నీరు–చెట్టు ఫైళ్లకు మోక్షం

19 Apr, 2017 23:28 IST|Sakshi
నీరు–చెట్టు ఫైళ్లకు మోక్షం
మూడు నియోజకవర్గాల ప్రతిపాదనలకు కలెక్టర్‌ గ్రీన్‌సిగ్నల్‌ 
– మిగతా నియోజకవర్గాలకు మొండిచెయ్యి 
– చక్రం తిప్పుతున్న ఇన్‌చార్జి బావమరిది
 
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అనుకున్నదే జరుగుతోంది. నీరు–చెట్టు పథకం కింద పూడికతీత పనులకు కలెక్టర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేస్తున్నారు. జిల్లాలో కేవలం పత్తికొండ, డోన్, పాణ్యం నియోజకవర్గాలకు సంబంధించిన ప్రతిపాదనల ఫైళ్లపై మాత్రమే కలెక్టర్‌ సంతకాలు పెట్టేస్తున్నారు. మరోవైపు మిగతా నియోజకవర్గాలకు చెందిన అధికార పార్టీ నేతలు కలెక్టర్‌ వైఖరిపై మండిపడుతున్నారు. రాత్రి పొద్దుపోయే వరకు కేవలం మూడు నియోజకవర్గ ప్రతిపాదనలకు మాత్రమే అనుమతులిస్తున్నారని తప్పుపడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో అధికార పార్టీకి చెందిన ఓ నియోజకవర్గ ఇన్‌చార్జి బావమరిది రింగు మాస్టర్‌గా మారారని తెలుస్తోంది.
 
బదిలీ అయినా... 
వాస్తవానికి జిల్లా కలెక్టర్‌ విజయమోహన్‌ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో తూర్పుగోదావరి జిల్లా జేసీగా ఉన్న సత్యనారాయణ జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు. ఆయన ఈనెల 22న బాధ్యతలు తీసుకోనున్నారు. బదిలీ అయిన తర్వాత కేవలం పరిపాలనకు సంబంధించిన సాధారణ ఫైళ్లు మినహా కొత్తగా ఆర్థికపరమైన అంశాలతో కూడిన ఫైళ్లపై సంతకాలు చేయడం నైతికంగా సరైన ప్రక్రియ కాదు. అయితే ఇందుకు భిన్నంగా కలెక్టర్‌ పొద్దుపోయే వరకు ఉండి మరీ కేవలం మూడు నియోజకవర్గాల ప్రతిపాదనలకు మాత్రమే గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తుండటం విమర్శల పాలవుతోంది. మిగతా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీలు చేసిన ప్రతిపాదనలను బుట్టదాఖలు చేస్తుండటంపై వారు మండిపడుతున్నారు.
 
సీఎంకు ఫిర్యాదులు... 
కలెక్టర్‌ వ్యవహారశైలిపై మండిపడుతున్న అధికార పార్టీ నేతలు నేరుగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. తమ ప్రతిపాదనలను కనీసం ఆమోదించకుండా కేవలం డిప్యూటీ సీఎం, ఆయన తమ్ముడు ఇన్‌చార్జిగా ఉన్న నియోజకవర్గాలతో పాటు పాణ్యం నియోజకవర్గాల ఫైళ్లకు మాత్రమే గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు. అంతేకాకుండా ఒక ఇన్‌చార్జి బావమరిది రింగు మాస్టర్‌గా ఉండి పర్సెంటేజీలు వసూలు చేస్తున్నారని అధికార పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ అంశాన్ని నేరుగా సీఎంకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. 
 
మరిన్ని వార్తలు