సంగమస్నానం..పుణ్యఫలం

6 Aug, 2016 23:39 IST|Sakshi
కొల్లాపూర్‌ : సోమశిల సమీపంలో సప్త నదులు సంగమమయ్యే ప్రాంతం
-భీమా, కష్ణా కలిసేది తంగిడి వద్దే..
- శ్రీపాదవల్లభుడు స్నానం ఆచరించిన క్షేత్రం ∙ నివత్తి సంగమంగా ప్రసిద్ధి
నదులు కలిసేచోట సంగమ స్నానం చేస్తే పాపాలు నశించి పుణ్యఫలం దక్కుతుందని భక్తుల నమ్మకం..  జిల్లాలోని మూడు ప్రాంతాల్లో ఇలాంటి ప్రదేశాలు ఉన్నాయి.. మాగనూర్‌ మండలం తంగిడి వద్ద భీమా, కష్ణానదులు కలుస్తాయి.. అలంపూర్‌ పుణ్యక్షేత్రానికి 10కి.మీ. దూరంలో గొందిమల్ల వద్ద, అలాగే కొల్లా మండలం సోమశిల సమీపంలో సప్త నదులు కలుస్తాయి.. ఈ నేపథ్యంలోనే ఈ నెల 12 నుంచి 23వ తేదీ వరకు జరిగే కష్ణా పుష్కరాల్లో భాగంగా ఈ ప్రాంతాల్లో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు అధిక సంఖ్యలో రానున్నారు.. దీనిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనమిది. 
 
మాగనూర్‌ : జగద్గురు దత్తాత్రేయ మహాస్వామి మొదటి అవతార పురుషుడైన శ్రీపాద వల్లభుడు తంగిడి క్షేత్రంలోని కష్ణా, భీమా నదుల సంగమ క్షేత్రంలో స్నానం ఆచరించి తపస్సును చేసినట్లు వేదాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి ఈ క్షేత్రాన్ని నివతి సంగమంగా పేరొంది. మాగనూర్‌ మండలంలోని తంగిడి వద్ద ఈ నదులు కలిసే చోటును సంగమ క్షేత్రంగా అభివర్ణిస్తారు. దీనికి ప్రత్యేక స్థానముందని, ఇక్కడ దేవతలు, రుషులు, మునులు తపస్సును ఆచరించినట్లు పురాణాల్లో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోకి కష్ణమ్మ అడుగిడుతున్న ఈ ప్రాంతం ఒకప్పుడు దివ్యక్షేత్రంగా వెలుగొందింది.  దత్తాత్రేయ మొదటి మానవ అవతారమెత్తిన శ్రీపాదవల్లభుడు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జన్మించారు. 16ఏళ్ల ప్రాయంలో దేశ సంచారం చేస్తూ కొన్నాళ్లకు కార్తీకపౌర్ణమి నాడు తంగిడిలోని నివతి సంగమానికి చేరుకున్నారు. ఇక్కడ కొన్నేళ్లపాటు తపస్సు ఆచరించి అనంతరం కర్ణాటకలోని కుర్మగడ్డకు వెళ్లారు. ఇప్పటికీ ఈ సంగమంలో శ్రీపాదుడు తపస్సును చేసిన వినాయక విగ్రహం, ఆయన పాదుకలు, శివలింగం ఉన్నాయి. ఆయన ఇక్కడి నుండి కుర్మగడ్డకు నడుచుకుంటు వెళ్లిన మార్గంలో నదిలోని రాళ్లు నల్లరాయితో రోడ్డు వేసినట్లు కన్పిస్తాయి. ఈ విషయం తెలుసుకున్న విఠల్‌బాబా ఇక్కడే ఐదేళ్ల క్రితం ఇక్కడ దత్తభీమేశ్వర ఆలయం నిర్మించారు. ఈ నివత్తి సంగమంలో స్నానం ఆచరించిన వారికి పాపాలు నివత్తి అవుతాయని అంటారు. ఇలాంటి క్షేత్రం మరెక్కడా లేదని, ఇది ఒక మానస సరోవరమని దత్త పీఠాధిపతి నిత్యపూర్ణానంద సరస్వతి మహాస్వామి అంటున్నారు.
 
