టీడీపీ నేతల మధ్య ఇసుక చిచ్చు!

19 Mar, 2017 23:16 IST|Sakshi
టీడీపీ నేతల మధ్య ఇసుక చిచ్చు!

- శ్రీకాకుళం రేవులో తన్నుకున్న‘తమ్ముళ్లు’
- రోజురోజుకూ ముదురుతున్న వివాదం
- బుజ్జగించే పనిలో మంత్రి కొల్లు రవీంద్ర


మచిలీపట్నం : నియోజకవర్గంలోని తెలుగు తమ్ముళ్లలో ఒక వర్గానికి చేతినిండా పని దొరికింది. ఆగ్రహంతో రగిలిపోయిన మరోవర్గం తమ చేతికి పని చెప్పింది. దీంతో రెండు వర్గాలు ఇసుక రేవులో చేరి తన్నుకున్నాయి. చివరికి పోలీసులు వచ్చి సర్ది చెప్పడంతో అప్పటికి గొడవ సద్దుమణిగినా... ఆ తర్వాత వివాదం మరింత ముదురుతోంది. దీంతో మంత్రి కొల్లు రవీంద్ర జోక్యం చేసుకుని ఆగ్రహంతో రగిలిపోతున్న వర్గాన్ని బుజ్జగిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పట్టణంలో ‘తమ్ముళ్ల తన్నులాట’ హాట్‌ టాపిక్‌గా మారింది.

ఇదీ అసలు కథ...: మచిలీపట్నం పురపాలక సంఘంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ కింద రూ.10 కోట్ల విలువైన పనులకు అనుమతులు ఇచ్చారు. బందరు మండలంలో రూ.6.5 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు అనుమతులు ఇచ్చారు. ఈ నిధులతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు మచిలీపట్నానికి సమీపంలోని ఘంటసాల మండలం శ్రీకాకుళం రేవు నుంచి ఇసుకను తరలించేందుకు మంత్రి కొల్లు రవీంద్ర కలెక్టర్‌ నుంచి అనుమతి తెచ్చినట్లు ఆ పార్టీ కార్యకర్తలే చెబుతున్నారు.

ఇక్కడే గొడవ మొదలైంది
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ కింద చేపట్టే అభివృద్ధి పనులకు శ్రీకాకుళం రేవు ఇసుకను మచిలీపట్నానికి రవాణా చేసే పనిని కొంతమంది ‘తమ్ముళ్ల’కే అప్పగించారు. దీంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయారు. రెండు వర్గాలవారు తామే ఇసుకను రవాణా చేస్తామని వాహనాలతో సహా శ్రీకాకుళం రేవుకు రెండు రోజుల క్రితం వెళ్లారు. అభివృద్ధి పనులకు తామే ఇసుకను రవాణా చేస్తామని ఇరువర్గాల వారు రేవులోనే తన్నుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సర్దుబాటు చేశారు.

బుజ్జగింపులు...: టీడీపీ నాయకులు, కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి కొట్లాడుకోవడంతో మంత్రి కొల్లు రవీంద్ర రంగంలోకి దిగినట్లు తెలిసింది. ఇసుక రవాణా చేసేందుకు అనుమతి ఇవ్వని వారిని పిలిచి వేరే పనులు అప్పగిస్తామని బుజ్జగింపులకు దిగినట్లు విశ్వసనీయ సమాచారం. బైపాస్‌రోడ్డు ప్రాంతానికి చెందిన ఓ కౌన్సిలర్‌కు రూ.2 కోట్ల విలువైన పనులు అప్పగించడంతో కొందరు తెలుగు తమ్ముళ్లు తమను పక్కన పెట్టేశారని బాహాటంగానే విమర్శలకు దిగుతున్నారు. తాము 1983 నుంచి పార్టీ జెండా మోస్తూనే ఉన్నామని, తమను పక్కనపెట్టి కొందరికే పనులు అప్పగిస్తున్నారని పలువురు నాయకులు విమర్శలు చేస్తున్నారు.

అనుమతి లేకుండానే మట్టి తవ్వకాలు
మచిలీపట్నం పురపాలక సంఘంలో కీలకంగా వ్యవహరించే కౌన్సిలర్‌ కేంద్రీయ విద్యాలయం పక్కనే అనుమతులు లేకుండా పొక్లెయిన్‌తో మట్టిని తవ్వి తాను పనులు దక్కించుకున్న రోడ్డు నిర్మాణానికి వినియోగిస్తున్నారు. అనుమతులు లేకుండానే మట్టిని తరలిస్తున్నా... పట్టించుకునే అధికారులే కరువయ్యారు. ఇంతకాలంగా ఏమైనా పనులు అప్పగిస్తారని ఆశగా ఉన్న ఓ వర్గం టీడీపీ కార్యకర్తలు తమకు పనులు దక్కకపోవడంతో మంత్రి తీరుపై బహిరంగంగానే విమర్శలకు దిగడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా