నేడు శమీ దర్శనం

11 Oct, 2016 01:12 IST|Sakshi

ప్రొద్దుటూరు కల్చరల్‌: ప్రొద్దుటూరులో దేవీశరన్నవరాత్రి మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. విజయదశమి సందర్భంగా మంగళవారం అమ్మవారి శమీదర్శన మహోత్సవం నిర్వహించనున్నారు. దసరా మహోత్సవాల్లో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్నది వాసవీమాత శమీదర్శనం, తొట్టిమెరవణి. ఈ ఉత్సవాలను ఏటా 3 లక్షల మందికిపైగా భక్తులు తిలకిస్తారు. మధ్యాహ్నం 2 నుంచి 2.56 గంటల్లోపు మకరలగ్నంలో శమీదర్శనం ప్రారంభం కానుంది. పుర వీధుల మీదుగా అమ్మవారి శమీదర్శన మహోత్సవం వైభవోపేతంగా ప్రారంభమై కొర్రపాడు రోడ్డులోని శ్రీవాసవీ శమీదర్శన మండపం చేరనుంది. విజయానికి, సంపదకు చిహ్నమైన శమీ వృక్షాన్ని దర్శించి అమ్మవారికి పూజలు నిర్వహిస్తే శుభప్రదమని ప్రతీతి. అందువల్లనే విజయదశమి నాడు అమ్మవారికి శమీదర్శనం చేయించి తమకు విజయాలు, సిరిసంపదలు ఇవ్వాలని వేడుకుంటారు. శ్రీమహాలక్ష్మి సమేత చెన్నకేశవస్వామి, రతనాల వేంకటేశ్వరుడు, శివాలయం, రాజరాజేశ్వరి దేవి ఆలయాలతోపాటు పట్టణంలోని అన్ని ఆలయాల నిర్వాహకులు కొర్రపాడు రోడ్డు మిల్లులలోని శమీవృక్ష దర్శనానికి వివిధ కళాబృందాల మధ్య  వైభవంగా చేరుకుంటారు. అన్ని ఆలయాల నుంచి వచ్చిన స్వామి, అమ్మవారి వైభవాన్ని తిలకించేదుకు వచ్చిన భక్తులతో కొర్రపాడు రోడ్డు భక్త సంద్రం కానుంది.

విజయలక్ష్మిదేవి గ్రామోత్సవం (తొట్టిమెరవణి):
శ్రీవాసవీకన్యకా పరమేశ్వరీదేవి అమ్మవారికి అర్ధరాత్రి 12.15 గంటల నుంచి 1 గంటల లోపు మిథునలగ్నంలో నిర్వహించే తొట్టిమెరవణి ప్రారంభం కానుంది. పంచలోహంతో తయారు చేసిన తొట్టి మెరవణి రథంలో అమ్మవారి శ్రీ చక్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ రథం పర్యటించిన ప్రాంతంలో అశుభాలు, చెడులు తొలగిపోయి సర్వశుభాలు కలుగుతాయనేది భక్తుల విశ్వాసం. అమ్మవారు విజయలక్ష్మి అలంకారంలో దర్శనమిస్తారు. పురవీధులలో కన్నుల పండువగా తొట్టిమెరవణిని నిర్వహిస్తారు. అమ్మవారిశాల నుంచి బయలుదేరి మెయిన్‌ బజారు, పప్పులబజారు మీదుగా పుట్టపర్తి సర్కిల్‌కు చేరుకుంటారు. కళ్లుమిరుమిట్లు గొలిపే బాణసంచా పేలుళ్లు, వెలుగులతో ఆ ప్రాంతం నూతన శోభ సంతరించుకోనుంది. ఈ తొట్టి మెరవనిలో శమీదర్శనంలోని కళాబృందాలతోపాటు సినీడూప్స్, బ్యాండ్‌ మేళం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని ఆర్యవైశ్యసభ అధ్యక్షుడు రామ్మోహన్‌రావు తెలిపారు. ఉత్సవంలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు.
 

మరిన్ని వార్తలు