పుష్కరాల పుట్టుక
పుష్కరాల పుట్టకపై పురాణాల్లో ఓ కథ ఉంది. గౌతమ మహర్షి ఇచ్చిన శాపం నుంచి విముక్తి పొందేందుకు ఇంద్రుడు బ్రహ్మదేవున్ని ప్రార్థిస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు తన కమండలం ద్వారా పుష్కరుడిని స్మరించి కొంత నీటిని ఒక సరస్సులో చిలకరిస్తాడు. అప్పుడు ఇంద్రుడు ఆ సరస్సులో స్నానం ఆచరించిన తర్వాత పాప విముక్తి అయ్యెను. ఇది చూసిన బహస్పతి ఇంతటి మహత్తరమైన, పాప విముక్తిని చేసే పుష్కరుడు నిరంతరం బ్రహ్మదేవుని వద్ద ఉంటే లోకకల్యాణం ఎలా అని ఆలోచించాడు. అప్పుడే బ్రహ్మదేవున్ని బహస్పతి ప్రార్థించి ఆయన వద్ద ఉన్న పుష్కరుడిని తనతో పంపించాలని వేడుకున్నాడు. బ్రహ్మదేవుడు సమ్మతించి పుష్కరుడిని బహస్పతిని అనుసరించమని తెలిపాడు. కాగా పుష్కరుడు బ్రహ్మదేవున్ని సాన్నిహిత్యం వదులడం ఇష్టపడలేదు. నీవూ వస్తే బహస్పతి వెంట వెళ్తానని పుష్కరుడు అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఓ తీర్థమహారాజా బహస్పతి ఒక్కో రాశిలో ప్రవేశించినపుడు ఏడాదిలో 12రోజులపాటు తాను, సకల దేవతలు ఉంటారని అన్నాడు. అప్పటి నుంచి బహస్పతి ఏరాశిలో ప్రవేశిస్తే ఆనదికి పుష్కరాలు వచ్చినట్లు సంప్రదాయం ఉంది. ఈ12రోజులు సకల దేవతలు పుష్కరం వచ్చే నదిలో కొలువై ఉంటారు. కాబట్టి ప్రజలు పుష్కర సమయంలో స్నానం ఆచిరిస్తే సకలపాపాలు, దోషాలు పోయి, పుణ్యం లభిస్తుందని చెబుతారు.
 
 సోమశిల వద్ద సప్తనదీ సంగమం
 భక్తులకు ఓ మధుర జ్ఞాపకం
కొల్లాపూర్‌ : మండలంలోని సోమశిల సమీపంలో ప్రవహిస్తున్న కష్ణానది సప్తనదీ సంగమానికి నిలయం. ఏపీ–కర్నూలు జిల్లాలోని నదులతోపాటు మహబూబ్‌నగర్‌లో ప్రవహించే నదులు మంచాలకట్ట, మల్లేశ్వరం, సోమశిల సమీపంలో సంగమమవుతాయి. పుష్కరాల్లో కష్ణానదిలో స్నానమాచరించేందుకు విచ్చేసే భక్తులకు సప్తనదీ సంగమ తీరంలో స్నానం మధుర జ్ఞాపకంగా మిగలనుంది. ఇతర రాష్ట్రాల నుంచి కష్ణ, వేణి, తుంగ, భద్ర నదులు ప్రవహిస్తూ తెలుగు రాష్ట్రాల్లోకి వస్తుండగా మలపహారిని, భవనాసిని, భీమరథి అనేవి కష్ణానదిలో కలుస్తాయి. భవనాసిని నది కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం వద్ద ఉద్భవిస్తుంది. సప్త నదుల సంగమ ప్రాంతం కావడంతో ఇక్కడి ప్రాంతానికి సంగమేశ్వరం పేరు వచ్చింది. ఇక్కడ మహాభారత కాలంనాటి ధర్మరాజు ప్రతిష్టించిన వేప లింగం నేటికీ సంగమేశ్వరునిగా పూజలందుకుంటోంది. ఈ గుడి సోమశిల సమీపంలో ప్రవహిస్తున్న కష్ణానది అవతల కర్నూలు జిల్లా ప్రాంతంలో ఉంది. ప్రస్తుతం నది నీళ్లు గుడి చుట్టూ చేరుకున్నాయి. శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ పెరిగితేఇది నీటిలో మునిగిపోతుంది. సంగమేశ్వరం వద్ద స్నానం ఆచరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపిస్తారు. అయితే ఈ గుడికి ప్రస్తుతం చేరుకోవడం సాధ్యం కాదు. దీంతో సప్తనదుల నీళ్లు ప్రవహించే మంచాలకట్ట, మల్లేశ్వరం, సోమశిలలోనే కష్ణానది పుణ్య స్నానాలు ఆచరించినా పుణ్యఫలం లభిస్తుందని వేదపండితులు చెబుతున్నారు.  
 
