జీతమో.. సత్యదేవా?

12 Dec, 2016 15:15 IST|Sakshi
జీతమో.. సత్యదేవా?
అన్నవరం ఆలయ సిబ్బంది జీతాలకూ కటకట
బ్యాంకుల ద్వారా ప్రతి నెలా రూ.రెండు కోట్లు జీతాలకు కేటాయింపు
దేవస్థానం నిధులున్నా.. నగదుకొరతతో చెల్లించలేని పరిస్థితి 
 
పెద్ద నోట్ల రద్దు.. బ్యాంకుల్లో నగదు కొరత.. ఈ ప్రభావంతో అన్నవరం వీరవేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం సిబ్బందికి ఈ నెలలో పూర్తి స్థాయిలో జీతాలు అందే పరిస్థితి కనిపించడం లేదు. దేవస్థానం వద్ద రూ.కోట్ల నిధులున్నా, ఆ నగదంతా స్థానిక బ్యాంకుల్లోనే ఉంది. అయితే సిబ్బందికి జీతాలు చెల్లించాల్సిన ఆ బ్యాంకులు షరతులు పెడుతుండడం ప్రస్తుతం ఉద్యోగులకు ఇబ్బందిగా మారింది.
- అన్నవరం
సిబ్బంది జీతభత్యాల కింద నెలనెలా రూ.రెండు కోట్లు చెల్లింపు
అన్నవరం దేవస్థానంలో పని చేస్తున్న సుమారు రెండు వేల మంది రెగ్యులర్, కాంట్రాక్ట్, ఎన్‌ఎంఆర్‌ ఉద్యోగులు,  వ్రతపురోహితులు, పెన్షనర్స్, నాయీబ్రాహ్మణులకు దేవస్థానం ప్రతి నెలా జీతాల రూపంలో రూ.రెండు కోట్లు చెల్లిస్తోంది. రెగ్యులర్‌ సిబ్బందికి, పెన్షనర్స్‌కు ఒకటో తేదీన, రెండు, మూడు తేదీలలో మిగిలిన వారికి  బ్యాంకుల ద్వారా చెల్లిస్తున్నారు. దేవస్థానం ఈఓ సంతకంతో జీతాల మొత్తానికి చెక్‌ రాసి ఏ ఉద్యోగికి ఎంత చెల్లించాలో ఉద్యోగుల లిస్ట్‌ జత చేసి బ్యాంకులకు పంపిస్తారు. రెగ్యులర్‌ సిబ్బందికి జీతాల కింద రూ.54 లక్షలు, పురోహితులకు పారితోషకం కింద రూ.40 లక్షలు స్టేట్‌బ్యాంక్‌ ద్వారా చెల్లిస్తారు. పెన్షనర్స్‌కి రూ.30 లక్షలు, నాలుగోతరగతి ఉద్యోగులకు రూ.20 లక్షలు, నాయీబ్రాహ్మణులకు రూ.ఆరు లక్షలు, మిగిలిన ఉద్యోగులకు రూ.50 లక్షలు ఆంధ్రాబ్యాంక్‌ ద్వారా ప్రతి నెలా చెల్లిస్తారు. బ్యాంకులలో ని«ధులు పుష్కలంగా ఉండేవి కనుక, ఈ జీతాలు బ్యాంకులోని తమ ఖాతాలకు జమైన రోజునే సిబ్బంది డ్రా చేసేసేవారు.
ప్రస్తుత పరిస్థితి అందుకు విరుద్ధం
సిబ్బంది జీతభత్యాల కింద పూర్తిస్థాయిలో నగదు చెల్లించేందుకు బ్యాంకుల వద్ద సరిపడనంత నగదు లేదు. రూ.500, వేయి నోట్లు రద్దవడంతో బ్యాంకులు వద్ద రూ.రెండు వేల నోట్లు, రూ.వంద నోట్లు, అంతకన్నా తక్కువ డినామినేషన్‌ నోట్లు మాత్రమే ఉన్నాయి. అవీ కూడా ఏ రోజుకారోజు ఆయా బ్యాంకుల ' ఛెస్ట్‌'లు(ట్రెజరీ బ్యాంకులు) నుంచి తెచ్చుకోవల్సి వస్తోంది. రూ.కోటి కావాలని ఇండెంట్‌ పెడితే రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలు మాత్రమే ఇస్తున్నారని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. వాటిలో రెండువేల నోట్లే అధికంగా ఉంటున్నాయని తెలిపారు. ఖాతాదారులు రూ.వంద నోట్లు అడుగుతున్నారని, అవి చాలా తక్కువ ఉంటున్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో దేవస్థానం సిబ్బందికి పూర్తిస్థాయిలో ఒకేసారి జీతాలు ఇవ్వలేమని తెలిపారు.
 
జీతాల చెక్కులు గురువారం బ్యాంకులకు పంపిస్తాం
దేవస్థానం సిబ్బంది జీతాల చెక్కులు డిసెంబర్‌ ఒకటో తేదీ, గురువారం స్థానిక స్టేట్‌బ్యాంక్, ఆంధ్రాబ్యాంకులకు  పంపిస్తాం. ప్రస్తుత పరిస్థితులలో వీలైనంత ఎక్కువ మొత్తం సిబ్బందికి చెల్లించాలని బ్యాంకు అధికారులకు చెప్పగలం తప్ప అంతకన్నా ఏమీ చేయలేం 
కె.నాగేశ్వరరావు, ఈఓ, అన్నవరం దేవస్థానం
 
పూర్తి జీతం ఒకేసారి ఇవ్వలేం
డిసెంబర్‌ నెలకు సంబంధించి దేవస్థానం సిబ్బందికి పూర్తిస్థాయిలో జీతం వెంటనే ఇవ్వలేం. పూర్తిస్థాయిలో జీతాలు చెల్లించాలంటే రూ.94 లక్షలు కావాలి. ప్రస్తుతం బ్యాంకు వద్ద రూ.30 లక్షలు కూడా నిల్వ లేదు. అది కూడా రూ.రెండు వేల నోట్లు మాత్రమే. సిబ్బంది కూడా సహకరించాలి.
 -డీఎస్‌కే శర్మ, స్టేట్‌బ్యాంక్‌ మేనేజర్‌, అన్నవరం 
 
రూ.పది వేలు చొప్పున మాత్రమే చెల్లిస్తాం
దేవస్థానం నాలుగోతరగతి ఉద్యోగులు, పెన్షనర్స్‌కు పూర్తిస్థాయిలో చెల్లించేందుకు తగినంత నగదు లేదు. మొదట రూ.పదివేల చొప్పున మాత్రమే చెల్లిస్తాం. మిగిలిన మొత్తం తరువాత చెల్లిస్తాం. 
వైవీ సత్యనారాయణ మూర్తి, మేనేజర్‌, ఆంధ్రాబ్యాంక్‌ 
మరిన్ని వార్తలు