వివాహేతర సంబంధంకి యువకుడి మృతి

8 Jul, 2013 05:00 IST|Sakshi
 జి.కొండూరు, న్యూస్‌లైన్ :  వివాహేతర సంబంధం ఉన్న యువకుడి మృతి కేసులో పోలీసుల పాత్ర ఉందంటూ జి.కొండూరు పోలీస్‌స్టేషన్ ఎదుట కోడూరు గ్రామస్తులు ఆదివారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. సుమారు 300 మంది వరకు స్టేషన్‌కు చేరుకుని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఎస్సై హక్, సిబ్బందిపై దాడి చేశారు. సమాచారం అందుకుని శాంతిభద్రతలను పర్యవేక్షించడానికి వచ్చిన మైలవరం సీఐ బంగార్రాజు న్యాయం కోసం ఆందోళన చేస్తున్నవారిపై దురుసుగా ప్రవర్తించి వారిపై ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ హఠాత్పరిణామంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. 
 
 మండలంలోని కోడూరుకు చెందిన బెజవాడ రాజేశ్వరి గత నెల 28న తప్పిపోయినట్లు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆమె భర్త గోపి ఫిర్యాదు చేశారు. అదేరోజు గ్రామానికి చెందిన ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న పలగాని రామకృష్ణ (22)  చెన్నైలో ఉద్యోగం చేస్తానని చెప్పి కుటుంబసభ్యుల నుంచి రూ.10 వేలతో పాటు వంట సామగ్రి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో దర్యాప్తు చేపట్టిన పొలీసులు రాజేశ్వరి సెల్ సిగ్నల్ ఆధారంగా ఈ నెల రెండున తమిళనాడు రాష్ట్రంలోని సేలంలో ఉన్నట్టు గుర్తించారు. అక్కడికి వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ సాంబశివరావు ఆమెతో పాటు రామకృష్ణ కూడా ఉన్నాడని గుర్తించి ఆ సమాచారాన్ని ఎస్సై హక్ కు తెలియజేశారు.  సేలం పోలీసులు కేవలం రాజేశ్వరిని తీసుకువెళ్తున్నట్లు రికార్డు పరంగా నమోదు చేసుకున్నారు.
 
 పొలీసులే చంపించారు.. మృతుని బంధువులు..
 
 సేలం నుంచి రాజేశ్వరితో పాటు రామకృష్ణను కూడా తీసుకొస్తున్నట్లు ఎస్సై హక్ తమకు చెప్పారంటూ మృతుని బంధువులు చెబుతున్నారు. ఇదే సమయంలో దర్యాప్తు నిమిత్తం వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ సాంబశివరావు సేలం స్టేషన్‌లో ఇద్దరినీ కలిపి తీసిన ఫొటో ఇక్కడివారికి చూపించారు. తీరచూస్తే రాజేశ్వరిని మాత్రమే ఇక్కడికి తీసుకొచ్చారు. దీనిపై మృతుడి బంధువులు ఎస్సైని ప్రశ్నించగా, ఆయన్నుంచి సరైన సమాధానం రాలేదు. ఈ క్రమంలో ఈ నెల నాలుగున రామకృష్ణ గుంటూరు జిల్లా ఇత్తటం గ్రామ శివారులో రైల్వే ట్రాక్ పక్కన శవమై తేలాడు. మృతదేహం రామకృష్ణదిగా గుర్తించిన బంధువులు ఈ ఘటనపై ఎస్సై హక్‌ను ప్రశ్నించారు. అయితే రామకృష్ణ తమ సిబ్బందితో పాటు రాలేదని, తమకు తెలియదంటూ ఆయన దురుసుగా ప్రవర్తించాడని వారు ఆరోపిస్తున్నారు. దీంతో మంగళగిరిలో పోస్టుమార్టం అయిన తరువాత శవాన్ని స్టేషన్ దగ్గరకు తీసుకొచ్చి ధర్నాకు దిగారు. పోలీసుల సహకారంతో రాజేశ్వరి బంధువులే రామకృష్ణను చంపారంటూ కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు స్టేషన్‌పై, సిబ్బందిపై దాడికి దిగడం, పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సమాచారం అందుకున్న మైలవరం సీఐ అక్కడికి చేరుకున్నారు. గ్రామస్తులపై అకస్మాత్తుగా కాల్పులు జరిపి పరారయ్యారు.  
 
 చికిత్స పొందుతున్న క్షతగాత్రులు..
 
 సీఐ కాల్పుల్లో గాయపడిన ఐదుగురు చికిత్స పొందుతున్నారు. గొల్లపూడిలోని ఆంధ్రా ఆస్పత్రిలో నలుగురు, మైలవరంలో మరొకరు ఉన్నారు. ఆంధ్రా ఆస్పత్రిలో మైలవరానికి చెందిన నరసింహారావు, ఎస్.కృష్ణారావు, కోడూరుకు చెందిన జి.వెంకటరావు, ఎస్‌వీ సూర్యనారాయణలు బుల్లెట్ గాయాలపాలై అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు. మైలవరానికి చెందిన పజ్జూరి చినవెంకయ్య మైలవరంలో చికిత్స పొందుతున్నారు. వారిని డీఐజీ విక్రమ్‌సింగ్‌మాన్ పరామర్శించారు. పూర్తిస్థాయిలో విచారణ నిర్వహిస్తామని ఆస్పత్రి వద్ద ఆయన విలేకరులకు తెలిపారు. 
 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన..
 ఘటన విషయం తెలియగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జ్యేష్ఠ రమేష్ బాబు, పెడన మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ల నేతృత్వంలో పార్టీ నేతలు, కార్యకర్తలు బాధితులకు మద్దతుగా ధర్నా చేపట్టారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని, విచక్షణా రహితంగా కాల్పులు జరిపిన సీఐ బంగార్రాజు తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అసలు హత్య ఎలా జరిగిందో మిస్టరీ  తేల్చాలని, రాజేశ్వరితో మాట్లాడితే వాస్తవాలు తెలుస్తాయని కోరారు. దాదాపు 4 గంటల నుంచి ఆందోళన కొనసాగిస్తూ స్టేషన్ ఎదుట జోరువానలోనే బైఠాయించారు. 
 
 సంఘటనా స్థలానికి డీఐజీ, ఎస్పీ..
 
 మరోవైపు సమాచారం తెలియగానే ఎస్పీ ప్రభాకరరావు జీ కొండూరు స్టేషన్‌కు చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. అనంతరం ఏలూరు రేంజి డీఐజీ విక్రమ్‌సింగ్ నేరుగా కాల్పుల్లో గాయపడి గొల్లపూడిలోని ఆంధ్రా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు. అనంతరం జీకొండూరు స్టేషన్‌కు వచ్చి పార్టీ నాయకులతో, బాధితులతో మాట్లాడారు. కలెక్టర్ ఆదేశాలతో సబ్‌కలెక్టర్ హరిచందన, జేసీ ఉషాకుమారి జి.కొండూరు వెళ్లి బాధితులతో మాట్లాడారు. న్యాయం  చేసే వరకు ఆందోళన విరమించేది లేదని, సీఐని తక్షణమే అరెస్టు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. సంఘటనపై పూర్తి వాస్తవాలు నిగ్గుతేల్చాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ బుద్ధప్రకాష్ మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. 
 
మరిన్ని వార్తలు