సప్తనదుల సమాహారం గొందిమల్ల
అలంపూర్‌ రూరల్‌ : కష్ణా, తుంగభద్రా నదుల సంగమ క్షేత్రమే గొందిమల్ల. అలంపూర్‌ పుణ్యక్షేత్రానికి సుమారు 10కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండ్లమల ప్రాంతమే నేడు గొందిమల్లగా ప్రసిద్ధిగాంచింది. తుంగ సాక్షత్‌ నారాయణదేహ–భద్ర సాక్షత్‌ రుద్రదేహ అని శాస్త్రం చెబుతోంది. అంటే తుంగ అనేది నారాయణుడి దేహం, భద్ర అనేది ఈశ్వరుడి దేహమని అర్థం. ఈ రెండు శివకేశవులకు ప్రతిరూపం. వీటి సంగమమే తుంగభద్రగా పిలుస్తున్నారు. కాగా పూర్వం ఈ ప్రాంతం అనేక గుండ్లమలతో నిండి ఉండేది. అంటే రాళ్లదిబ్బతో అలరాలేది. ఆ ప్రాంతంలో కష్ణ, వేణి, భీమ, ఘటప్రభ, మలప్రభ నదులు, తుంగ–భద్ర అన్నీ కలిపి ఏడు నదుల సంగమ క్షేత్రంగా ఏర్పడింది. గుండ్లమల దగ్గర పూర్వం నది పరీవాహక ప్రాంతంలో అలనాటి రాజుల కోటలు ఉండేవి. అయితే అవి వరదలో కొట్టుకుపోయి కాలగర్భంలో కలసిపోయాయి. ప్రస్తుతం జోగుళాంబ ఘాట్‌గా నిర్మిస్తున్న ఈ ప్రాంతంలో కొత్తపేట ఉండేది. పూర్వం చాలా మంది కష్ణా తుంగభద్రానదికి వరదలు ఎక్కువగా వస్తాయని సంగమేశ్వరం వెళ్లడానికి అవకాశం లేక గొందిమల్ల దగ్గరే ఉండి జప తపాదులు, స్నానాలు ఆచరించేవారు. తుంగభద్ర ఇక్కడ ఉత్తర వాహినిగా, కష్ణా తూర్పుముఖంగా ప్రవహించేది. ఇలాంటి సప్తనది సంగమ క్షేత్రాల్లో ఎంతోమంది ఉపాసకులు ఈ నది తీరంలోని గుండ్లపై కూర్చుని అనుష్టానాలు చేసేవారు. అంతేగాక మాణిక్‌నగర్‌ సంస్థానం ముఖ్య పీఠాధిపతి అప్పదేశ్‌పాండే, మానిక్‌ప్రభు మహరాజ్‌ లాంటి మహాపురుషులు చాతుర్మాస దీక్షలో భాగంగా అప్పట్లో అక్కడ అనుష్టానాదులు చేసినవారే. 
 
 
 
మరిన్ని వార్తలు