మళ్లీ రెక్కలు

4 Aug, 2017 23:01 IST|Sakshi
మళ్లీ రెక్కలు
ఇసుక యూనిట్‌ ధర రూ.3 వేలు
ర్యాంపులు తగ్గడంతో డిమాండ్‌
సొమ్ము చేసుకుంటున్న నిల్వదారులు
అమలాపురం : ఒకవైపు గోదావరిలో వరద... మరోవైపు జిల్లాలో ఒకటి రెండు ర్యాంపులకు మాత్రమే అనుమతి... ఇంకొక వైపు శ్రావణమాసంలో భారీగా నిర్మాణాలకు శంకుస్థాపనలు జరగడంతో ఇసుకకు ఎనలేని డిమాండ్‌ ఏర్పడింది. ఇదే అక్రమ నిల్వదారులకు కాసులు పంట పండిస్తోంది. యూనిట్‌ ధర రూ.2,500ల నుంచి రూ.3 వేలు పెంచి అక్రమ నిల్వదారులు దొడ్డిదారిన ఇసుక అమ్మకాలు సాగిస్తున్నారు. ప్రభుత్వ ఉచిత ఇసుక విధానం ప్రకారం ర్యాంపు బాట నిర్వహణ, కూలీలకు యూనిట్‌కు రూ.425 మాత్రమే వసూలుకు అనుమతి ఉంది. జిల్లావ్యాప్తంగా ఇసుక ర్యాంపులకు అనుమతి ఉన్న సమయంలోనే ఈ నిబంధన అమలు కాలేదు. ర్యాంపు ఎగుమతి, బాట నిర్వహణకు వసూలు చేయడమే కాకుండా యూనిట్‌కు అదనంగా రూ.500 చొప్పున వసూలు చేసేవారు. వీటిని అధికార పార్టీకి చెందిన కీలక ప్రజాప్రతినిధులు జేబులో వేసుకున్న విషయం తెలిసిందే. గడువు పూర్తికావడంతోపాటు, వరద పోటెత్తడంతో ర్యాంపులు మూతపడ్డాయి. ప్రస్తుతం కడియం మండలం వేమగిరి, పి.గన్నవరం మండలంలో ఒక ర్యాంపు వద్ద తవ్వకాలు సాగుతున్నాయి. దీనిని ముందే గుర్తించి ఇసుక అక్రమ వ్యాపారులు భారీగా ఇసుకను నిల్వ చేశారు. శ్రావణమాస డిమాండ్‌ ఏర్పడడంతో అదను చూసి ధర పెంచి అమ్మకాలు చేస్తున్నారు. వినియోగదారులు సైతం ఎంత ధరైనా వెచ్చించి కొనుగోలు చేస్తుండడంతో అక్రమార్కులకు కాసుల వర్షం కురుస్తోంది. జిల్లాలోనే కాకుండా విశాఖ, విజయనగరం వంటి ప్రాంతాలకు ఎగుమతి జోరుగా సాగుతుండడం కూడా ధర పెరుగుదలకు కారణమైంది. లారీల యజమానులు సైతం కిరాయి పెంచివేశారు. అక్రమంగా తరలిస్తున్న ఇసుక అధికారులు పట్టుకుంటే ఇబ్బందని చెబుతూ ధరలను అమాంతంగా పెంచారు. రావులపాలెం నుంచి రెండు యూనిట్ల లారీ అమలాపురం తరలిస్తే ఇసుకకు రూ.ఆరు వేలు, కిరాయి మరో రూ.ఆరు వేల చొప్పున రూ.12 వేలు అవుతోందని వినియోగదారులు లబోదిబోమంటున్నారు. అదే కాకినాడ వంటి ప్రాంతాలకు మరో రూ.మూడు వేలు రవాణా ఖర్చులవుతున్నాయి. ఇసుక అక్రమ వ్యాపారులు గతంలో రహస్య ప్రాంతాల్లో నిల్వలు చేసేవారు. వీటిమీద మైన్స్, రెవెన్యూ శాఖల నిఘా ఉండడంతో అక్రమార్కులు కొత్త పంథాను అనుసరిస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, అపార్ట్‌మెంట్ల నిర్మాణాల సమీపంలో భారీ ఎత్తున ఇసుక నిల్వ చేస్తున్నారు. అధికారులు ఆరా తీస్తుంటే నిర్మాణాలకు తీసుకువచ్చామని చెబుతూ కళ్లు గప్పుతున్నారు. ఆనక ఇసుక అక్రమంగా తరలించి జేబులు నింపుకుంటున్నారు. ఇదే పంథాలో ఇసుకను ఊరూరా నిల్వ చేసి సొమ్ములు చేసుకుంటున్న వ్యాపారులు సైతం పెరిగిపోయారు. అడపాదడపా అధికారులు దాడి చేసినా అవి చాలా తక్కువ మొత్తంలోనే. ఆత్రేయపురం మండలం వెలిచేరు నుంచి పశ్చిమ గోదావరి జిల్లా పంగిడి తరలిస్తుండగా ఒక లారీని గుర్తించి పోలీసులు గురువారం సీజ్‌ చేశారు. అయితే ఇక్కడ నుంచి శుక్రవారం యథావిధిగా ఇసుక రవాణా జరగం గమనార్హం. ఇసుక ధర పెరుగుదల ప్రభావం ప్రభుత్వం చేపట్టిన సీసీరోడ్లు, భవనాలు, ఇతర నిర్మాణాలపై సైతం పడింది. ఇంత ధరలో ఇసుక కొనుగోలు చేసి నిర్మాణాలు చేయలేమని కాంట్రాక్టర్లు చేతులు ఎత్తివేయడంతో పనులు నిలిచిపోతున్నాయి. అధికారులు అక్రమ నిల్వలపై దాడులు చేసి ఉన్న ఇసుకను తక్కువ ధరకు అమ్మకాలు జరిగేలా చూడాలని వినియోగదారులు కోరుతున్నారు. 
మరిన్ని వార్తలు