర్వహించిన హరితహారంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. హరితహారాన్ని వినూత్న పంథాలో ముందుకు తీసుకువెళ్లడానికి సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చారని తెలిపారు.

అడవుల్లో కోతులు, ఇతర జంతువులకు ఆహారాన్నిచ్చే చెట్లు అంతరించిపోతున్న తరుణంలో... ఆ చెట్లను పెంచి కోతులను వనాలకు తిప్పి పంపాలన్నారు. ఇలాంటి కార్యాచరణ గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. అంతేగాకుండా పట్టణాలను, గ్రామాలను అడవులుగా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. జిల్లాలో అడవులు ఏడు శాతానికి మించిలేదని, దీన్ని 33శాతానికి పెంచడానికి ఉద్యమ స్థాయిలో ప్రయత్నం జరగాల్సి ఉందన్నారు.

ఈ ఉద్యమంలో ‘సాక్షి’ సంస్థ భాగస్వామిగా మారి వైవిధ్యమైన కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తుందన్నారు. దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో ఈనెల 16న భారీ ఎత్తున ఈ కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు చేయడం ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమం నిజంగా జిల్లాలోని గీత కార్మికులను ఏకతాటిపైకి తీసుకువచ్చేదిగా మారబోతుందన్నారు. కార్యక్రమంలో జిల్లాలోని గీత కార్మికులు, గౌడ కులస్తులు భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు