సమయం లేదు మిత్రమా !

27 May, 2017 03:40 IST|Sakshi
సమయం లేదు మిత్రమా !
 పంట కాలువలకు నీటి సరఫరాను ఆపేసి సుమారు నెలరోజులు కావస్తోంది. జూన్‌ 1న మళ్లీ నీటిని విడుదల చేస్తామని కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే ఇప్పటికీ కాలువల ఆధునికీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. నిర్వహణ పనులూ ముందుకు సాగడం లేదు. ఫలితంగా రానున్న రోజుల్లోనూ అన్నదాతలకు, ప్రజలకు సాగు, తాగునీటి కష్టాలు తప్పేలా లేవు.
 
కాళ్ల: కాళ్ల మండలంలోని అన్నయ్యకోడు కాలువలో సుమారు 280 మీటర్ల మేర రూ.75 లక్షలతో రెండు  చోట్ల రిటెయినింగ్‌వాల్‌ నిర్మాణ పనులు చేపట్టారు. సమయం ముంచుకొస్తున్నా.. ఈ పనులు కొలిక్కి రాలేదు. నత్తనడకన సాగుతున్నాయి. ఈ పనులను నాణ్యత లేకుండా నీటిలోనే చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాలువలకు నీరు వదిలితే ఈ పనులు సగంలో నిలిచిపోయే దుస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే పలు కాలువల్లో మట్టి మేట వేసింది.  జువ్వలపాలెం నుంచి శివారు కలవపూడి వరకూ అన్నయ్యకోడులో కర్రనాచు మేట వేసి ఉంది. కర్రనాచువల్ల ప్రతి ఏటా శివారు గ్రామాలకు నీరు అందడం లేదు. గురువారమే ఈ పనులు చేపట్టారు. ఇవి కూడా గడువులోపు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. అలాగే కాళ్ల కె.లంక చానల్‌ శివారు నుంచి ఎర్త్‌వర్క్‌ పనులు ఇటీవలే చేశారు. నిబంధనల మేరకు ఈ పనులు జరగ లేదని, నీళ్లల్లోనే తవ్వకం చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలువలకు నీరు విడుదల కాకముందే పనులు పూర్తిచేయాలని ప్రజలు కోరుతున్నారు.  
 
అన్నయ్యకోడు అభివృద్ధి పనులు మొదలెట్టాం  
అన్నయ్యకోడు పంటకాలువ అభివృద్ధి పనులు గురువారం ప్రారంభించాం. కాలువలో పేరుకుపోయిన కర్రనాచు, మట్టి దిబ్బలను తొలగిస్తాం. దీని వల్ల శివారు గ్రామాలకు నీటి ఇబ్బంది లేకుండా చేసేందుకు కృషి చేస్తున్నాం.  
– నంబూరి త్రినాథమూరి్తరాజు, కలవపూడి నీటి సంఘం అధ్యక్షుడు
 
కంటి‘తూడు’పు చర్యలే
నిడదవోలు : జిల్లాలో కాలువలు కట్టిన తరువాత యుద్ధ ప్రాదిపదికన చేపట్టాలి్సన ఓ అండ్‌ ఎం (ఇరిగేషన్‌ ఆపరేషన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ )తూడు పనులకు ఆలస్యంగా ఆమోదం లభించింది. జిల్లాలో  2017–18 సంవత్సరానికి  పశ్చిమ డెల్టాలోని అన్ని సబ్‌ డివిజన్ల పరిధిలో 202 పనులకు రూ.5.06 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆరు రోజుల వ్యవధిలో కాలువలకు నీరు విడుదల చేయనున్న నేపథ్యంలో ఈ పనులు చేపడతారా, లేదా అనే సందిగ్ధం నెలకొంది. కాలువలకు నీరు విడుదల చేయక ముందే వాటిల్లో పేరుకుపోయిన కర్రనాచు, గుర్రపుడెక్క తొలగించేందుకు రసాయనాలు పిచికారీ చేయాలి. అయితే ఆలస్యంగా నిధులు మంజూరు కావడంతో పనులను తూతూ మంత్రంగా చేపడతారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇవి కేవలం కంటితుడుపు చర్యలేనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం శిథిలావస్ధలకు చేరుకున్న స్లూయిస్‌ల మరమ్మతులSనైనా పూర్తిచేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 
 
ఏటా ఇదే తంతు 
ఏటా తూడు పనుల మంజూరులో ఆలస్యం జరుగుతూనే ఉంది. కాలువలు మూసివేసిన తరువాత ఏటా  పశ్చిమడెల్టా ప్రధాన కాలువతోపాటు తాడేపల్లిగూడెం, ఉండి, తణుకు, నరసాపురం సబ్‌ డివిజన్ల పరిధిలోని  ఉప కాలువలు, పిల్ల కాలువల్లో  పేరుకుపోయిన తూడు, డెక్క తొలగింపు, స్లూయిస్‌ల నిర్వహణ, షట్టర్ల మరమ్మతులు, గ్రీజు, ఆయిల్‌ పంపింగ్, స్లూయిస్‌ల అడుగు భాగంలో  పేరుకుపోయిన నాచు తొలగింపు పనుల చేపట్టా ల్సి ఉంది. ఏటా వీటి కి నిధుల మంజూరులో ఆలస్యం జరగడంతో పనులు పూర్తికావడం లేదు.  
 
తూడు  పనులు.. నీటి సంఘాలకే...
ఈ పనులన్నింటినీ కొన్నేళ్లుగా నామినేషన్‌ పద్ధతిపై నీటి సంఘాలకే కట్టబెడుతున్నారు.  అంతక్రితం అన్ని పనులనూ టెండర్లు వేసి  చేపట్టేవారు. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత  టెండర్ల ప్రక్రియకు స్వస్తి పలికారు. పనులను టీడీపీ వర్గీయులైన నీటి సంఘాల ప్రతినిధులకు అప్పగిస్తున్నారు. ఫలితంగా ఇవి నాణ్యంగా ఉంటాయో లేదోనన్న అనుమానం  నెలకొంది. 
 
యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలి
భీమవరం టౌన్‌ : డెల్టా ఆధునికీకరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని రాష్ట్ర రైతు కార్యాచరణ  సమితి  డిమాండ్‌ చేసింది. స్థానిక  ఏఎస్సార్‌ సాంస్కృతిక కేంద్రంలో గురువారం విలేకరుల సమావేశంలో  సమితి రాష్ట్ర అధ్యక్షుడు కె.గోపాలకృష్ణంరాజు మాట్లాడారు. నీటిని విడుదల చేసేలోపే పనులను పూర్తి చేసేందుకు చొరవ చూపాలని కోరారు. నందమూరు అక్విడెక్టు పాతనిర్మాణాన్ని తొలగించొద్దని విజ్ఞప్తి చేశారు.  కొత్త అక్విడెక్టు నిర్మాణం  వల్ల నీటి ప్రవాహం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని,  దాని పరీవాహక ప్రాంతంలో గట్లు మరింత పటిష్టం చేయాల్సి ఉందన్నారు. గట్లు పటిష్టం చేసిన తరువాతే పాత అక్విడెక్టు నిర్మాణాన్ని తొలగించాలని కోరారు. సమావేశంలో సమితి నాయకులు మేళం దుర్గా ప్రసాద్, పాతపాటి మురళీరామరాజు, మెంటే సోమేశ్వరరావు, నల్లం నాగేశ్వరరావు, సీతారామరాజు, లక్ష్మీపతిరాజు పాల్గొన్నారు.
 
 
 
 
మరిన్ని వార్తలు