ఇసుక జోరుగా ‘ఫిల్టర్’

14 Jun, 2016 08:02 IST|Sakshi
ఇసుక జోరుగా ‘ఫిల్టర్’

విజృంభిస్తున్న ఇసుక మాఫియా ఉచిత విద్యుత్‌తో
కుంటలు, చెరువుల నుంచి నీళ్ల వినియోగం
పంట పొలాలు, ప్రభుత్వ భూముల్లోనూ ఫిల్టర్ల ఏర్పాటు
పరిగి, దోమ, గండేడ్ మండలాల పరిధిలో ఇసుక తయారీ
చేష్టలుడిగి చూస్తున్న యంత్రాంగం

 పరిగి: ఇసుక మాఫియా విజృంభిస్తోంది. పంట పొలాలు, బీడు భూములు, ప్రభుత్వ, ప్రైవేటు భూములు, చెరువులు, కుంటలు అని తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ ఇసుక ఫిల్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇటు రాజకీయ నాయకులను అటు అధికార యంత్రాంగాన్ని ఇసుక మాఫియా శాసిస్తోందనే అరోపణలు వినిపిస్తున్నాయి. వాగులు, నదులనుంచి ఇసుక తరలించేం దుకు ఉన్నత స్థాయి అధికారుల నుంచి ఆటంకాలు ఎదురవుతుండడంతో అక్రమార్కులు ఎవరికివారు స్థానికంగా ఇష్టారాజ్యంగా ఇసుక ఫిల్టర్లను ఏర్పాటు చేసుకుని తమ దందా కొనసాగిస్తున్నారు.

అయితే, ఆయా గ్రామాల్లోని కీలక నేతల కనుసన్నల్లోనే ఈ ఇసుక మాఫియా కొనసాగుతోంది. మారుమూల ప్రాంతాల్లో ఫిల్టర్లు ఏర్పాటు చేస్తూ ఇసుకను తయారుచేస్తూ ట్రాక్టర్ల ద్వారా రోడ్లు ఉన్న ప్రాంతాలకు తరలిస్తూ నిల్వ చేసుకుంటున్నారు. అనంతరం సదరు ఇసుకను లారీల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కరీంనగర్ తదితర ప్రాంతా ల నుంచి ఒక లారీ ఇసుకను తీసుకొస్తూ అవే బిల్లులపై మరో రెండు లారీల లోకల్ ఇసుకను తరలిస్తున్నారు. ఇదంతా అటు రెవెన్యూ, ఇటు పోలీసు యంత్రాంగం కనుసన్నల్లోనే జరుగు తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 చట్టాలన్నీ వారికి చుట్టాలే..!
సహజ వనరుల దుర్వినియోగ నియంత్రణ చట్టం(వాల్టా), నాన్ అగ్రికల్చర్ ల్యాండ్( నాలా), ఫారెస్టు పరిరక్షణ చట్టం ఇలా ఒకటేమిటి.. చట్టాలన్నింటిని ఇసుక అక్రమార్కులు తమ చుట్టాలుగా మార్చుకుంటున్నారు. కొందరు గండేడ్ మండలంలోని వాగుల్లో ఇసుకను తవ్వి రవాణా చేస్తూ వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తుండగా, పరిగి, దోమ మండలాల్లో యథేచ్ఛగా పంట పొలాలు, బీడు భూములు అని తేడా లేకుండా మట్టిని తవ్వుతూ ఫిల్టర్లకు తరలిస్తూ ఇసుక తయారు చేస్తున్నారు.

అటవీ భూముల్లో ఎలాంటి తవ్వకాలు జరుపొద్దనే నిబంధనలున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. చాలా మంది ఇసుక ఫిల్టర్ల నిర్వాహకులు విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  ఇదే సమయంలో ఇసుక ఫిల్టర్లకోసం ప్రత్యేకంగా బావులు, కుంటలు నిర్మిస్తున్నారు. ఇలా అక్రమార్కులు ఇన్ని శాఖలకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.  

 పరిగి, గండేడ్, దోమ మండలాల్లో అత్యధికం..
ఇసుక అక్రమ రవాణాకు అడ్డూఅదుపూ లేకుండా పోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇళ్ల నిర్మాణాలకు ఇసుక దొరకని పరిస్థితి నెలకొంది. ఎక్కడో ఓ చోట ఇసుక లభించినా అధిక ధరలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. గండేడ్ మండల పరిధిలోని ధర్మాపూర్, శేఖపల్లి, గాధిర్యాల్, చిన్నవార్వాల్, పెద్దవార్వాల్, రంగారెడ్డిపల్లి, పగిడ్యాల్ గ్రామాల్లో అత్యధికంగా ఇసుక నిల్వ ఉంది. దీంతోపాటు దోమ మండల పరిధిలోని పలు గ్రామాలు, పరిగి మండల పరిధిలోని రంగంపల్లి, గడిసింగాపూర్ తదితర గ్రామాల శివార్లలో ఇసుక ఫిల్టర్లు ఏర్పాటు చేసిన అక్రమార్కులు యథేచ్ఛగా ఇసుకను వ్యాపారం చేస్తున్నారు.

ఆయా ప్రాంతాల నుంచి పగలు, రాత్రి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను పొలాలకు తరలించి.. అనంతరం అక్కడి నుంచి పట్టణ ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. అధికారులు, పోలీసులు తరచూ నామమాత్రంగా దాడులు నిర్వహించి స్వల్ప జరిమానాలతో సరిపెడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఫిల్టర్ ఇసుక దందాపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు