నో ’చేంజ్‌’

16 Dec, 2016 22:36 IST|Sakshi
నో ’చేంజ్‌’
పనులు మానుకుని బ్యాంకుల వద్ద క్యూ కడుతున్న జనం
 అయినా అందరికీ అందని నగదు
 రోజురోజుకు నగదు పరిమితిని తగ్గిస్తున్న బ్యాంకులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : 
పెద్ద నోట్లను రద్దు చేసి 38 రోజులైంది. బ్యాంకుల వద్ద పరిస్థితుల్లో ఇప్పటికీ ఎలాంటి మార్పు లేదు. మొదట్లో రూ.100, రూ.50, రూ.20, రూ.10 నోట్లు ఇచ్చినా.. ఇప్పుడు మాత్రం రూ.2వేల నోట్లు మాత్రమే ఇస్తున్నారు. దీంతో చిల్లర కష్టాలు పెరిగిపోయాయి. ప్రజలు ఇప్పటికీ రోజువారీ పనులు మానుకుని ఉదయాన్నే బ్యాంకుకు చేరుకుని క్యూలో నిల్చోవాల్సి వస్తోంది. ఖాతాదారుల ఆందోళనలతో ప్రతి బ్యాంకు వద్ద పోలీసు బందోబస్తు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్యాంక్‌ల నుంచి వారానికి రూ.24 వేలు డ్రా చేసుకోవచ్చనే నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. ప్రస్తుతం రోజుకు రూ.4 వేలు, అక్కడక్కడా రూ.6 వేలు మాత్రమే ఇస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం దాదాపు అన్ని రోజులు పనిచేసిన తణుకు ఎస్‌బీఐ మెయిన్‌ బ్రాంచ్‌ వద్ద ఏటీఎం గురువారం నుంచి పనిచేయకపోవడంతో ఖాతాదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. 
 
 పాలకొల్లు మండలం దగ్గులూరు ఆంధ్రాబ్యాంక్‌లో శుక్రవారం నగదు లావాదేవీలు నిలిచిపోయాయి. ఉదయం 8 గంటలకే పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో బ్యాంకుకు చేరుకున్న ఖాతాదారులు, పింఛనుదారులు ఇబ్బంది పడ్డారు.
 పెనుగొండ మండలం వడలిలో సుమారు రెండు ఫర్లాంగుల క్యూ ఉండటంతో ఖాతాదారులు ఎండలో మలమల మాడిపోయారు. పెనుగొండ ఎస్‌బీఐ, సిద్ధాంతం ఆంధ్రాబ్యాంకు వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. బ్యాంకుల గేట్లు మూసివేసి లోపలికి ప్రాధాన్యత క్రమంలో అనుమతిస్తుండటంతో ఎక్కువమంది బయటే వేచి ఉండాల్సి వస్తోంది. 
 ఆచంట, కొడమంచిలి ఎస్‌బీఐల వద్దకు జనం పెద్దఎత్తున తరలిరావడంతో తోపులాటలు జరిగాయి. దీంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కొడమంచిలి ఎస్‌బీఐ వద్ద గురువారం నగదు పంపిణీ చేయకపోవడంతో శుక్రవారం ఖాతాదారులు పోటెత్తారు. రూ.4 లక్షలు మాత్రమే అందుబాటులో ఉందని చెప్పి, ఒక్కో ఖాతాదారుడికి రూ.2 వేల చొప్పున పంపిణీ చేసేందుకని 200 మందికి టోకెన్లు ఇచ్చారు. దీంతో ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్ని రోజులు తిరగాలంటూ బ్యాంకు సిబ్బందిపై మండిపడ్డారు.
 
మొగల్తూరు ఎస్‌బీఐలో ఒక్కొక్కరికి రూ.2 వేలు మాత్రమే ఇచ్చారు. కొద్ది గంటలకే నగదు లేదని మరుసటి రోజు తేదీ, సీరియల్‌ నంబర్లను విత్‌ డ్రాయల్‌ ఫారంపై వేసి ఖాతాదారులకు అందించారు. ఆంధ్రా బ్యాంక్‌లో నగదు తక్కువ ఉండటంతో ఇబ్బందులు తప్పలేదు. 
జంగారెడ్డిగూడెం ఎస్‌బీఐ ఏటీఎం వద్ద జనం కిక్కిరిశారు. పట్టణంలోని హెచ్‌డీఎఫ్‌సీ, ఐడీబీఐ ఏటీఎంలు మాత్రమే పనిచేశాయి. ఈ ఏటీఎంలలో నగదు పెట్టిన కొద్ది గంటల్లోనే అయిపోవడంతో చాలామంది ఖాతాదారులు నిరాశగా వెనుదిరిగారు. చింతలపూడి ఆంధ్రాబ్యాంక్‌లో ఖాతాదారులకు రూ.24 వేల వరకు పంపిణీ చేశారు. ఎస్‌బీఐలో మాత్రం రూ.4 వేలు అందించారు. పట్టణంలోని ఎస్‌బీఐ ఏటీఎం ఒక్కటే పని చేయడంతో జనం ఏటీఎం వద్ద బారులు తీరారు. లింగపాలెం ధర్మాజీగూడెం ఎస్‌బీఐ, రంగాపురం ఆంధ్రాబ్యాంకుల్లో శుక్రవారం ’నో క్యాష్‌’ బోర్డులు దర్శనమిచ్చాయి. రంగాపురం ఆంధ్రాబ్యాంక్‌ లో మాత్రం సాయంత్రం నుంచి రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు ఇచ్చి సర్దుబాటు చేశారు. కామవరపుకోట ఆంధ్రాబ్యాంకులో ఒక్కొక్క ఖాతాదారుడికి శుక్రవారం రూ.4 వేలు ఇవ్వగా, ఇండియన్‌ బ్యాంకు, ఎస్‌బీఐలలో రూ. 2 వేల చొప్పున ఇచ్చారు. బ్యాంకులో డబ్బు లేకపోవడంతో చాలామంది ఖాతాదారులు వెనుదిరిగి వెళ్లిపోయారు.
 
మరిన్ని వార్తలు